- భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలో ఘటన
రేగొండ, వెలుగు : వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న కోపంతో ఇద్దరు వ్యక్తులు కలిసి తమ తండ్రిని హత్య చేశారు. ఈ ఘటన భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రేపాక గ్రామంలో ఆదివారం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రేపాక గ్రామానికి చెందిన కుర్రె చేరాలు (55) భార్య హైదరాబాద్‌లో కుమారుల వద్ద ఉంటోంది. చేరాలు అదే గ్రామానికి చెందిన మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు.
ఈ విషయంపై కుటుంబసభ్యుల మధ్య పలుమార్లు గొడవలు జరిగాయి. ఈ క్రమంలో చేరాలు కుమారులు రామ్, లక్ష్మణ్ శనివారం రాత్రి హైదరాబాద్ నుంచి గ్రామానికి వచ్చారు. తమ తండ్రి మహిళ ఇంట్లో ఉన్నాడని తెలుసుకొని అక్కడికి వెళ్లి చేరాలుపై గొడ్డలితో దాడి చేశారు. అడ్డు వచ్చిన మహిళపై కూడా దాడి చేసి, ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసును లాక్కొని పరారయ్యారు. గమనించిన స్థానికులు చేరాలును హాస్పిటల్‌కు తరలించగా.. ట్రీట్‌మెంట్ తీసుకుంటూ చనిపోయాడు. కేసు నమోదు చేసి నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక టీమ్స్ ఏర్పాటు చేసినట్లు ఎస్సై సుధాకర్, సీఐ కరుణాకర్‌రావు తెలిపారు.
