సీఐపై అవినీతి ఆరోపణలపై ఎస్పీ ఎంక్వైరీ!

సీఐపై అవినీతి ఆరోపణలపై ఎస్పీ ఎంక్వైరీ!

సూర్యాపేట, వెలుగు: సూర్యాపేట జిల్లాలోని ఓ సీఐ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. ఇటీవల అతనిపై వరుసగా అవినీతి ఆరోపణలు రావడంతో ఎస్పీ కె. నరసింహ ప్రత్యేక దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. ప్రస్తుతం ఆ ఎంక్వైరీ రిపోర్ట్‌‌‌‌ను మల్టీ జోన్ ఐజీకి అందించగా త్వరలోనే చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఇటీవల ఒక మహిళకు అబార్షన్ చేస్తున్న క్రమంలో వైద్యం వికటించి ఆమె చనిపోయింది. 

ఈ కేసులో కొంతమందిని రిమాండ్ చేయగా ఒక ప్రజా ప్రజాప్రతినిధిని తప్పించేందుకు రూ.7 లక్షలు వసూళ్లు చేసినట్లు తెలిసింది. దీనిపై ఎంక్వైరీ చేయగా ముగ్గురు కానిస్టేబుళ్ల పాత్ర బయటపడడంతో వారిని ఐజీ ఆఫీస్ కు అటాచ్ చేశారు. ఇందులో సీఐ కీలకంగా వ్యవహరించినట్లు తేలినట్లు సమాచారం. కాగా చర్యలు చేపట్టకుండా ముందస్తుగా కొంత మంది నాయకుల దగ్గర పైరవీలు చేస్తున్నట్లు సమాచారం. 

కొన్ని నెలలుగా పెద్దఎత్తున వసూళ్లు చేస్తూ బాధితులకు అన్యాయం చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. నెల రోజుల కింద నిమజ్జనంలో లడ్డు వేలం విషయంలో ఇద్దరి మధ్య ఘర్షణ జరగి మనస్తాపంతో గొడవ పడిన వ్యక్తి పేరు రాసి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ కేసులో బాధ్యుడైన వ్యక్తిని కేసు నుంచి తప్పించేందుకు ఏకంగా రూ.3 లక్షలు వసూల్ చేసినట్లు తెలిసింది. 

ఇద్దరు ప్రేమికులు కుటుంబ సభ్యుల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోగా తమ మరణానికి కారణమంటూ ఆరుగురు పేర్లను రాసి చనిపోయాడు. ఈ కేసులో ప్రధాన నిందితులను తప్పించినట్లు సమాచారం. వీటితో పాటు మరికొన్ని కేసులలో సైతం భారీగా వసూల్‌‌‌‌ చేసినట్లు ఎంక్వైరీలో తేలడంతో త్వరలో ఆ సీఐపై వేటు వేసేందుకు పోలీస్ శాఖ సిద్ధమవుతున్నట్లు ఆ శాఖలోని కొంతమంది అధికారులు చెప్తున్నారు.