కవితతో కేటీఆర్, హరీశ్ చర్చలు

కవితతో కేటీఆర్, హరీశ్ చర్చలు

కాసేపట్లో.. ఢిల్లీ లిక్కర్ స్కామ్​లో ఈడీ విచారణకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హాజరుకానున్నారు. ఢిల్లీ ఏపీజే అబ్దుల్ కలాం రోడ్డులోని ఈడీ హెడ్ ఆఫీసుకు ఉదయం 10 గంటల 30 నిమిషాల వరకు ఆమె చేరుకోనున్నారు. 11 గంటలకు కవితను ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. ఈడీ ఇచ్చిన సమాచారం ప్రకారం షెడ్యూల్ ఈ విధంగా ఉంది. 

ఢిల్లీలోనే కేటీఆర్, హరీష్ రావు

ఈడీ విచారణకు బయలుదేరి వెళ్లే ముందు.. కవితతో భేటీ అయ్యి పలు అంశాలపై చర్చించారు మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు. దైర్యం చెప్పారు.. కుటుంబమే కాదు.. పార్టీ మొత్తం అండగా ఉందని.. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండాలని మనోదైర్యం  చెప్పారు. కేసు విచారణ తీరు, విచారణలో ఎదుర్కోబోయే అంశాలను న్యాయ నిపుణులతో సమక్షంలో చర్చించారు నేతలు. బీఆర్ఎస్ ​విస్తృత స్థాయి సమావేశం ముగిశాక కేటీఆర్ మరో ఇద్దరు ప్రజాప్రతినిధులతో కలిసి ఢిల్లీకి వెళ్లారు. ఆ తర్వాత హరీశ్​రావు కూడా వెళ్లారు. సీఎం కేసీఆర్ ​ఆదేశాల మేరకే వారు ఢిల్లీకి వెళ్లినట్లు తెలుస్తోంది. కవిత అరెస్టు తప్పదనే ప్రచారం జరుగుతున్న క్రమంలో.. కవితతో ప్రత్యేకంగా కేటీఆర్, హరీశ్ రావు భేటీ కావటం ప్రాధాన్యత సంచరించుకుంది.

లీగల్ టీమ్​తో కవిత భేటీ

మరోవైపు..లీగల్ టీమ్ కూడా ఢిల్లీకి చేరుకుంది. మహిళా రిజర్వేషన్లపై దీక్ష ముగిసిన తర్వాత ఆ టీమ్​తో కవిత భేటీ అయి, ఆమెకు న్యాయ సలహాలు ఇచ్చినట్టు సమాచారం. బలవంతంగా తన వాంగ్మూలాన్ని తీసుకున్నారన్న అరుణ్ పిళ్లై పిటిషన్​పై కూడా చర్చించినట్లు తెలిసింది. ఈడీ విచారణకు హాజరయ్యే ముందు కూడా లీగల్ ఒపీనియన్ తీసుకోనున్నారు.