మేడారం, భద్రకాళి ఆలయాల మధ్య స్థల వివాదం

మేడారం, భద్రకాళి ఆలయాల మధ్య స్థల వివాదం
  •     వరంగల్‌‌‌‌‌‌‌‌ సెంట్రల్‌‌‌‌‌‌‌‌ జైల్‌‌‌‌‌‌‌‌ ఎదుట 1,014 గజాల స్థలంలో ధార్మిక భవన్‌‌‌‌‌‌‌‌ నిర్మాణం
  •     బిల్డింగ్‌‌‌‌‌‌‌‌లోని రెండు ఫ్లోర్‌‌‌‌‌‌‌‌లలో వేద పాఠశాల నిర్వహణకు ఆదేశాలు
  •     ఆ భూమిని 30 ఏండ్ల క్రితమే తమకు కేటాయించారంటున్న  మేడారం పూజారులు
  •     మేడారంలో ధర్నాకు దిగిన పూజారులు, కుటుంబ సభ్యులు
  •     మంత్రి సీతక్క హామీతో ధర్నా విరమణ

వరంగల్‍/తాడ్వాయి, వెలుగు :  మేడారం సమ్మక్క సారలమ్మ పూజరులు, ఓరుగల్లులోని భద్రకాళి ఆలయ అర్చకుల మధ్య కొంతకాలంగా భూ వివాదం నడుస్తోంది. వరంగల్‌‌‌‌‌‌‌‌ సెంట్రల్‌‌‌‌‌‌‌‌ జైల్‌‌‌‌‌‌‌‌ ఎదురుగా ఉన్న 1,014 గజాల స్థలంలో భద్రకాళిఆలయ అర్చకులు వేదపాఠశాల నిర్మించేందుకు ప్లాన్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారు. ఇదే ఇరు వర్గాల మధ్య గొడవకు దారి తీసింది. ఇదే విషయంపై మేడారం ప్రధాన పూజరుల బృందం గతంలో నిరసనలకు దిగింది. అయినా సమస్య పరిష్కారం కాకపోవడంతో పూజారులు బుధవారం ధర్నాకు దిగేందుకు ప్రయత్నించారు.

30 ఏండ్ల కింద తమకు ఇచ్చారంటున్న మేడారం పూజారులు

రెండేళ్లకు ఓ సారి జరిగే మేడారం జాతర ముగిసిన తర్వాత హుండీల లెక్కింపుతో పాటు, ఆలయ నిర్వహణ గ్రేటర్‌‌‌‌‌‌‌‌ వరంగల్‌‌‌‌‌‌‌‌ నుంచే జరుగుతోంది. ఈ క్రమంలో మేడారం ఆఫీస్‌‌‌‌‌‌‌‌ కోసం 1993లో ప్రభుత్వానికి నివేదించగా 1994లో అప్పటి గిరిజన శాఖ మంత్రి పోరిక జగన్నాయక్‌‌‌‌‌‌‌‌ ఆదేశానుసారం జైలు ఎదురుగా ఉన్న సర్వే నంబర్‌‌‌‌‌‌‌‌ 725లో 1,014 గజాల స్థలాన్ని కేటాయించినట్లు మేడారం పూజారులు చెబుతున్నారు. అయితే మేడారం దేవస్థానం పేరుతో స్థలం ఇవ్వడం కుదరని నేపథ్యంలో 1998 మార్చి 23న దేవాదాయ శాఖ సహాయ కమిషనర్‌‌‌‌‌‌‌‌ పేరుతో స్థలాన్ని కేటాయించారని అంటున్నారు. ఈ స్థలం చుట్టూరా ఫెన్సింగ్‌‌‌‌‌‌‌‌ సైతం ఏర్పాటు చేశామని గుర్తు చేస్తున్నారు.

