
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో జీ20 అఖిలపక్ష సమావేశం జరగబోతుంది. ఆ సమావేశానికి హాజరు కానున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మీడియాతో మాట్లాడుతూ, జీ20 సమ్మిట్, గుజరాత్ ఎన్నికల గురించి సంచలన వాఖ్యలు చేశారు. బీజేపీ ప్రభుత్వం గురించి మాట్లాడుతూ ఇలా అన్నారు.
‘‘ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం, ఓటింగ్ రోజున రోడ్‌షోలకి ఎవరికీ అనుమతి లేదు. కాదని ఎవరైనా ప్రచార కార్యక్రమాలు చేస్తే వాళ్లకి ఎన్నికల ఉల్లంఘన చట్టం ప్రకారం శిక్ష పడుతుంది. కానీ, ఇక్కడ (గుజరాత్‌లో) మాత్రం ప్రధాని మోడీ, ఆయన పార్టీ వీవీఐపీలు, కార్యకర్తలు ఏదైనా చేయొచ్చు. మీటింగ్స్ పెట్టుకోవచ్చు. రోడ్డు షోలు జరుపుకోవచ్చు. ఈసీఐ వాళ్లను క్షమిస్తుంది’’ అని ఆరోపించారు. జీ20 సమ్మిట్, లోగో వివాదంపై స్పందిస్తూ... ఇది రాజకీయ లబ్ధికోసం ప్రధానమంత్రితో జరిగే మీటింగ్స్ కావని గుర్తుచేశారు. కమలం పువ్వు జాతీయ పుష్పం అయినప్పటికీ, అది రాజకీయ పార్టీ లోగో కూడా. కాబట్టి కమలం పువ్వు గుర్తును జీ20 లోగోగా ఉపయోగించకూడదని అభ్యంతరం వ్యక్తం చేశారు. కమలం పువ్వుకి బదులు ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. వాటిని ఎంపిక చేయొచ్చని సూచించారు. జీ20 లోగోకు కమలం పువ్వు గుర్తును ఉంచడంపై దేశంలోని చాలా పార్టీలు విమర్శిస్తున్నాయి.