
సంగారెడ్డి టౌన్, వెలుగు: ప్రతి కేసులో నిందితులకు శిక్ష పడేవిధంగా చూడాలని తప్పు చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోవడానికి వీల్లేదని ఎస్పీ పరితోష్ పంకజ్ అన్నారు. శనివారం సంగారెడ్డి లోని జిల్లా పోలీస్ కార్యాలయంలో కోర్ట్ డ్యూటీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న నాన్ బెయిలబుల్ వారెంట్ ఎగ్జిక్యూట్ చేయాలని ఎస్డీపీఎస్ కేసుల్లో నిందితులకు తప్పనిసరిగా శిక్షపడేలా చూడాలన్నారు.
సైబర్ నేరాలకు సంబంధించి హోల్డ్ అయిన డబ్బులను బాధితులకు అందే విధంగా చూడాలన్నారు. ఈ నెల14 వరకు జరగనున్న స్పెషల్ లోక్ అదాలత్ లో రాజీ కుదుర్చుకోవడానికి అవకాశం ఉన్న అన్ని కేసుల్లో కక్షిదారులు రాజీ కుదుర్చుకునేలా చూడాలన్నారు. కోర్టు డ్యూటీ అధికారులు ఇటు న్యాయ శాఖకు, అటు పోలీస్ శాఖకు వారధిగా ఉంటూ కోర్టు మానిటరింగ్ సిస్టం లో జిల్లాను మొదటి స్థానంలో ఉంచాలని సూచించారు. సమీక్షలో అదనపు ఎస్పీ కె. శ్రీనివాసరావు, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ రమేశ్, కోర్టు లైజనింగ్ అధికారి సత్యనారాయణ, డీసీఆర్బీ సిబ్బంది, కోర్టు డ్యూటీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా షీ టీం బృందాలతో సమీక్ష..
జిల్లా వ్యాప్తంగా సబ్ డివిజన్‌లో ఉన్న షీ టీం బృందాలు ఉన్నాయని ప్రజలకు అందుబాటులో ఉంటున్నాయని, స్కూల్స్, కాలేజీ, బస్టాండ్ వంటి రద్దీ ప్రాంతాల్లో ఆకతాయిలకు చెక్ పెడుతున్నామని ఎస్పీ పరితోశ్ పంకజ్ అన్నారు. శనివారం సంగారెడ్డిలోని పోలీస్ కార్యాలయంలో షీ టీం బృందాలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. షీ టీం కంప్లైంట్స్, క్యూఆర్ కోడ్ స్కానర్ గురించి అవగాహన కల్పించారు. క్యూఆర్ కోడ్ ను వినియోగించుకోవాలన్నారు. 8712656772 కాల్ చేసి వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని చెప్పారు. .