
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 16 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి సీకే రామమూర్తి చేతిలో ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి సౌమ్యారెడ్డి న్యాయ పోరాటం చేయనున్నట్లు వెల్లడించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె జయనగర నుంచి పోటీ చేశారు.
మొదట ఆమే గెలించిందని అంతా భావించారు. నాటకీయ పరిణామాల మధ్య రీకౌంటింగ్ చేయడంతో బీజేపీ అభ్యర్థి రామమూర్తి గెలుపొందారు. దీంతో మనస్తాపానికి గురైన సౌమ్య ఈ నిర్ణయం తీసుకున్నారు. తన పోరాటానికి ప్రజల మద్దతు కావాలని ప్రజలను అభ్యర్థించారు.
ట్వీట్లో ఇలా...
ఈ సందర్భంగా ఆమె ఓ ట్వీట్ చేశారు. అందులో "నాకు ఓటు వేసిన జయనగర ప్రజలందరికీ ధన్యవాదాలు. ఇందుకు కృషి చేసిన నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు" అని ఉంది. 224 మంది సభ్యులున్న కర్ణాటక అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 135 స్థానాలు, బీజేపీ 66, జేడీఎస్ 19, ఇతరులు 4 స్థానాల్లో విజయం సాధించాయి.