దమ్మున్న దక్షిణాది... జీడీపీలో 30 శాతం వాటా

దమ్మున్న దక్షిణాది... జీడీపీలో 30 శాతం వాటా

న్యూఢిల్లీ: మిగతా రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాలు ఆర్థికంగా దూసుకెళ్తున్నాయి. వీటి తలసరి ఆదాయం భారీగా పెరుగుతోంది. అప్పులు తక్కువగా ఉన్నాయి. ఆర్​బీఐ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించింది.  రాష్ట్రాల ఆర్థిక సర్వేల ప్రకారం, ఐదు దక్షిణ భారత రాష్ట్రాలు భారతదేశ జీడీపీకి 30 శాతానికి పైగా వాటాను ఇస్తున్నాయి. దేశ ఆర్థిక వృద్ధికి దోహదపడుతున్న రాష్ట్రాల జాబితాలో కర్నాటక, తమిళనాడు, ఆంధ్రా, కేరళ, తెలంగాణ రాష్ట్రాలు ముందున్నాయి.  ప్రస్తుతం తమిళనాడు రూ.24.8 లక్షల కోట్ల జీఎస్​డీపీతో (గ్రాస్​ స్టేట్​ డొమెస్టిక్​ ప్రొడక్ట్​) దక్షిణ భారతదేశంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది.   కర్నాటకకు రూ.22.4 లక్షల కోట్లు, తెలంగాణకు రూ.13.3 లక్షల కోట్లు, ఆంధ్రప్రదేశ్​కు రూ.13.2 లక్షల కోట్లు, కేరళకు రూ.10 లక్షల కోట్ల జీఎస్​డీపీ ఉంది. ఒక రాష్ట్రంలోని సేవలు, ఉత్పత్తుల మార్కెట్​ విలువను జీఎస్​డీపీ అంటారు. 

ఇతర హైలైట్స్​:
1. తలసరి ఆదాయం: ఈ పరామితి ప్రకారం, 2023 ఆర్థిక సంవత్సరంలో, తెలంగాణ అత్యధికంగా రూ.2,75,443 తలసరి ఆదాయాన్ని సాధించింది. దాని తర్వాత కర్నాటక రూ.2,65,623, తమిళనాడు రూ.2,41,131, కేరళ రూ.2,30,601, చివరగా ఆంధ్రప్రదేశ్ రూ.2,07,771 ఉన్నాయి. ఈ ఐదు రాష్ట్రాలకు జాతీయ సగటు రూ.1,50,007 కంటే ఎక్కువ తలసరి ఆదాయం ఉంది.
2. తక్కువ డెట్​-జీడీపీ నిష్పత్తి: తెలంగాణకు డెట్​ టూ జీఎస్​డీపీ నిష్పత్తి కేవలం 25.3శాతమే ఉంది. కర్నాటక (27.5శాతం), తమిళనాడు (27.7శాతం), ఆంధ్రప్రదేశ్ (32.8శాతం),  కేరళకు  37.2శాతం డెట్ ​--జీడీపీ నిష్పత్తి ఉంది. 
3. రాష్ట్ర పన్ను ఆదాయాలు: ఈ పరామితి ప్రకారం, తమిళనాడు అత్యధికంగా రూ.1,26,644 కోట్ల పన్ను రాబడులతో మొదటిస్థానంలో ఉండగా, మిగతా స్థానాల్లో కర్నాటక (రూ.1,11,494 కోట్లు), తెలంగాణ (రూ.92,910 కోట్లు), ఆంధ్రప్రదేశ్ (రూ.85,265 కోట్లు) ,  కేరళ (రూ.71,833 కోట్లు) ఉన్నాయి.
4. స్థూల ఆర్థిక లోటు (జీఎఫ్​డీ): ఆర్థిక క్రమశిక్షణ విషయంలో కర్నాటక మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా ఉంది. దీనికి కేవలం 2.8 శాతం ఆర్థిక లోటు ఉంది. మిగతా స్థానాల్లో  ఆంధ్రప్రదేశ్ (3.2శాతం), తమిళనాడు (3.8శాతం), తెలంగాణ (3.9శాతం), కేరళ (4.2శాతం) ఉన్నాయి. 
5. వడ్డీలకు ఆదాయ వనరుల నిష్పత్తి: ఈ విషయంలో  తెలంగాణ ముందంజలో ఉంది. దీనికి కేవలం 11.3శాతం వడ్డీ చెల్లింపుల నిష్పత్తి ఉంది. ఆ తర్వాత కర్నాటక (14.3శాతం), ఆంధ్రప్రదేశ్ (14.3శాతం), కేరళ (18.8శాతం),  తమిళనాడు (21శాతం) 
ఉన్నాయి.