
కేంద్ర మంత్రిగా, ఉమ్మడి రాష్ట్ర మంత్రిగా, దళిత, గిరిజన, బడుగు, బలహీన వర్గాల కోసం జీవితాంతం పనిచేసిన మహోన్నత నేత వెంకటస్వామి (కాకా). ఆయన జయంతి సందర్భంగా నా ఘన నివాళులు. ఏడు సార్లు పార్లమెంట్ సభ్యుడిగా, ఉమ్మడి రాష్ట్రంలో మూడు సార్లు శాసనభ్యుడిగా చట్ట సభలకు ఎన్నికయ్యారంటే ప్రజలకు ఆయన చేసిన నిస్వార్థ సేవలే కారణం.
నేను రాజకీయాల్లోకి రావడానికి రాజీవ్ గాంధీ, వెంకటస్వామి, వైఎస్‌ఆర్‌లే కారణం. రాజీవ్ గాంధీ దేశ భవిష్యత్ కోసం పథకాలు అమలు చేశారు. వైఎస్ ఆర్ అన్ని వర్గాల మేలు కోసం సంక్షేమ పథకాలు అమలు చేశారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశంలో దళిత, గిరిజన, బడుగు, బలహీన వర్గాల కోసం కేంద్ర కార్మిక శాఖ, సివిల్ సప్లైస్ శాఖ మంత్రిగా ఎక్కువ సంక్షేమ ఎక్కువ పథకాలను ప్రారంభించి అమలు చేయించిన నేత వెంకటస్వామి.
రేషన్ షాపుల ద్వారా ఆహార ధాన్యాల పంపిణీ, వృద్ధులకు పెన్షన్ స్కీమ్ ప్రారంభించడంతో పాటు కార్మికుల సంక్షేమం కోసం అనేక చట్టాలను అమలు చేసింది కూడా వెంకటస్వామినే. ఈ రోజు దేశంలో పేదలు కడుపు నిండా అన్నం తింటున్నారంటే, కార్మికులు భవిష్యత్‌పై భరోసాగా ఉంటున్నారంటే దానికి కారణం కూడా కాకానే. దళిత వర్గం నుంచి వచ్చిన వెంకటస్వామి గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఎదిగి దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న మహానాయకుడు.
పేదలకు సేవలు అందించాలని వాళ్ల స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అన్ని వర్గాల ప్రజలకు అందించేందుకు నా వంతుగా కృషి చేస్తున్న. కాకాతో నాకు 16 ఏండ్ల అనుబంధం ఉంది. నాకు వరుసకు మామ అవుతారు. నాపై అత్యంత ఆప్యాయత, అనురాగం చూపేవారు. పేదలకు కాకా కొండంత అండగా నిలిచారు. బడుగుల అస్తిత్వం కోసం జీవితాంతం శ్రమించి, శ్రామికులు, పేదలకు గూడు కల్పించేందుకు గుడిసెలు వేయించి తన ఇంటిపేరే గుడిసెల వెంకటస్వామి అనుకునేలా సేవచేసిన గొప్ప నాయకుడు కాకా.
హైదరాబాద్ నడిబొడ్డున ఎంతో మందికి ఇండ్లను ఇప్పించిన ఘనత కాకాకే దక్కింది. 1949లో మొదటిసారిగా జాతీయ గుడిసెల సంఘం ఏర్పాటు చేసి పేదల పక్షాన నిలిచారు. పేదల గుండెల్లో కాకా ఎప్పటికీ నిలిచి ఉంటారు. కాకాను ఆదర్శంగా తీసుకొని నేను కూడా నా వికారాబాద్ నియోజకవర్గంలో ఇండ్లులేని పేదలకు ఇందిరమ్మ ఇండ్లను అందించడమే లక్ష్యంగా పెట్టకున్నా. గృహనిర్మాణం, విద్య, వైద్యం ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలు. వాటికోసం కాకా ఆనాడు పోరాడిన నేపథ్యమే నాకు స్ఫూర్తి. బడుగులు నేడు దేశంలో అన్ని రంగాల్లో రాణిస్తున్నారంటే దాంట్లో కాకా పాత్ర ఉంది. తెలంగాణ ఉద్యమంలోనూ కాకా తనదైన ప్రత్యేకతను చాటుతూ ఉద్యమం కోసం చేసిన ప్రయత్నాలు తెలంగాణ సమాజం ఎన్నటికీ మరిచిపోదు.
తొలిదశ, మలిదశ ఉద్యమాల్లో చురుకైన రాజకీయ ఎత్తుగడలతో రాష్ట్ర సాధన ఉద్యమంలో తనదైన కీలక భాగస్వామ్యాన్ని ఇచ్చాడు.‘కాకా’ పెద్దకొడుకు గడ్డం వినోద్ ఎమ్మెల్యేగా, చిన్న కొడుకు వివేక్ వెంకటస్వామి రాష్ట్ర మంత్రిగా, మనవడు వంశీకృష్ణ పార్లమెంట్ సభ్యుడిగా ఆయన బాటలోనే నడుస్తూ ప్రజలకు సేవ చేస్తున్నారు. వెంకటస్వామి మన నుంచి దూరమై 11 ఏండ్లు అవుతున్నా కూడా ఆయన పేదలకు అందించిన పథకాలు, కార్మికుల కోసం చేసిన చట్టాలు కోట్లాది మందికి భరోసా ఇస్తున్నాయి. నేటి రాజకీయ నాయకులకు వెంకటస్వామి ఆదర్శం. కాకా బాటలోనే మనందరం నడవాలని కోరుకుంటూ ఆ మహానేతకు మరోసారి నా నివాళులు.
- గడ్డం ప్రసాద్ కుమార్,
తెలంగాణ రాష్ట్ర శాసనసభ సభాపతి