ప్యాట్నీ సెంటర్ లో గద్దర్ విగ్రహం పెట్టాలి

ప్యాట్నీ సెంటర్ లో గద్దర్ విగ్రహం పెట్టాలి
  • పలువురు వక్తలు వామపక్షాల ఆధ్వర్యంలో గద్దర్ సంస్మరణ సభ 

ముషీరాబాద్, వెలుగు :  అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పాటతోనే పాలకులను గడగడలాడించిన గొప్ప వాగ్గేయకారుడు గద్దర్‌‌ అని వక్తలు కొనియాడారు. వామపక్షాల ఆధ్వర్యంలో ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గద్దర్ సంస్మరణ సభ నిర్వహించారు.   గద్దర్ విగ్రహాన్ని హైదరాబాద్ ప్యాట్నీ సెంటర్ లో  ఏర్పాటు చేయాలని కోరారు.  గద్దర్ ప్రజా కళల మ్యూజియం, ఆయన ఫొటో గ్యాలరీని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎన్ బాలమల్లేశ్​,  డీజీ నర్సింహారావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలువురు వక్తలు మాట్లాడారు.  మ్యూజియం నిమిత్తం ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయించి గద్దర్ తో పాటు ప్రముఖ కళాకారుల ఆవిష్కరణలు, చరిత్రను అందుబాటులో  ఉంచాలని కోరారు.  మాటలతోనే పాటను పుట్టించారని.. ఇదే గద్దర్ గొప్పతనం అని పేర్కొన్నారు. 

ఈ సందర్భంగా సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ..  కమ్యూనిజంను నిలబెట్టడమే గద్దర్ ఆశయమన్నారు.  సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ..  మానవత్వం ఉన్న మహనీయుడు గద్దర్ అని కీర్తించారు.  ప్రముఖ సినీ దర్శకుడు నర్సింగరావు మాట్లాడుతూ గద్దర్ ఆశయ సాధనకు ఆయన ఆశించిన లక్ష్యాలను సాధించే వరకు ప్రతి ఒక్కరూ శక్తివంచన లేకుండా కృషి చేయాలని కోరారు. కవి సుద్దాల అశోక్ తేజ మాట్లాడుతూ గద్దర్ ప్రజా యుద్ద నౌక తో పాటు గౌతమ బుద్ధ నౌక అని కీర్తించారు. గద్దర్ కుటుంబ సభ్యులతో పాటు వామపక్ష పార్టీలు అనుబంధ సంఘాల నాయకులు  పోటు రంగారావు, గోవర్ధన్, వేములపల్లి వెంకటరామయ్య, విమలక్క, ఎంసీపీఐ యు రాష్ట్ర నాయకులు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.