ఆర్.విద్యాసాగర్ రావు: నీళ్ల సార్ ముచ్చట

ఆర్.విద్యాసాగర్ రావు:  నీళ్ల సార్ ముచ్చట

నీళ్లు.. పేద గొప్పల తేడా లేకుండా అందరికీ జీవనాధారం. అవే నీళ్లు.. ఇప్పుడు ఊర్లు, రాష్ట్రాల నుంచి దేశాల దాకా ప్రపంచ సమస్య. మనిషి ఉనికికే నీళ్లు అవసరమని చెప్పినంత అల్కగ.. నీళ్ల సమస్య వెనుకున్న కథను చెప్పడం కష్టం. అట్లాంటి అర్థంకాని సమస్యను విడమరిచి, సామాన్యులకూ అర్థమయ్యేలా చెప్పగలిగే మనిషి ఎవరంటే గుర్తొచ్చే పేరు ఆర్.విద్యాసాగర్ రావు. 

తెలంగాణ సార్’ అంటే ప్రొఫెసర్ జయశంకర్ లాగే, ‘నీళ్ల సార్’ అంటే విద్యాసాగర్ రావు. ‘నీళ్లు- నిజాలు’ పేరుతో తెలంగాణ నీళ్ల తిప్పలను ముచ్చటగ చెప్పిన విద్యాసాగర్ రావు ఇప్పుడు లేరు. అయితే నీళ్లు గురించి ఇంత చెప్పిన నీళ్ల సార్ గురించిన ముచ్చట ఎవరు చెప్పాలి? ఆయనే సొంత మాటల్లో తన ముచ్చట తను చెప్పుకున్న రచనే ‘నీళ్ల ముచ్చట’.విద్యాసాగర్ రావు కుటుంబ నేపథ్యం నుంచి నీళ్ల సార్​గా పిలుచుకునేలా ఎదగడం దాకా, ఊరి యాది నుంచి నాటకాల ప్రేమ దాకా... అన్నీ తనదైన తీరులో పంచుకున్నారు.

అంతకంటే ముఖ్యం ఆత్మకథల్లో నిజాయతీ. తన మంచిచెడ్డలను నిజాయతీగా పంచుకున్నప్పుడే వారి నిజమైన వ్యక్తిత్వం అందరికీ తెలుస్తుంది. తప్పొప్పులనూ ఉన్నది ఉన్నట్లుగా చెప్తే అందరికీ పాఠంగా, స్ఫూర్తిగా నిలుస్తాయి. అట్లాంటి నిలువెత్తు నిజాయతీ నీళ్ల సార్ ముచ్చటలో కనిపిస్తుంది. పేరుకు దొరల కుటుంబం అయినా అసలు పరిస్థితిని కళ్లకు కడతారు విద్యాసాగర్ రావు. ఒకటి సంపాదించే కొలువు, ఇంకొకటి మనసుకు నచ్చిన కొలువు. ఈ రెండింటిలో ఏది కావాలో కోరుకోమంటే.. నచ్చిందే ఎంచుకున్న వ్యక్తిత్వం ఆయన తండ్రిది. అదే వారసత్వం విద్యాసాగర్ రావు జీవితంలో కనిపిస్తుంది. 

హైదరాబాద్​లో మొదలై ఢిల్లీ దాకా ఇంజినీర్​గా ఆయన ప్రయాణం, పనితీరు, సర్వీసులో ఉన్నప్పుడు, రిటైరయ్యాక తెలంగాణ నీళ్ల కోసం పడిన తపన అన్నీ మనతో పంచుకుంటారు. ఓ దిక్కు తెలంగాణ సోయి చెప్తూనే, మరో దిక్కు నీళ్ల సమస్యలపై రాష్ట్రాల వారీగా ఆలోచించే తీరును, జాతీయవాద కోణంలో ఆలోచించాల్సిన తీరును కూడా నిష్పక్షపాతంగా చెప్తారు విద్యాసాగర్ రావు. ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ పేరుతో చూపించే హిపోక్రసీ, తెలంగాణ అనగానే ఎదురయ్యే అనుభవాలను యాదిచేసుకుంటారు. తెలంగాణ వచ్చాక చేపట్టిన కాళేశ్వరం, పాలమూరు -రంగారెడ్డి లాంటి ప్రాజెక్టులను తనదైన కోణంలో విశ్లేషిస్తూ.. నీళ్ల విషయంలో ఎట్లాంటి ప్రయోజనం సాధించాలన్నది పాలకులకు దిశానిర్దేశం చేశారు విద్యాసాగర్ రావు.

