రైతులకు గుడ్ న్యూస్.. తెలంగాణలోకి ప్రవేశించిన నైరుతి రుతు పవనాలు

రైతులకు గుడ్ న్యూస్.. తెలంగాణలోకి ప్రవేశించిన నైరుతి రుతు పవనాలు

హైదరాబాద్: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్. ఖరీఫ్ సీజన్ వ్యవసాయానికి జీవనధారమైన నైరుతి రుతు పవనాలు తెలంగాణలోకి ప్రవేశించాయి. ఆంధ్రప్రదేశ్‎లోని రాయలసీమ నుంచి గద్వాల్ జిల్లా మీదుగా నైరుతి రుతు పవనాలు తెలంగాణలోకి ప్రవేశించాయి. రానున్న రెండు మూడు రోజుల్లో నైరుతి రుతు పవనాలు రాష్ట్రమంతటా విస్తరించనున్నాయి. రుతు పవనాల ఆగమనంతో దక్షిణ, తూర్పు తెలంగాణ జిల్లాలకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. నైరుతి రుతు పవనాల ప్రభావంతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గి వర్షాలు కురవనున్నాయి. 

భారతదేశ వ్యవసాయ రంగానికి ప్రాణధారమైన నైరుతి రుతు పవనాలు దేశంలో చురుగ్గా కదులుతున్నాయి. 2026, మే 24న అండమాన్ నికోబార్ దీవులలోకి ప్రవేశించిన నైరుతి రుతు పవనాలు జూన్ 4న కేరళ తీరాన్ని తాకాయి. అటు నుంచి కర్నాటక, మహారాష్ట్ర మీదుగా జూన్ 6న ఆంధ్రప్రదేశ్ లోకి నైరుతి రుతు పవనాలు ఎంటర్ అయ్యాయి. 

ఏపీ మీదుగా జూన్ 8న నైరుతి రుతు పవనాలు తెలంగాణలోకి ప్రవేశించాయి. ప్రస్తుతానికి కేరళ, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల్లో పూర్తిగా విస్తరించిన నైరుతి రుతు పవనాలు ఏపీ, మహారాష్ట్రలో 30 శాతం వ్యాపించాయి. త్వరలోనే రాష్ట్రమంతటా విస్తరించనున్నాయి. రుతుపవనాల రాకతో పలు రాష్ట్రాల్లో వాతావరణంలో మార్పులు వచ్చి, పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. 

ALSO READ : నీట్ పేపర్ సెట్ చేసిన ప్రొఫెసర్లకు లాక్ డౌన్..

వర్షాలు కురువడంతో రైతులు వ్యవసాయ పనులు మొదలుపెడుతున్నారు. కాగా, పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడుతున్న ఎల్ నినో పరిస్థితుల ప్రభావంతో ఈ ఏడాది రుతుపవనాలు బలహీనపడే అవకాశం ఉందని.. దీనివల్ల ఈ ఏడాది దేశవ్యాప్తంగా వర్షపాతం సాధారణం కంటే 90-92% వరకు ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసిన విషయం తెలిసిందే.