
సౌరవ్ గంగూలీ..టీమిండియా లెజండరీ కెప్టెన్. దాదా, బెంగాల్ టైగర్ అంటూ అభిమానులు ముద్దుగా పిలుచుకునే గంగూలీ..ఇండియన్ క్రికెట్కు దూకుడు నేర్పించాడు. క్లిష్టసమయంలో భారత జట్టు పగ్గాలు అందుకుని..సక్సెస్ ఫుల్గా టీమ్ను లీడ్ చేశాడు. ఎంతో మంది యువక్రికెటర్లకు భవిష్యత్ ఇచ్చాడు. స్వదేశంలో అయినా..విదేశాల్లో అయినా..గంగూలీ సారథ్యంలో టీమిండియా అద్భుతమైన విజయాలు సాధించింది. క్రికెట్లో ఎన్నో హాఫ్ సెంచరీలు కొట్టిన దాదా..తన జీవితంలో ఇవాళ హాఫ్ సెంచరీ కొట్టాడు. 50వ పడిలోకి బెంగాల్ టైగర్ అడుగుపెట్టిన సందర్భంగా ..దాదా గురించి మరిన్ని ఆసక్తికర విశేషాలు..
క్రికెట్కు పరిచయం..
సౌరవ్ గంగూలీ పూర్తి పేరు సౌరవ్ చండీదాస్ గంగూలీ. 1972 జులై 8న కోల్ కతాలో గంగూలీ జన్మించాడు. అతని తండ్రి ముద్రణా వ్యాపారి. అప్పట్లో కోల్ కతాలో అత్యంత ధనవంతుల్లో గంగూలీ తండ్రి ఒకరు. గంగూలీ క్రికెట్ ఆడటం అతని తల్లిదండ్రులకు ఇష్టం లేదు. అయితే అతని అన్నయ్య స్నేహశీష్ గంగూలీ ఇచ్చిన ప్రోత్సాహంతో గంగూలీ క్రికెట్ నేర్చుకున్నాడు. స్నేహశీష్ అప్పటికే క్రికెట్లో మంచి పేరు సంపాదించుకున్నాడు. అతను ఎడమచేతి వాటం ప్లేయర్. నిజానికి గంగూలీ కుడిచేతి వాటం ప్లేయర్. కానీ.. తన అన్న పరికరాలు ఉపయోగించుకోవడం కోసం ఎడమ చేతి వాటంతో సాధన మొదలు పెట్టాడు. బ్యాట్స్మెన్ గా గంగూలీ ప్రతిభ కనపర్చటంతో అతన్ని క్రికెట్ అకాడమీలో చేర్పించారు. గంగూలీకి ఇంగ్లాడ్ లెఫ్టాండ్ బ్యాట్స్మన్ డేవిడ్ గోయర్ ఆట అంటే ఇష్టం. స్కూల్ క్రికెట్లో అండర్-15 జట్టు తరుపున ఒడిషా జట్టు మీద గంగూలీ సెంచరీ సాధించటంతో .. సెయింట్ జేవియర్స్ స్కూల్ కెప్టెన్గా గంగూలీ ఎంపికయ్యాడు.
అరంగేట్రం..
1990-91 రంజీ సీజన్ లో అనేక పరుగులు సాధించటంతో వెస్టిండీస్ వన్డే సిరీస్కు గంగూలీ ఎంపిక అయ్యాడు. ఫస్ట్ మ్యాచ్లో కేవలం మూడు పరుగులే చేశాడు. అయితే ఆట పట్ల.. అతని తీరు మీద వచ్చిన విమర్శలతో జట్టులో స్ఠానం పోగొట్టుకున్నాడు. గంగూలీ తిరిగి దేశవాళీ క్రికెట్లో అనేక పరుగులు సాధించాడు.1995-96 దులీప్ ట్రోఫీలో ఒకే ఇన్నింగ్స్ లో 171 రన్స్ చేసి తిరిగి జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. ఒకే వన్డే ఆడినప్పటికీ.. మొదటి టెస్టులో గంగూలీకి స్థానం దక్కలేదు. అయితే అదే సమయంలో కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ తో వివాదం కారణంగా నవజ్యోత్ సిద్దూ టూర్ నుంచి విరమించుకున్నాడు. అలా రెండో టెస్టులో రాహుల్ ద్రావిడ్తో కలిసి గంగూలీ అరంగేట్రం చేశారు. ఈ టెస్టులో గంగూలీ సెంచరీ సాధించి.. లార్డ్స్లో అరంగేట్రంలోనే సెంచరీ చేసిన మూడో క్రికెటర్గా రికార్డుకెక్కాడు. టెంట్ బ్రిడ్జ్లో జరిగిన మరో టెస్టులోనూ సెంచరీతో రెచ్చిపోయాడు. ఆ తర్వాత దాదా వెనక్కు తిరిగి చూసుకోలేదు.
కెప్టెన్గా తొలి అవకాశం..
