
నాసా ఆస్ట్రో నాట్ మెడ వద్ద గడ్డకట్టిన రక్తం
అంతరిక్ష యాత్రల చరిత్రలో ఒక కొత్త ముచ్చట ఇది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్న ఓ ఆస్ట్రోనాట్‌కు మెడ వద్ద సిరలో రక్తం గడ్డ కట్టడంతో భూమిపై నుంచే ఓ డాక్టర్ విజయవంతంగా ట్రీట్‌మెంట్ చేశారు. భూమికి 320 కిలోమీటర్ల ఎత్తులో, గంటకు 27 వేల కిలోమీటర్ల స్పీడుతో తిరుగుతున్న ఐఎస్ఎస్‌లోని ఆస్ట్రోనాట్‌కు భూమి నుంచి చికిత్స చేయడం ఇదే ఫస్ట్. ‘ఫస్ట్ బ్లడ్ క్లాట్ ఇన్ స్పేస్’గా పేర్కొంటున్న ఈ సంఘటనలో ట్రీట్‌మెంట్ చేసిన వ్యక్తి నార్త్ కరోలినా యూనివర్సిటీ బ్లడ్ క్లాట్ ఎక్స్‌పర్ట్ డాక్టర్ స్టీఫెన్ మోల్ కాగా, పేషెంట్ (నాసా ఆస్ట్రోనాట్) పేరు బయటకు రాకుండా సీక్రెట్ గా ఉంచారు. ఐఎస్ఎస్‌కు వెళ్లిన నాసా ఆస్ట్రోనాట్ ఒకరికి మెడ వద్ద సిరలో రక్తం గడ్డ కట్టింది. సాధారణంగా ఎక్కువసేపు కూర్చునేవారికి కాళ్లలో నరాలు పైకి ఉబ్బి కన్పిస్తాయి. ఈ సమస్యనే డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంటారు. అయితే స్పేస్‌లో ఆస్ట్రోనాట్‌కు ఈ సమస్య రావడం ఇదే తొలిసారి. అది కూడా మెడ దగ్గర రక్తం గడ్డ కట్టడం, ఆయన స్పేస్‌లో ఉండటంతో రిస్క్ ఏర్పడింది. కానీ ఐఎస్ఎస్‌లో కొన్ని రకాల మందులు, అల్ట్రాసౌండ్ స్కానర్ తప్ప ఏమీ లేవు. మరోవైపు డాక్టర్‌ను ఐఎస్ఎస్‌కు పంపాలంటే టైం పడుతుంది. అందుకే భూమిపై నుంచి డాక్టర్ ఇచ్చే సూచనల ప్రకారం ఆస్ట్రోనాట్ ట్రీట్‌మెంట్ చేసుకున్నారు.
స్పేస్‌కు టెలీ మెడిసిన్..
మొదటగా ఆస్ట్రోనాట్ తన మెడను ఆల్ట్రాసౌండ్ స్కాన్ చేసి పంపించారు. దానిని డాక్టర్ మోల్ పరిశీలించాక, ఐఎస్ఎస్‌లో ఉన్న ఎనాక్సోపారిన్ ఇంజెక్షన్‌ను వేసుకోమని చెప్పారు. ఆ మందు 40 రోజులకు అయిపోయింది. తర్వాత భూమి నుంచి పంపిన అపిక్షాబన్ టాబ్లెట్లు మరో 50 రోజులు వేసుకున్నారు. 90 రోజుల ట్రీట్‌మెంట్ పూర్తయింది. ఇంతలో ఆ ఆస్ట్రోనాట్ భూమికి రావాల్సిన టైం వచ్చేసింది. ఆయన భూమి మీదకు రాగానే.. టెస్టులు చేయగా, రక్తం గడ్డ పూర్తిగా మాయమైందని తేలింది. ప్రస్తుతం స్పేస్‌లో రక్తం గడ్డ కడితే ఏం చేయాలనేదానిపై నాసా డాక్టర్లతో కలిసి డాక్టర్ స్టీఫెన్ మోల్ రీసెర్చ్ చేస్తున్నారు.