గుళ్లు, పెయింటింగ్స్​, బొమ్మలు @ నిర్మల్

గుళ్లు, పెయింటింగ్స్​, బొమ్మలు @ నిర్మల్

జానపద కళలు, కళారూపాలు ఇప్పటికీ  వెలుగొందుతున్న ప్రాంతం. కాకతీయుల కాలం నుంచి ఆర్ట్​వర్క్​కి కేరాఫ్​ అయిన నేల. అంతేకాదు  మొఘల్ రాజులతో  భేష్​ అనిపించుకున్నారు ఇక్కడి చిత్రకళా కారులు.  చదువుల తల్లి సరస్వతి కొలువైన  నిర్మల్​ జిల్లా వీకెండ్ టూర్​కి బాగుంటుంది. రంగురంగుల చెక్కబొమ్మలు, చూడముచ్చటైన నిర్మల్​ పెయింటింగ్స్​, గోదావరి అలల నడుమ మనసుదోచే కడెం ప్రాజెక్ట్​... ఇవి ఈ జిల్లాలో చూడదగ్గవి. అందమైన పెయింటింగ్స్​కి నిర్మల్​ పాపులర్. కాకతీయుల కాలం నుంచే నిర్మల్ పెయింటింగ్స్​ ఉన్నాయట.  ఇక్కడి నకాషి కళాకారులు  టేకు చెక్క మీద అందమైన పెయింటింగ్స్ వేస్తారు. వీటిలో చాలా పెయింటింగ్స్...​​ ప్రకృతి, జంతువులతో పాటు  రామాయణ, మహాభారతంలోని దృశ్యాల్ని ప్రతిబింబించేలా ఉంటాయి. అజంత, మొఘల్ ఆర్ట్​ థీమ్​తో వేసిన ఈ పెయింటింగ్స్​ నల్లని బ్యాక్​డ్రాప్​లో బంగారు రంగులో మెరుస్తూ కనిపిస్తాయి. ఇంట్లో అలంకరణకు, గిఫ్ట్​గా ఇచ్చేందుకు ఇవి బాగుంటాయి. 

అక్షరాభ్యాసానికి ఫేమస్​

గోదావరి నది ఒడ్డున,  బాసర ఊర్లో ఉన్న‘జ్ఞాన సరస్వతి దేవాలయం’ అక్షరాభ్యాసానికి చాలా ఫేమస్.  పొరుగు రాష్ట్రాల నుంచి కూడా చాలామంది పిల్లలకు అక్షరాభ్యాసం చేయించేందుకు ఇక్కడికి వస్తుంటారు. బాసర పేరు వెనుక ..కురుక్షేత్ర యుద్ధం తర్వాత వ్యాస మహర్షి తన శిష్యులు, రుషి విశ్వామిత్రుడితో కలిసి ఒక ప్రశాంతమైన ప్రాంతంలో ఉండాలనుకుని దండకారణ్యానికి వచ్చాడట. ఈ ప్రాంతం బాగా నచ్చడంతో సరస్వతి అమ్మవారిని ప్రసన్నం చేసుకునేందుకు తపస్సు చేశాడట వ్యాసుడు.  అప్పటినుంచి ఈ ప్లేస్​ని ‘వాసర’ అని పిలిచేవాళ్లు. అయితే,  ఈ ప్రాంతంలో మరాఠీ భాష మాట్లాడేవాళ్లు వాసరని బాసర అని పలికేవాళ్లు.  దాంతో  రానురాను ఈ ఊరి పేరు ‘బాసర’గా మారింది.

వేంకటేశ్వరస్వామి గుడి

గోదావరి ఒడ్డున ఉన్న సువర్ణపురి ఊర్లో ఉంది ఈ గుడి. ఇక్కడ గోదావరి నదిని ‘వృద్ధ గంగ’ అని పిలుస్తారు. కారణం... గోదావరి నది గంగానది కంటే పెద్దది. పైగా దీనికి గంగానది కంటే ఉపనదులు కూడా ఎక్కువ. అరణ్యవాసం టైంలో శ్రీరాముడు, సీతతో కలిసి ఇక్కడ కొన్ని రోజులు ఉన్నాడట. 

మనసు దోచే కడెం ప్రాజెక్ట్​


గోదావరి ఉపనది అయిన కడెం నది మీద ఉంది  ఈ ప్రాజెక్ట్. కడెం నది, గోదావరిలో కలిసే ప్రాంతంలో ఈ డ్యామ్​ని కట్టారు. 1949–1965 మధ్య కాలంలో ఈ డ్యామ్​ని పూర్తిచేశారు.18 గేట్లు ఉంటాయి. దాదాపు 25వేల హెక్టార్ల సాగుభూమికి నీళ్లు అందిస్తుంది ఈ డ్యామ్​. కొండలు, చెట్లు ఉన్న చోట కట్టిన ఈ డ్యామ్​ ప్రకృతి ప్రేమికులు, టూరిస్ట్​లకు బాగా నచ్చుతుంది.

పొంకి చెక్కతో బొమ్మలు

నిర్మల్​ అంటే  ముందుగా గుర్తుకొచ్చేవి చెక్కతో చేసిన బొమ్మలే. రంగురంగుల్లో, చూడముచ్చటగా ఉండే నిర్మల్ బొమ్మలు చాలా ఫేమస్​. అలంకరణ బొమ్మలుగా పేరుగాంచిన వీటికి దాదాపు నాలుగొందల ఏండ్ల చరిత్ర ఉంది. స్థానికంగా దొరికే ‘పొంకి చెక్క’ లేదా ‘తెల్ల చందనం చెక్క’తో వీటిని తయారుచేస్తారు. ఈ చెక్క తేలిక, మెత్తగా ఉంటుంది. ముందుగా విడి భాగాల్ని తయారుచేసుకొని ప్రత్యేకమైన గ్లూతో వాటిని అతికిస్తారు. బొమ్మలు మెరుస్తూ కనిపించేందుకు చింత లప్పం కోటింగ్, ఆయిల్ కలర్స్​ వేస్తారు.  

ఇలా వెళ్లాలి

హైదరాబాద్ నుంచి 227 కిలోమీటర్ల దూరంలో ఉంది నిర్మల్. నిర్మల్​కి 74 కిలోమీటర్ల దూరంలో ఉంది బాసర సరస్వతి దేవాలయం. నిర్మల్​ నుంచి 52 కిలోమీటర్ల జర్నీ చేస్తే కడెం ప్రాజెక్ట్ దగ్గరికి చేరుకోవచ్చు.