నల్గొండ అర్బన్, వెలుగు : జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోనున్నట్లు ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. మంగళవారం నల్గొండ మండలం ఎన్ హెచ్ 65లో అద్దంకి- –చర్లపల్లి బైపాస్, బ్లాక్ స్పాట్, ఎల్లారెడ్డిగూడెం –చెర్వుగట్టు వద్ద, అన్నపర్తి 12 వ బెటాలియన్ వద్ద రోడ్లను ఎస్పీ పరిశీలించారు. ప్రమాదాల నివారణకు కారణాలను తెలుసుకొని వేగ నియంత్రణ సూచిక బోర్డులు, రేడియం స్టిక్కర్స్ ఏర్పాటుపై పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిత్యం ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిసారించించాలని అధికారులకు చెప్పారు.
జిల్లాలోని నేషనల్ హైవే ,స్టేట్ హైవే, ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్ రోడ్లపై ఉన్న బ్లాక్ స్పాట్ లను గుర్తించి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట డీఎస్పీ శివరాంరెడ్డి, రూరల్ ఎస్ఐ సైదాబాబు, నార్కట్ పల్లి ఎస్ఐ క్రాంతి, డీటీఆర్బీ రిటైర్ సీఐ అంజయ్య, రోడ్డు సేఫ్టీ ఇంజినీర్లు ఉన్నారు.