కుక్క మాంసం తినడంపై బ్యాన్

కుక్క మాంసం తినడంపై బ్యాన్

సియోల్: వందల ఏండ్ల నుంచి వస్తున్న సంప్రదాయానికి దక్షిణ కొరియా ముగింపు పలకనుంది. పురాతన కాలం నుంచే ఆ దేశ ప్రజలకు కుక్క మాంసం తినడం అలవాటుగా ఉంది. ఇప్పుడు ఆ ట్రెడిషన్ పై నిషేధం విధించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. దీనిపై ఈ ఏడాది చివరి నాటికి చట్టం తెస్తామని అధికార పీపుల్ పవర్ పార్టీ ప్రకటించింది. కుక్కలను తినడంపై దేశవ్యాప్తంగా ఉన్న జంతు ప్రేమికుల నుంచి వస్తున్న వ్యతిరేకత కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. 

మూడేండ్లలో పూర్తిగా బంద్

ఈమధ్య కుక్క మాంసం వినియోగం తగ్గడంతో పాటు 64 శాతం మంది కొరియన్లలో వ్యతిరేకత పెరిగిందని సర్వేల్లో తేలింది. దానికి తోడు కొరియన్ ఫస్ట్ లేడీ కిమ్ కియోన్ హీ కూడా డాగ్స్ లవర్. వాటిని వధించడాన్ని ఆమె ఎన్నోసార్లు వ్యతిరేకించారు. అందుకు బిల్లును తెచ్చేందుకు ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాలేదు. ప్రస్తుతం తీసుకురాబోయే కుక్క మాంసం వినియోగ నిషేధ బిల్లును దశలవారీగా మూడేండ్లలో అమలు చేస్తామని అధికార పార్టీ ప్రకటించింది. ఆలోగా రెస్టారెంట్లు, మాంసం ఎగుమతిదార్లు, పెంపకందార్లకు ఇతర ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పింది. ప్రభుత్వ డేటా ప్రకారం దక్షిణ కొరియాలో కుక్కల పెంపకం కోసం1,150 ఫామ్​లు, 34 వధశాలలు, 219 మాంసం డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు, 1,600 రెస్టారెంట్లు ఉన్నాయి.