కుటుంబం గురించి చెప్పే ప్రయత్నంలో గుర్తుకొచ్చిన సంఘటనలు, తాతతండ్రుల కథలు, ఒకరికొకరు ఆసరాగా ఉండే తీరు, తన తల్లి ఒకేలా ఉండే ముగ్గురు కవల అక్కచెల్లెళ్లలో ఒకరు కావడం, విచిత్రంగా జరిగిన పెండ్లి, ఢిల్లీ అనుభవాలు నవ్విస్తాయి. తెలిసీ తెలియని వయసులో చేసిన చిన్న తప్పును మోస్తూ, పెద్దరికంలో చిన్నవాళ్ల ముందు ఒప్పుకొన్న వ్యక్తిత్వం ఆకట్టుకుంటుంది. 

ఇక రచయిత ముచ్చట. తెలంగాణ ప్రముఖుల బతుకుచిత్రాన్ని వారితోనే చెప్పించి, వారి మాటల్లోనే రాసి పుస్తకంగా మలిచే రచనా విధానంలో కొంపెల్లి వెంకట్ గౌడ్ ప్రత్యేకమైన ముద్రవేశారు. ఇంతకుముందు తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ సార్ మీద వేసిన ‘వొడువని ముచ్చట’ అందరినీ ఆకట్టుకుంది. తెలంగాణ సాయుధ పోరాట యోధుడు ధర్మభిక్షం, సాహితీవేత్త నోముల సార్ పుస్తకాలు వేసి ఇట్లాంటి ఒక జోనర్ సృష్టించారు. ఇదే తొవ్వలో విద్యాసాగర్ రావు జీవించి ఉన్నప్పుడు చాలాకాలం పాటు ఆయనతో ప్రయాణించి రికార్డు చేసిన విశేషాలతో ‘నీళ్ల ముచ్చట’ మన ముందుకు వచ్చింది. 

విద్యాసాగర్ రావు 2017లో కన్నుమూశాక ఈ రచన పూర్తికావడానికి చాలాకాలం పట్టింది.ఇప్పుడు జనంలోకి వచ్చింది. కాళేశ్వరం, మల్లన్నసాగర్, పాలమూరు, -రంగారెడ్డి లాంటి ప్రాజెక్టుల విషయంలో విద్యాసాగర్ రావు స్పష్టమైన అభిప్రాయంతో ఉన్నట్లుగా అర్థమవుతుంది. ఆయన కన్నుమూసేనాటికి, నీళ్ల ముచ్చట పబ్లిష్ చేసే నాటికి చాలా మార్పులు జరిగాయి. ఇంకొంత కాలం ముందే ఈ రచన జనంలోకి వచ్చి ఉంటే బాగుండేది. అట్లాగే కొన్ని అంశాల విషయంలో అసంపూర్తిగా ఉన్నట్లు అనిపిస్తుంది. విద్యాసాగర్ రావు మాట–ముచ్చటలో చెప్పింది చెప్పినట్లుగా రచనాశైలి ఉంది. ఇది సహజశైలిగా అనిపించినా చదివేటప్పుడు, ఆయన చెప్పాలనుకున్న విషయాన్ని అర్థం చేసుకునే విషయంలో కొంత ఇబ్బందిగా ఉంటుంది. 

అలవాటుగా, ఊతపదాలుగా వాడేవి, సగం వాక్యాలు, అర్థవంతంకాని పదాల్లాంటివి కొంత సవరించి ఉంటే బాగుండేది. చాప్టర్లను ఒకట్రెండు లేదా మూడు పేజీల్లోపే ముగించడం బాగుంది. కొన్ని చాప్టర్లలో ముగింపులో లేఅవుట్ లోపాలున్నాయి. విద్యాసాగర్ రావు చనిపోయిన ఐదేండ్ల తర్వాత రచన వచ్చింది. కాబట్టి ఆయన ఈ అభిప్రాయాలను ఎప్పుడు చెప్పారన్నది తేదీ కాకున్నా నెల, ఏడాది ప్రస్తావన ఉంటే బాగుంటుంది. ఇట్లాంటి చిన్న చిన్న లోపాలను తర్వాత ముద్రణలో సరిచేసుకుంటే చదివేవారికి సౌకర్యంగా ఉంటుంది. 

మొత్తంగా నీళ్లకు సంబంధించి తెలంగాణ సోయితో ఉన్న ఈ పుస్తకం.. ఇరిగేషన్ రంగంలో ఉద్దేశాలు, ఆచరణకు సంబంధించిన విశ్లేషణలో భవిష్యత్ తరాలకు ఉపయోగపడే రచన. కచ్చితంగా చదవాల్సిన పుస్తకం.

కాళేశ్వరం, మల్లన్నసాగర్, పాలమూరు, -రంగారెడ్డి లాంటి ప్రాజెక్టుల విషయంలో విద్యాసాగర్ రావు స్పష్టమైన అభిప్రాయంతో ఉన్నట్లుగా అర్థమవుతుంది. ఆయన కన్నుమూసేనాటికి, నీళ్ల ముచ్చట పబ్లిష్ చేసే నాటికి చాలా మార్పులు జరిగాయి. ఇంకొంత కాలం ముందే ఈ రచన జనంలోకి వచ్చి ఉంటే బాగుండేది. 

-ఎం.కె.