 రూ.4 కోట్లతో ధార్మిక భవన్‌‌‌‌‌‌‌‌

వరంగల్‌‌‌‌‌‌‌‌ దేవాదాయ శాఖ ఆధీనంలో ఉన్న ఈ స్థలంలోనే మేడారం ఈవో ఆఫీస్‌‌‌‌‌‌‌‌ నడుస్తోంది. ఈ స్థలంలో కొన్ని నెలల క్రితం ధార్మిక భవన్‌‌‌‌‌‌‌‌ పేరుతో నాలుగు అంతస్తుల బిల్డింగ్‌‌‌‌‌‌‌‌ నిర్మించారు. మేడారం జాతర నిధులు, భద్రకాళి దేవస్థానం, మడికొండలోని మెట్టు రామలింగేశ్వరస్వామి దేవస్థానం నిధులు రూ.4 కోట్లతో బిల్డింగ్‌‌‌‌‌‌‌‌ను నిర్మించేలా ఆఫీసర్లు ఉత్తర్వులు ఇచ్చారు. ప్రస్తుతానికి భవన నిర్మాణం పూర్తయింది. సమ్మక్క సారలమ్మ ఆలయ ఆఫీస్‍తో పాటు దేవాదాయ శాఖ ఉప కమిషనర్‍, సహాయ కమిషనర్‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌లు సైతం ఇక్కడే నడుస్తున్నాయి. ప్రస్తుతం ఈ స్థలం రూ. 12 నుంచి రూ. 15 కోట్ల మధ్య పలుకుతోంది. 

వివాదంగా వివాదంగా వేద పాఠశాల ఏర్పాటు

ధార్మిక భవన్‌‌‌‌‌‌‌‌లో వేద పాఠశాల ఏర్పాటు చేయాలన్న ఆలోచనే ఇప్పుడు వివాదానికి కారణమైంది. ధార్మిక భవన్‌‌‌‌‌‌‌‌లోని ఫస్ట్‌‌‌‌‌‌‌‌, ఫోర్త్‌‌‌‌‌‌‌‌ ఫ్లోర్‌‌‌‌‌‌‌‌లను వేద పాఠశాలకు కేటాయిస్తూ ఆఫీసర్లు ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. భద్రకాళి ఆలయ మాఢవీధుల నిర్మాణం నేపథ్యంలో పాఠశాల నిర్వహణకు తాత్కాలికంగా అనుమతి ఇచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. 

అయితే ధార్మిక భవన్‌‌‌‌‌‌‌‌ను వేదపాఠశాలకు కేటాయించడాన్ని మేడారం పూజారులు వ్యతిరేకిస్తున్నారు. తమకు కేటాయించిన స్థలంలో తమ ప్రమేయం లేకుండా ఆఫీసర్లు నిర్ణయాలు తీసుకోవడాన్ని తప్పు పడుతున్నారు. భవనాన్ని ఎండోమెంట్‌‌‌‌‌‌‌‌ కార్యాలయాల నిర్వహణకు వాడుకోవడానికి అభ్యంతరం లేదని కానీ ఆ ఆఫీసులను ఖాళీ చేయించి వేద పాఠశాలకు కేటాయించే ప్రసక్తే లేదంటున్నారు. కావాలంటే ధార్మిక భవన్‌‌‌‌‌‌‌‌ నిర్మాణానికి అయిన మొత్తం ఖర్చును మేడారం జాతర నిధుల్లోంచి చెల్లిస్తామని, అప్పుడు సమ్మక్క సారలమ్మ ధార్మిక భవన్‌‌‌‌‌‌‌‌గా పేరు మారుస్తూ ప్రభుత్వం జీవో ఇవ్వాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారు.

ధర్నాకు దిగిన మేడారం పూజారులు..సమస్యను పరిష్కరిస్తామన్న మంత్రి సీతక్క

ధార్మిక భవన్‌‌‌‌‌‌‌‌ను వేద పాఠశాలకు కేటాయించడంతో కొన్ని రోజులుగా నిరసనలు తెలుపుతూ వస్తున్న మేడారం పూజరులు, తమ కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం ధర్నాకు సిద్ధమయ్యారు. సమ్మక్క సారలమ్మ గద్దెల ముఖద్వారం ముందు నల్ల బ్యాడ్జీలతో నిరసన చేపట్టారు. ధార్మిక భవన్‌‌‌‌‌‌‌‌, స్థలం మేడారం ఆలయానికి దక్కకుండా భద్రకాళి ఆలయ అర్చకులు, ఆఫీసర్లు ప్రయత్నాలు చేస్తున్నారని పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు ఆరోపించారు. 

ఈ ధర్నాకు తుడుందెబ్బ అధ్యక్షుడు మైపతి అరుణ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌ మద్దతు తెలిపారు. పూజారుల ధర్నా విషయం తెలుసుకున్న మంత్రి సీతక్క అక్కడికి వెళ్లి వారితో మాట్లాడారు. దేవాదాయశాఖ మంత్రిగా కొండా సురేఖ సైతం ఓరుగల్లు నుంచే ఉండడంతో సమస్యను సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. దీంతో పూజారులు ధర్నాను విరమించారు.