నిర్మల్ జిల్లాలో తగ్గిన నేరాలు : ఎస్పీ ప్రవీణ్ కుమార్

నిర్మల్ జిల్లాలో తగ్గిన నేరాలు : ఎస్పీ ప్రవీణ్ కుమార్

నిర్మల్,  వెలుగు:  నిర్మల్ జిల్లాలో  క్రమంగా నేరాలు తగ్గుతున్నాయని ఎస్పీ ప్రవీణ్ కుమార్ వెల్లడించారు.  2023 సంవత్సరానికి సంబంధించిన పోలీసుశాఖ పనితీరుపై ఆయన గురువారం మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.  2022లో  3120  కేసులు నమోదు కాగా ఈ  సంవత్సరం 2 ,967  కేసులు నమోదయ్యాయన్నారు.   గత సంవత్సరం 58  తీవ్రమైన కేసులు నమోదు కాగా ఈ సారి 40 కేసులు మాత్రమే నమోదయ్యాయని వివరించారు.  గత సంవత్సరం 13 హత్య కేసులు నమోదు కాగా.. ఈ సారి కేవలం ఏడు మాత్రమే నమోదు అయినట్లు తెలిపారు. 

దొంగతనాల రికవరీ కేసులో గత సంవత్సరం 48. 75  శాతం ఉండగా ఈ సంవత్సరం కేవలం 26.77 శాతం మాత్రమే రికవరీ అయినట్లు వివరించారు.  డ్రంక్ అండ్ డ్రైవ్ లో గత సంవత్సరం 8,452 కేసులు నమోదు కాగా ఈసారి 7,632 కేసులు నమోదయ్యాయన్నారు.  పేకాట, మట్కా కేసులు కూడా గత సంవత్సరం కన్నా ఈసారి గణనీయంగా తగ్గాయన్నారు.  సైబర్ క్రైమ్ కేసుల్లో కూడా జిల్లా పోలీస్ శాఖ మెరుగైన పనితీరును కనబరిచిందన్నారు.  జిల్లాలోని సోన్ పోలీస్ స్టేషన్ పోలీసింగ్‌లో రాష్ట్రంలోనే మొదటి ర్యాంకు సాధించిందన్నారు. 

కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో హత్యలు పెరిగినయ్..

ఆసిఫాబాద్, వెలుగు:  కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో2023 ఏడాదిలో హత్యలు 35  శాతం పెరగ్గా మిగిలిన నేరాలు గణనీయంగా తగ్గాయని, పొలీస్‌ శాఖ తరపున పకడ్బందీ ప్రణాళిక కారణంగా నేరాల అదుపు సాధ్యపడిందని ఆసిఫాబాద్ ఎస్పీ సురేశ్ కుమార్‌‌ కుమార్ అన్నారు.  2023 ఏడాది పొలీస్ శాఖ వార్షిక నివేదికను గురువారం వెల్లడించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..   ఈ సంవత్సరంలో జిల్లాలో 19 హత్య కేసులు, 95 ఆస్తి నేరాలు, 4  నేరపూరిత హత్యలు, 04  దొమ్మి కేసులు, 21 కిడ్నాప్ కేసులు, 22  రేప్  కేసులు, 156 దాడి కేసులు, 88 మోసపు నేరాలు, 23 అట్రాసిటీ ,17 పొక్సో కేసులు, 09 గంజాయి కేసులు, 26 సైబర్ నేరాలు, 154 మహిళల పై అఘాయిత్య కేసులు నమోదు అయ్యాయని చెప్పారు. 

 గత ఏడాది తో పోల్చుకుంటే నేరాల్లో కేవలం హత్య కేసులు 35.71శాతం పెరగ్గా మిగిలిన అన్ని రకాల నేరాల్లో గణనీయంగా తగ్గిందని చెప్పారు.  పెంచికల్ పేట మండలంలో మావోయిస్టు పార్టీలో చేరడానికి వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను పట్టుకొని వారికి సహకరించిన వాళ్ల నుంచి 25 డిటోనేటర్లు, 10 జిలెటిన్ స్టిక్స్ స్వాధీనం చేసుకుని రిమాండ్ చేసినట్లు తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తి చేశామని చెప్పారు.