కశ్మీర్పై ఫోకస్తో ఆజాద్ సొంత పార్టీ ?

కశ్మీర్పై ఫోకస్తో  ఆజాద్ సొంత పార్టీ ?

సీనియర్ నాయకుడు, అధిష్ఠానానికి అత్యంత సన్నిహితుడిగా పేరున్న గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పారు. ఆయన రాజీనామాతో హస్తం పార్టీకి పెద్ద షాక్ తగిలింది. ఈ నేపథ్యంలో ఆయన ఫ్యూచర్ ప్లాన్ ఏమిటి ? అనే దానిపై సర్వత్రా చర్చ మొదలైంది. కొన్ని మీడియా సంస్థలైతే కశ్మీర్ లో ఆజాద్  సొంత పార్టీని పెట్టబోతున్నారు అంటూ కథనాలను ప్రచురించాయి. కశ్మీర్ ప్రయోజనాల పరిరక్షణే ధ్యేయంగా గులాంనబీ ఆజాద్ కొత్త రాజకీయ పార్టీ పనిచేసే అవకాశాలు ఉన్నాయని ఆ కథనాల్లో ప్రస్తావించారు. ఇటీవల జమ్మూకశ్మీర్ కాంగ్రెస్ లో కీలక పదవిని కాంగ్రెస్ పార్టీ ఆయనకు ఆఫర్ చేసింది. అయితే దాన్ని స్వీకరించేందుకు ఆజాద్ అంగీకరించలేదు. సొంత పార్టీ యోచనలో ఉన్నందునే ఆ పదవికి ఆయన నో చెప్పారని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. 

జీ-23 నేతల్లో ఆజాద్ ఒకరు...

దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీ ప్రాభవాన్ని కోల్పోతున్న నేపథ్యంలో అందుకుగల కారణాలపై  అధిష్ఠానాన్ని ప్రశ్నిస్తోన్న ‘జీ 23’ నేతల్లో గులాంనబీ ఆజాద్‌ ఒకరు. ఇటీవల ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓటమి అనంతరం పార్టీలో చేపట్టాల్సిన సంస్థాగత మార్పులపై ఆజాద్‌ తీవ్రంగా గళమెత్తారు. ఈక్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీని గులాంనబీ ఆజాద్  చాలా సందర్భాల్లో, చాలా వేదికలపై బహిరంగంగానే కొనియాడారు. ‘‘ఎంత ఎత్తుకు ఎదిగినా ప్రధాని మోడీ.. తన మూలాలను మర్చిపోలేదు’’ అని ఒకానొక సందర్భంలో జమ్మూలో నిర్వహించిన సమావేశంలో వ్యాఖ్యానించారు. రాజ్యసభలో నిర్వహించిన ఆజాద్ వీడ్కోలు కార్యక్రమంలో స్వయంగా ప్రధాని మోడీ.. గులాం నబీ ఆజాద్ పై ప్రశంసల జల్లు కురిపించడం అప్పట్లో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.