నలుగురు టూరిస్టులు భూమిని చుట్టొచ్చిన్రు

నలుగురు టూరిస్టులు భూమిని చుట్టొచ్చిన్రు

న్యూఢిల్లీ: అంతరిక్ష ప్రయోగాల్లో స్పేస్​ఎక్స్​ మరో రికార్డు సృష్టించింది. ‘ఇన్​స్పిరేషన్​4’ అంతరిక్ష యాత్రను విజయవంతంగా పూర్తి చేసింది. స్పేస్​ ప్రయాణంపై ఎలాంటి అనుభవంలేని నలుగురు వ్యక్తులను మూడ్రోజులు భూమి చుట్టూ తిప్పి క్షేమంగా కిందికి తీసుకొచ్చింది. స్పేస్​లో పరిస్థితులపై ఆ నలుగురికి నార్మల్​ ట్రైనింగ్ మాత్రమే ఇచ్చి ప్రయోగాన్ని సక్సెస్​ఫుల్​గా పూర్తి చేసింది.

ఎక్కడి నుంచి స్టార్టయింది?

అమెరికాలోని నాసా ‘కెన్నెడీ’ స్పేస్​ సెంటర్​ నుంచి బుధవారం రాత్రి 8.02​ గంటలకు (లోకల్​ టైమ్ ప్రకారం) డ్రాగన్​ క్యాప్సుల్​తో ఫాల్కన్​ 9 రాకెట్ స్పేస్​లోకి బయలుదేరింది. 585 కిలోమీటర్ల ఎత్తుకు చేరింది. అంటే స్పేస్ స్టేషన్​(ఐఎస్​ఎస్) ఉంటున్న ఎత్తు కన్నా 165 కిలోమీటర్లు ఎక్కువ ఎత్తుకు వెళ్లింది. గంటకు 28 వేల కిలోమీటర్ల వేగంతో గంటన్నరకోసారి  భూమిని చుడుతూ రోజూ15 సూర్యోదయాలు, 15 సూర్యాస్తమయాలు చూసింది. నలుగురు వ్యక్తులు బిలియనీర్​ జారెడ్​ ఇసాక్​మన్, హేలీ ఆర్సెనెక్స్ (29), సియాన్ ప్రొక్టర్ (51), క్రిస్ సెంబ్రోస్కీ (42).. మూడ్రోజులు భూ కక్ష్యలో గడిపి తిరిగి కిందికి వచ్చారు. అమెరికా టైమ్​ ప్రకారం శనివారం రాత్రి 7.06 గంటలకు అట్లాంటిక్​ మహాసముద్రంలో క్యాప్సుల్​ ల్యాండయింది. 

ఎంత ఖర్చు చేశారో?

ఇన్​స్పిరేషన్​4కు ఎంత ఖర్చుచేశారో బయటకు చెప్పలేదు. ఈ మిషన్​ను బిలియనీర్​ ఇసాక్​మన్​ కొన్నారు. మరో ముగ్గురు సాధారణ వ్యక్తులకు చాన్స్​ఇచ్చారు. సెయింట్​ జూడ్​ చిల్డ్రన్ రీసెర్చ్​ హాస్పిటల్​ కోసం రూ.1,500 కోట్లు ఫండ్​ సేకరించాలనేది ప్రయోగం ఉద్దేశం. శనివారం వరకు రూ.1,100 కోట్లు వచ్చాయి. ఇసాక్​మన్​ రూ. 730 కోట్లు,  డొనేషన్స్​ ద్వారా రూ.440 కోట్లు వచ్చాయి. మిగతా రూ.400 కోట్ల మొత్తాన్ని తాను ఇస్తానని ఎలాన్​ మస్క్ ట్వీట్​ చేశారు.మూడ్రోజులు స్పేస్​లో గడిపిన నలుగురు టూరిస్టులు డ్రాగన్​ క్యాప్సుల్​ద్వారా భూమిపైకి తిరిగొచ్చారు. నాలుగు పారాచూచ్​ల సాయంతో అట్లాంటిక్​ మహా సముద్రంలో క్యాప్సుల్​దిగింది. అప్పటికే చిన్న పడవల్లో వెయిట్​ చేస్తున్న స్పేస్​ఎక్స్​ సిబ్బంది.. ఆ క్యాప్సుల్​ను తాళ్లతో పెద్ద బోటుపైకి తీసుకొచ్చి క్యాప్సుల్​డోర్​ను ఓపెన్​చేశారు. టూరిస్టులు మెల్లగా బయటకు వచ్చారు.