- డెడ్రా గ్రామంలో ఉచిత వైద్య శిబిరం, 500 మందికి దుప్పట్లు పంపిణీ
బజార్‌హత్నూర్, వెలుగు: ఆదివాసీలు ప్రభుత్వ ఆస్పత్రిలోనే చికిత్స చేయించుకోవాలని, పిల్లల చదువుకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో శనివారం బజార్‌హత్నూర్ మండలం డెడ్రా గ్రామంలో ఉచిత వైద్య శిబిరం, దుప్పట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
హాజరైన ఎస్పీ మాట్లాడుతూ.. మారుమూల గ్రామాల ప్రజలు, పోలీసులకు మధ్య సత్సంబంధాలు మెరుగుపర్చుకోవడంలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. డెడ్రా, కోలాంగూడ గ్రామాల్లోని 500 మందికి దుప్పట్లు పంపిణీ చేశారు. విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు అందజేశారు. వైద్య శిబిరంలో జనరల్ మెడిసిన్, గైనకాలజీ, పీడియాట్రిక్, ఆర్థోపెడిక్, కంటి, దంత వైద్య నిపుణులతో సుమారు 200 మందికి పరీక్షలు నిర్వహించారు.
త్వరలోనే నిరుద్యోగ యువత కోసం జాబ్ మేళా నిర్వహిస్తామని పేర్కొన్నారు. ట్రైనీ ఐపీఎస్ రాహుల్ కాంత్, డీఎస్పీ ఎల్.జీవన్ రెడ్డి, బోథ్ సీఐ గురుస్వామి, ఎస్సై సంజయ్ కుమార్, ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్వెంకట్ రెడ్డి, ఇతర వైద్య బృందం, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
