
- ఎన్నికల్లో మోదీ నైతికంగా ఓడిపోయారు: సోనియా గాంధీ
- మోదీ ఏకాభిప్రాయమంటరు కానీ.. ఘర్షణకు రెచ్చగొడ్తరని ఫైర్
- ఓ ఇంగ్లిష్ న్యూస్ పేపర్లో ఆర్టికల్ రాసిన సీపీపీ చైర్ పర్సన్
న్యూఢిల్లీ: రాజ్యాంగంపై చేస్తున్న దాడి నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని ఎన్డీయే ప్రభుత్వం ఎమర్జెన్సీ అంశాన్ని తెరపైకి తెచ్చిందని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్ పర్సన్ సోనియా గాంధీ ఆరోపించారు. ‘‘రాజకీయంగా తటస్థంగా, నిష్పక్షపాతంగా ఉండాల్సిన స్పీకర్ కూడా ఎమర్జెన్సీ అంశంపై మాట్లాడటం దారుణం. ఎమర్జెన్సీపై దేశ ప్రజలు మార్చి 1977లో తగిన తీర్పును ఇవ్వడం చరిత్రలో నిలిచిన సత్యం. నాడు ప్రజా తీర్పును మేం అంగీకరించాం. ఆ తర్వాత మూడేండ్లకే తిరిగి అధికారంలోకి వచ్చాం. మోదీ, ఆయన పార్టీ ఎన్నడూ సాధించనంతటి మెజార్టీతో మా పార్టీ గెలవడం కూడా ఆ చరిత్రలో భాగమే” అని ఆమె పేర్కొన్నారు.
లోక్ సభ ఎన్నికల ఫలితాలతో మోదీ నైతికంగా ఓడిపోయారని, అయినా ఏమీ జరగనట్టు పదవిలో కొనసాగుతున్నారని విమర్శించారు. శనివారం ఓ ఇంగ్లిష్ న్యూస్ పేపర్ లో సోనియా ఈమేరకు ఆర్టికల్ రాశారు. లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయేకు సీట్లను ప్రజలు తగ్గించారని, ఇది మోదీకి రాజకీయంగా, వ్యక్తిగతంగా, నైతికంగా పరాజయమేనని అందులో స్పష్టం చేశారు. ‘‘ఆనవాయితీ ప్రకారం లోక్ సభలో డిప్యూటీ స్పీకర్ పదవిని ప్రతిపక్షాలకు ఇవ్వాలి. అలా ఇస్తే స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం అయ్యేలా మేం సహకరిస్తామని హామీ ఇచ్చాం. అయినా ప్రభుత్వం మా అభ్యర్థనను పట్టించుకోలేదు. ఏకాభిప్రాయం అంటూ మోదీ ప్రవచనాలు చెప్తారు. కానీ ఘర్షణ జరిగేలా రెచ్చగొడుతుంటారు” అని ఆమె విమర్శించారు.
ముందు మీ ఫ్యామిలీ గతం చూస్కోండి: బీజేపీ
సోనియా గాంధీ ఆర్టికల్‌పై బీజేపీ నేత ముక్తార్ అబ్బాస్ నఖ్వీ మండిపడ్డారు. అహంకారంతో మోదీపై దాడి చేయడానికి ముందు.. గాంధీ ఫ్యామిలీ గతంలో ఏం చేసిందో సోనియా చూసుకోవాలని కౌంటర్ ఇచ్చారు.
నీట్ పై మోదీ మౌనమెందుకు?
పరీక్షా పే చర్చ అంటూ ప్రోగ్రాంలు పెట్టే ప్రధాని మోదీ.. లక్షలాది మంది యువత భవిష్యత్తుతో ముడిపడి ఉన్న నీట్ అంశంపై మాత్రం ఎందుకు సైలెంట్ గా ఉన్నారని సోనియా ప్రశ్నించారు. నీట్ కుంభకోణం లక్షలాది మంది యువత జీవితాలను ప్రమాదంలో పడేసిందన్నారు. గత పదేండ్లలో ఎన్ సీఈఆర్ టీ, యూజీసీ, యూనివర్సిటీల ప్రొఫెషనలిజం తీవ్రంగా దెబ్బతిన్నదని ఆరోపించారు. పార్లమెంట్‌లోనూ చర్చించలేదని, దీనిపై ప్రభుత్వ, ప్రతిపక్షాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొందని ప్రస్తావించారు. మణిపూర్ 2023 మే నెల నుంచీ జాతుల వైరంతో మంటల్లో కాలిపోతుంటే ప్రధాని మోదీ అక్కడికి వెళ్లలేద ని సోనియా తప్పుపట్టారు. ఆ రాష్ట్రంలో సామాజిక సామరస్యం పూర్తిగా దెబ్బతిందని.. అయినా ఆ రాష్ట్రానికి వెళ్లేందుకు గానీ, అక్కడి నేతలతో మాట్లాడేందుకు గానీ ప్రధానికి టైం దొరకడంలేదని విమర్శించారు.