రోదసిలో రంగుల లోకం: నింగికి రుద్ర నేత్రం

రోదసిలో రంగుల లోకం: నింగికి రుద్ర నేత్రం

మనకు తెలిసిందల్లా భూమి. దానిపై ఉండే ఆకాశం. ఆ ఆకాశమే ఎన్నో అద్భుతాలకు వేదిక. రంగుల లోకం రోదసిలో మనకు కనిపించే అద్భుతాలు కొన్ని మాత్రమే. కనిపించని అందమైన అద్భుతాలెన్నో ఎన్నెన్నో ఉన్నాయి. అలాంటి వాటినే మన కళ్లకు కట్టారు ఫొటోగ్రాఫర్లు. 2019 ఆస్ట్రానమీ ఫొటోగ్రాఫర్​ ఆఫ్​ ద ఇయర్​ పోటీలకు పోటాపోటీగా ఫొటోలు తీసి పంపించారు. లండన్​లోని రాయల్​ అబ్జర్వేటరీ గ్రీన్​విచ్​ పెట్టిన 8వ విడత పోటీలకు 90 దేశాల నుంచి 4,600 మంది ఫొటోగ్రాఫర్లు తమ లక్కును చెక్​చేసుకునేందుకు వాళ్లు తీసిన రోదసి ఫొటోలను పంపించారు. పోటీలకు ఎంపికైన ఫొటోల్లో కొన్ని ఫొటోలివి.

నింగికి రుద్ర నేత్రం

ఆకాశానికి రుద్ర నేత్రం పెట్టినట్టు లేదూ ఈ నెబ్యులా. దీని పేరు ఎన్​జీసీ 7293. దాని రూపాన్ని బట్టి హెలిక్స్​ నెబ్యులా అనీ పిలుస్తారు. చూడ్డానికి కన్నులా, అందంగా కనిపిస్తున్నా దాని వెనక ఎన్నో తెలియని గొట్టు గుట్టులున్నాయి. ఈ ఫొటోను ఆస్ట్రేలియాకు చెందిన ఆండ్రూ క్యాంప్​బెల్​ తీశాడు.

 

 

సూరీడు.. నిద్దరోయిండు

పొలుసులూడిన చర్మంలా, గతుకుల వెలగపండులా, ఆకాశానికి బొట్టులా కనిపిస్తున్నది, మనకు వెలుగులిచ్చే సూర్యుడే. నిద్రపోయిండు. నిద్రావస్థలో (సోలార్​ మినిమమ్​) ఉన్న ఈ సూర్యుడి ఫొటోను అమెరికాకు చెందిన అలన్​ ఫ్రైడ్​మాన్​ క్లిక్​మనిపించాడు. ఎప్పుడూ నిప్పులు కురిపించే సూరీడు, కాస్తంత తగ్గి అందంగా అలరిస్తున్నాడు కదా.

 

నక్షత్రాల సుడి గుండం

నీళ్లు సుడులు తిరగడం చాలా సార్లు చూసి ఉంటారు. ఇది కూడా అంతే. నక్షత్రాల సుడిగుండం. దాన్నే మనం గెలాక్సీ అని పిలుచుకుంటాం. అగ్నిపర్వతం చిమ్మిన లావాలా భగభగమంటున్న ఆ గెలాక్సీ, చుట్టూ ఉన్న నక్షత్ర మండలాన్ని రంగు ముద్దలా మార్చింది. అమెరికాకు చెందిన బెర్నార్డ్​ ముల్లర్​, మార్టిన్​ ప్యూ కెమెరాలో లాక్​ చేసిన దీనిపేరు ఎన్​జీసీ 253. స్కల్ప్టర్​ గెలాక్సీ అని కూడా పిలుస్తారు.

 

నిజమైన చందమామ

మనకు దూరంగా కనిపించే చంద్రుడు తెల్లగా మెరిసిపోతుంటాడు. ఆ తెల్లదనంలోనే నల్లటి మచ్చతో దిష్టిచుక్క పెట్టుకున్నట్టు అనిపిస్తాడు. మరి, ఆ నల్లటి మచ్చేంటి. ఇదిగో ఇదే. భూమికున్నట్టే చంద్రుడికీ ఉన్న నేలది. ఆ నల్లటి మచ్చను కూడా భలే అందంగా చూపించాడు కదా పోర్చుగల్​కు చెందిన మిగెల్​ క్లారో.