మానవత్వం చాటిన సోనూసూద్ 

మానవత్వం చాటిన సోనూసూద్ 

మోగా : బాలీవుడ్ యాక్టర్ సోనూసూద్ మరోసారి మానవత్వం చాటుకున్నాడు. ఎవరికి ఏ కష్టమొచ్చినా ఆదుకునేందుకు ముందుండే ఆయన తాజాగా ఓ యువకుడి ప్రాణాలు కాపాడాడు. కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ యువకున్ని హాస్పిటల్కు తరలించి ప్రాణాపాయం నుంచి తప్పించాడు.

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సోనూసూద్ తన సోదరి, కాంగ్రెస్ మోగా అభ్యర్థి మాళవిక తరఫున ప్రచారంలో బిజీగా ఉన్నారు. సోమవారం ఎన్నికల ప్రచారం అనంతరం రాత్రి 9.45 గంటల సమయంలో క్యాంపెయినింగ్ ముగించుకుని ఇంటికి పయనమయ్యారు. ఆయన ప్రయాణిస్తున్న కారు మోగా భఠిండా రోడ్డులోకి రాగానే పక్కనే రెండు కార్లు ప్రమాదానికి గురైనట్లు గుర్తించారు. వెంటనే తన కారు ఆపిన సోనూ సూద్ యాక్సిడెంట్ జరిగిన చోటుకు పరుగున వెళ్లాడు. ప్రమాదంలో తీవ్రంగా దెబ్బతిన్న కారులో చిక్కుకుపోయిన ఓ యువకుడు చూసి వెంటనే అతన్ని బయటకు తీశాడు. తన కారులో దగ్గరలో ఉన్న హాస్పిటల్కు తీసుకెళ్లాడు.

హాస్పిటల్లో యువకునికి సరైన సమయంలో ట్రీట్మెంట్ అందడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. దాదాపు 15 నిమిషాల చికిత్స అనంతరం స్పృహలోకి వచ్చిన యువకుడి వివరాలు తెలుసుకుని కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. బుక్కన్బాలాకు చెందిన 26 ఏళ్ల యువకుడు గురుదేవ్ సింగ్ ఇంటికి తిరిగి వెళ్తుండగా ఎదురుగా వచ్చిన కారు ఢీకొట్టిందని చెప్పాడు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు చెప్పారు. కారు యాక్సిడెంట్లో గాయపడ్డ యువకున్ని సోనూసూద్ రక్షించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్గా మారింది. మరోసారి మానవత్వం చాటిన సోనూ మంచి మనసును పలువురు ప్రశంసిస్తున్నారు.