ఆలివ్​ ఆయిల్​ బాటిల్స్​కు సెక్యూరిటీ

ఆలివ్​ ఆయిల్​ బాటిల్స్​కు సెక్యూరిటీ
  • స్పెయిన్​ సూపర్​ మార్కెట్లలో దొంగతనాలు
  • రెండేళ్లలో 150 శాతం పెరిగిన రేటు

వెలుగు బిజినెస్​ డెస్క్​: స్పెయిన్​లోని సూపర్​ మార్కెట్లు  ఆలివ్​ ఆయిల్​ బాటిల్స్​ను బీరువాలలో పెట్టి తాళాలు వేసి మరీ జాగ్రత్త చేస్తున్నాయి. ఎందుకంటే, గత రెండేళ్లలో ఆలివ్​ ఆయిల్​ రేటు భారీగా అంటే 150 శాతం  పెరిగింది. ప్రస్తుతం ఒక లీటర్​ ఆలివ్​ ఆయిల్​ బాటిల్​  15.77 డాలర్ల (రూ. 1,315)కు అమ్ముడుపోతోంది. అంటే, 14.5 యూరోలు.  దీంతో రిటెయిలర్లు ఆలివ్​ ఆయిల్​ బాటిల్స్​ను కాస్మెటిక్స్​, అప్లయెన్సెస్​, మద్యపానీయాలు వంటి ఖరీదైన ఇతర వస్తువులతో సమానంగా చూస్తున్నారు. దక్షిణ యూరప్​లో కరువు పరిస్థితులు నెలకొనడం వల్లే ఆలివ్​ ఆయిల్​ రేటు పెరిగిందని చెబుతున్నారు. ఈ ప్రాంతమే చాలా ఎక్కువగా ఆలివ్​ ఆయిల్​ను ప్రొడ్యూస్​ చేస్తుంది. స్పెయిన్​తో పాటు, ఇటలీ, గ్రీస్, పోర్చుగల్​ వంటి దేశాలలో ఆలివ్​ ఆయిల్​ ప్రొడక్షన్​ ఎక్కువ.  ఆలివ్​ ఆయిల్​ కొనే కుటుంబాలు ఇప్పుడు రేట్లు పెరగడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ప్రపంచపు ఆలివ్​ ఆయిల్​ ప్రొడక్షన్​లో 40 శాతం ఒక్క స్పెయిన్​ దేశం నుంచే వస్తోంది.

షాపుల నుంచి ఆలివ్​ ఆయిల్​ ఎత్తుకెళ్లడం (దొంగిలించడం) పెరుగుతోందని టు సూపర్​ ( స్పెయిన్​లోని ఒక  సూపర్​ మార్కెట్​ చెయిన్​) సీఈఓ రూబెన్​ నవారో చెప్పారు. ఆలివ్​ ఆయిల్​ బాటిల్స్​ను దొంగిలించడం దొంగలకు ఆకర్షణీయంగా మారిందని ఆయన పేర్కొన్నారు. ఫలితంగా 5 లీటర్ల ఆలివ్ ఆయిల్​ బాటిల్స్​ను చెయిన్స్​తో కలిపి షెల్ఫ్​లకు ఆ చెయిన్​ను కట్టి జాగ్రత్త చేస్తున్నట్లు వివరించారు. ఈ ఏడాది సెప్టెంబర్​ నుంచీ ఇదే పద్ధతి పాటిస్తున్నట్లు నవారో వెల్లడించారు. వచ్చే ఏడాది జూన్​ దాకా ఆలివ్​ ఆయిల్​ ప్రొడక్షన్​ పెరిగే సూచనలు కనబడటం లేదు. అంటే, ధరలు  ఇప్పట్లో దిగి రావన్నమాట. స్పెయిన్​లోని  కేర్​ఫర్, ఔచన్​ సూపర్​ మార్కెట్లు కూడా ఆలివ్​ ఆయిల్​ బాటిల్స్​కు సెక్యూరిటీ ట్యాగ్స్​ పెడుతున్నాయి.