
- డిజిటల్ మీడియా చట్టాలపై టీజేయూ అవగాహన సదస్సు
హైదరాబాద్ సిటీ, వెలుగు: డిజిటల్ మీడియాలో వ్యక్తిగత దూషణలకు వెళ్లకూడదని, ఇతరులకు ఇబ్బంది కలిగిస్తూ మాట్లాడటం.. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కాదని ఎంపీ రఘు నందన్ రావు అన్నారు. బుధవారం సోమజిగూడ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ జర్నలిస్ట్స్ యూనియన్ ఆధ్వర్యంలో డిజిటల్ మీడియా చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ రఘునందన్ రావు మాట్లాడారు. డిజిటల్ మీడియాలో ఎప్పుడు మనం లిమిట్స్ దాటుతున్నామో చూసుకోవాలని చెప్పారు. సోషల్ మీడియాలో సమాచారం ప్రచారం చేసే ముందుకు వివరణ తీసుకోవాలని చెప్పారు.
ఫ్రీడం ఆఫ్ స్పీచ్ అనే సాకుతో ఇష్టం వచ్చినట్టు మైక్ పట్టుకొని డిజిటల్ మీడియాలో మాట్లాడ వద్దన్నారు. డిజిటల్ మీడియాలో మితిమీరిన కామెంట్లు చేయడం ఐటీ చట్టం ప్రకారం నేరమని తెలిపారు. ఈ మధ్య డిజిటల్ మీడియాల్లో అనవసరమైన వార్తలు, సమాజానికి ఉపయోగం లేని వార్తలు ప్రచారం చేస్తున్నారని, అలాంటివి తగ్గించాలని సూచించారు. యూట్యూబ్లో నేరవార్తలు చూసి అవే నేర్చుకుంటున్నారని, ఇలాంటి వాటిని నియంత్రించాలని చెప్పారు. ఎంత జరిగిందో అంతే చూపించాలని, అతిచేసి రాయొద్దని తెలిపారు.