జేబులో పట్టే మినీ ఏసీ.. ఎండలో చల్లచల్లగా, హాయిగా.. సోనీ అదిరిపోయే కూల్ ఐడియా..

జేబులో పట్టే మినీ ఏసీ.. ఎండలో చల్లచల్లగా, హాయిగా.. సోనీ అదిరిపోయే కూల్ ఐడియా..

ఎండలు మండిపోతున్నాయి... ఈ రోజుల్లో బయట తిరగడం అంటే నిప్పుల కొలిమిలో నడిచినట్లే ఉంటోంది. ఈ సమస్యకు పరిష్కారంగా సోనీ సంస్థ 'రియాన్ పాకెట్ ప్రో ప్లస్' అనే ఒక కొత్త గ్యాడ్జెట్‌ను తీసుకొచ్చింది. దీనిని  మనం మెడలో వేసుకోగలిగే ఒక చిన్న వేరబుల్ ఎయిర్ కూలర్.

ఈ గ్యాడ్జెట్‌ 'పెల్టియర్ ఎఫెక్ట్' అనే టెక్నాలజీతో పనిచేస్తుంది. దీనిలో ఒక చిన్న మెటల్ ప్లేట్ ఉంటుంది. మనం దీనిని మెడ వెనుక భాగంలో అమర్చుకోవాలి. విద్యుత్తు సహాయంతో ఆ ప్లేట్ చల్లబడి, నేరుగా మన శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే, ఇది USB-C ద్వారా ఛార్జ్ అయ్యే ఒక 'ఎలక్ట్రానిక్ ఐస్ ప్యాక్' లాంటిది.

మెడ దగ్గరే ఎందుకు పెట్టుకోవాలి 
మన మెడ భాగంలో రక్త నాళాలు చర్మానికి చాలా దగ్గరగా ఉంటాయి. అందుకే మెడను చల్లబరిస్తే, రక్తం ద్వారా ఆ చల్లదనం శరీరం మొత్తానికి చేరి మనకు హాయిగా అనిపిస్తుంది. అందుకే స్పోర్ట్స్ ప్లేయర్స్  కూడా మెడ చుట్టూ చల్లని టవల్స్ వాడుతుంటారు.

కొత్త మోడల్‌ స్పెషాలిటీ
పాత మోడల్‌తో పోలిస్తే ఈ కొత్త మోడల్ 20% ఎక్కువ చల్లదనాన్ని ఇస్తుంది. చర్మ ఉష్ణోగ్రతను అదనంగా మరో 2°C వరకు తగ్గించగలదు. అలాగే మెడ చుట్టూ సౌకర్యవంతంగా పట్టేలా దీనిని రీ-డిజైన్ చేశారు. దీని వల్ల పదే పదే పడిపోకుండా  ఉంటుంది.

 మనం కాలర్ ఉన్న షర్ట్స్ వేసుకున్నా, లోపలి వేడి గాలిని బయటకు పంపేలా ఒక ప్రత్యేకమైన వెంట్ ఇందులో ఉంది. దీనితో పాటు ఒక చిన్న ట్యాగ్ సెన్సార్ కూడా వస్తుంది. ఇది బయట ఉన్న ఎండను, తేమను బట్టి కూలింగ్‌ను ఆటోమేటిక్‌గా అడ్జస్ట్ చేస్తుంది. దీనిని మొబైల్ యాప్ ద్వారా కూడా కంట్రోల్ చేయవచ్చు. దీని బ్యాటరీ లైఫ్ చూస్తే  హయ్యెస్ట్  కూలింగ్ పెట్టినప్పుడు  వరుసగా 10 గంటల వరకు పనిచేస్తుంది.

ధర ఇంకా లభ్యత
ప్రస్తుతానికి సోనీ ఈ గ్యాడ్జెట్‌ను కేవలం యూకే (199 పౌండ్లు), యూరప్ (229 యూరోలు) మార్కెట్లలోనే విడుదల చేసింది అంటే సుమారు  25 వేలకి పైగానే. సోనీ సంస్థ 2019 నుండి ఈ గ్యాడ్జెట్‌లను తయారు చేస్తున్నప్పటికీ, ఇప్పటివరకు వీటిని భారతదేశంలో విడుదల చేయలేదు. మన దేశంలోని ఎండలకు ఇది చాలా అవసరమైనప్పటికీ, ఈ కొత్త మోడల్ మన మార్కెట్లోకి వస్తుందో లేదో ఇంకా తెలియదు.