టెస్ట్ ఛాంపియన్ షిప్ లో పాయింట్స్ టేబుల్ లో సౌతాఫ్రికా దూసుకొస్తోంది.టెస్ట్ ఛాంపియన్ షిప్ లో ఆస్ట్రేలియాను వెనక్కు నెట్టి రెండో స్థానానికి చేరుకుంది. డర్బన్ వేదికగా కింగ్స్ మీడ్ లో శ్రీలంకపై జరిగిన జరిగిన తొలి టెస్టులో భారీ విజయం సాధించడం ద్వారా సౌతాఫ్రికా విజయాలు శాతం 59.26 కు చేరుకుంది. భారత్ 61.11 శాతం విజయాలతో అగ్ర స్థానంలో కొనసాగుతుంది.
శనివారం (నవంబర్ 30) ముగిసిన తొలి టెస్టులో శ్రీలంకపై సౌతాఫ్రికా 233 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. 535 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 282 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా కేవలం 191 పరుగులకే ఆలౌట్ అయింది. శ్రీలంక బౌలర్లు అద్భుతంగా రాణించడంతో సౌతాఫ్రికా ఆటగాళ్లు పరుగులు చేయడానికి తంటాలు పడ్డారు. కెప్టెన్ టెంబా బవుమా ఒక్కడే 70 పరుగులు చేసి రాణించాడు.
తొలి ఇన్నింగ్స్ లో శ్రీలంక 13.5 ఓవర్లలోనే కేవలం 42 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో సౌతాఫ్రికాకు తొలి ఇన్నింగ్స్ లో 149 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. రెండో ఇన్నింగ్స్ లో బవుమా(113), స్టబ్స్(122) సెంచరీలతో సౌతాఫ్రికా ఐదు వికెట్లకు 366 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.
అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరగబోయే టెస్ట్ మ్యాచ్ లో భారత్ ఓడిపోతే మూడో స్థానానికి పడిపోయే అవకాశం ఉంది. సౌతాఫ్రికా సొంతగడ్డపై మరో మూడు టెస్ట్ మ్యాచ్ లు ఆడనుంది. ఈ మూడు మ్యాచ్ లు గెలిస్తే ఎలాంటి సమీకరణం లేకుండా టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు అర్హత సాధిస్తుంది. న్యూజీలాండ్, శ్రీలంక, ఇంగ్లాండ్ వరుసగా నాలుగు, ఐదు, ఆరో స్థానాల్లో నిలిచాయి.