1999-2000 సంవత్సరంలో మ్యాచ్ ఫిక్సింగ్ టీమిండియా క్రికెట్‌పై పెనుప్రభావం చూపిందని చెప్పాలి. ఫిక్సింగ్ ఆరోపణలతో సీనియర్లు టీమ్ కు దూరమయ్యారు. ఈ స్థితిలో సారథ్య బాధ్యతలు తీసుకునేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఆ సమయంలో గంగూలీ కెప్టెన్సీ తీసుకున్నాడు. ఆటగాడిగా దూకుడుగా ఉండే దాదా..నాయకుడిగా అంతే దూకుడుగా నిర్ణయాలు తీసుకున్నాడు. జట్టును విజయ పథంలో నడిపించాడు.
దాదా కెప్టెన్సీలో దీటుగా..
దాదా దూకుడును ప్లేయర్లు అలవర్చుకున్నాడు. గతంలో ఇతర టీమ్ల ఆటగాళ్లు స్లెడ్జింగ్ చేస్తే..మనోళ్లు కనీసం జవాబివ్వకపోయేవారు. కానీ గంగూలీ కెప్టెన్ అయ్యాక..ఆటగాళ్లకు బలమయ్యాడు. ప్రత్యర్థులు స్లెడ్జింగ్ చేస్తే..దీటుగా బదులివ్వడం నేర్చుకున్నారు టీమిండియా ప్లేయర్లు. దాదా దూకుడుకు నాట్ వెస్ట్ సిరీస్ మంచి ఉదాహరణ. లార్డ్స్ లో ఇంగ్లండ్ తో జరిగిన ఫైనల్లో బాల్కనీలో గంగూలీ తన షర్ట్ విప్పన సంఘటన..ఫ్యాన్స్ ఎప్పటికీ మర్చిపోరు. ఫైనల్లో యువరాజ్, కైఫ్ అద్భుతంగా ఆడటంతో..టీమిండియా విజయం సాధించింది. అదే దూకుడు కొనసాగించిన గంగూలీ...2003 వరల్డ్ కప్లో జట్టును ఫైనల్ చేర్చాడు. కానీ ఫైనల్లో ఆసీస్ చేతిలో టీమిండియా ఓడిపోయింది.
టాలెంట్ను ఎంకరేజ్ చేసిన దాదా..
కెప్టెన్గా గంగూలీ టాలెంట్ను ఎంకరేజ్ చేశాడు. అతని హయాంలో ఎంతో మంది యువకులు వెలుగులోకి వచ్చారు. యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, కైఫ్, గౌతమ్ గంభీర్, వీరేంద్ర సెహ్వాగ్, జహీర్ ఖాన్, ఎంఎస్ ధోనీ, ఆశిష్ నెహ్రా లాంటి వారు గంగూలీ టైంలోనే వెలుగులోకి వచ్చారు. వీరందరికి గంగూలీ అండగా నిలిచాడు. కెప్టెన్గా వెన్ను తట్టి ప్రోత్సహించాడు.
చాపెల్తో గొడవ..
2005లో గంగూలీ జట్టుకు దూరమయ్యాడు. ఫామ్ కోల్పోవడంతో జట్టులో చోటు కోల్పోయాడు. దీంతో వైస్ కెప్టెన్‌గా ఉన్న రాహుల్ ద్రవిడ్‌కు బీసీసీఐ కెప్టెన్సీని అప్పగించింది. గంగూలీ జట్టుకు దూరమవడంలో అప్పటి కోచ్ గ్రేగ్ ఛాపెల్ కీలక పాత్ర పోషించాడని చెప్పొచ్చు. ఇక గంగూలీ చివరగా.. ఆస్ట్రేలియాతో 2008 చివరి టెస్టు సిరీస్ ఆడాడు. ఆ తర్వాత పాకిస్థాన్ పై 2011లో చివరి వన్డే ఆడాడు. ఆ తర్వాత కొద్ది రోజుల పాటు ఐపీఎల్లో కొనసాగాడు. 2012లో అన్ని ఫార్మాట్లకు గంగూలీ గుడ్ బై చెప్పాడు. గతంలో క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ అధ్యక్షుడిగా పనిచేసిన గంగూలీ.. ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు.
టెస్టులు, వన్డేల్లో దాదా పరుగులు..
తన క్రికెట్ కెరియర్లో గంగూలీ..113 టెస్టులాడి ..7212 పరుగులు చేశాడు. ఇందులో 16 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీలున్నాయి. 311 వన్డేల్లో 11 363 పరుగులు సాధించాడు. ఇందులో 22 సెంచరీలు, 72 అర్థ సెంచరీలున్నాయి. ఇక గంగూలీ కెప్టెన్సీలో టీమిండియా 146 వన్డేలాడి 76 మ్యాచ్‌ల్లో గెలిచింది. 65 వన్డేల్లో ఓటమిపాలైంది. దాదా సారథ్యంలో 49 టెస్టుల్లో 21 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. 13 మ్యాచ్‌ల్లో ఓడిపోయి, 15 మ్యాచ్‌లు డ్రా చేసుకుంది.
సౌరవ్ గంగూలీ..భారత జట్టుకు పోరాటాన్ని నేర్పిన వీరుడు. ఎంతో మంది యువకులకు క్రికెట్ కెరియర్ను అందించిన గురువు. ధోనిలా జట్టుకు వరల్డ్ కప్లు అందించకపోయినా..ఆ స్పూర్తిని భవిష్యత్ ఆటగాళ్లలో నింపాడు.