
న్యూఢిల్లీ: ఐపీఎల్ ముగిసిన వెంటనే టీమిండియా ఆస్ట్రేలియా టూర్‌కు పయనమవ్వనుంది. ఈ సిరీస్‌లో మూడు ఫార్మాట్‌ల్లో పాల్గొనే ప్లేయర్ల వివరాలను రీసెంట్‌గా బీసీసీఐ ప్రకటించింది. అయితే బీసీసీఐ సెలక్షన్‌పై వివాదం రేగుతోంది. ఐపీఎల్‌లో బాగా రాణిస్తున్న ముంబై ఇండియన్స్ బ్యాట్స్‌మన్ సూర్యకుమార్ యాదవ్‌కు జట్టులో చోటు కల్పించకపోవడంపై సీనియర్ క్రికెటర్లు కామెంట్లు చేస్తున్నారు. గత రంజీ సీజన్‌లో అద్భుతంగా రాణించిన సూర్యకుమార్.. ఈ ఐపీఎల్‌లోనూ మంచి ఫామ్‌లోనే ఉన్నాడు. ముఖ్యంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో బుధవారం జరిగిన మ్యాచ్‌లో 79 రన్స్‌తో సూర్యకుమార్ ముంబైని గెలిపించడం అందర్నీ ఆకట్టుకుంది. హర్భజన్ సింగ్, మనోజ్ తివారీతోపాటు వెటరన్ క్రికెటర్, టీమిండియా మాజీ చీఫ్ సెలెక్టర్ దిలీప్ వెంగ్‌సర్కార్ సూర్యకుమార్‌ను ఎంపిక చేయకపోవడంపై పెదవి విరిచారు.
‘సూర్యను ఆసీస్ టూర్‌కు సెలెక్ట్ చేయకపోవడం నన్ను ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం దేశంలోని ట్యాలెంటెడ్ క్రికెటర్లలో సూర్య ఒకడు. ప్రతిభ, నైపుణ్యం విషయంలో టీమిండియాలోని బెస్ట్ క్రికెటర్లతో సూర్య పోటీపడగలడు. అతడు నిలకడగా పరుగులు చేస్తున్నాడు. అతడ్ని భారత జట్టులోకి తీసుకోవాలంటే ఇంకా ఏ ప్రాతిపదికత అవసరమో చెప్పాలి? ఏ బ్యాట్స్‌మన్ అయినా 26 నుంచి 34 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు అత్యుత్తమంగా రాణిస్తాడు. ఆ లెక్కన 30 ఏళ్లు ఉన్న సూర్య కెరీర్‌లో పీక్స్‌లో ఉన్నట్లే. ఒకవేళ ఫామ్, ఫిట్‌నెస్ కీలకం కాదనుకుంటే ఇంకేం కావాలో చెప్పాలి? రోహిత్ శర్మ గాయంతో టీమ్‌కు దూరమైనందున అతడి ప్లేస్‌లో సూర్య ఉంటే మిడిలార్డర్ బలపడుతుంది. సూర్యను ఎందుకు సెలెక్ట్ చేయలేదని సెలెక్టర్లను బీసీసీఐ ప్రెసిడెంట్ గంగూలీ తప్పకుండా ప్రశ్నించాలి’ అని వెంగ్‌సర్కార్ పేర్కొన్నారు.