
న్యూఢిల్లీ: ఇద్దరు విద్యార్థుల కోసం నీట్ పరీక్షను మళ్లీ పెట్టడం కుదరదని సుప్రీంకోర్టు పేర్కొంది. అందుకు స్టూడెంట్స్‌కు క్షమాపణలు కూడా చెప్పింది. ఇద్దరు విద్యార్థులకు మళ్లీ ఎగ్జామ్ పెట్టాల్సిందిగా బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. ఈ కేసు విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం పైవిధంగా స్పందించింది. బాంబే హైకోర్టు తీర్పుపై సుప్రీం స్టే విధించింది.
ఈ కేసు విచారణ సందర్భంగా కేంద్రం తరఫు న్యాయవాది వాదిస్తూ.. 16 లక్షల మంది స్టూడెంట్స్ నీట్ పరీక్షకు హాజరయ్యారని అన్నారు. కేవలం ఒకరిద్దరు విద్యార్థుల కోసం మళ్లీ పరీక్ష పెడితే.. ప్రతి ఏడాది పరీక్ష పెట్టాలని చాలా మంది డిమాండ్ చేస్తారని చెప్పారు. వాదనలు విన్న కోర్టు రీఎగ్జామ్‌కు నో చెప్పింది. ‘విద్యార్థులకు సారీ. వారి మీద మాకు సానుభూతి ఉంది. కానీ మళ్లీ పరీక్ష పెట్టమని ఆదేశించలేం’ అని వాదనలు విన్న జస్టిస్ ఎల్‌ఎన్ రావు అన్నారు. కాగా, ఈ ఏడాది నీట్ పరీక్షకు హాజరైన వైష్ణవీ భోపాలె, అభిషేక్ కాప్సే అనే విద్యార్థులకు ఇన్విజిలేటర్ సరిపోలని వేర్వేరు బుక్‌లెట్స్ ఇచ్చారు. దీంతో విద్యార్థులు బాంబే హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై వాదనలు విన్న కోర్టు.. ఇద్దరు స్టూడెంట్స్‌కు మళ్లీ పరీక్ష పెట్టాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని ఆదేశించింది.