ఎస్సీ, ఎస్టీ, బీసీ పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక రాయితీలు : భట్టి

ఎస్సీ, ఎస్టీ, బీసీ పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక రాయితీలు : భట్టి
  •  భూ నిర్వాసితులకు సరైన పరిహారం ఇస్తం 
  • ప‌రిశ్రమ‌లు, ఐటీపై మంత్రి శ్రీధర్​బాబుతో కలిసి సమీక్ష

హైదరాబాద్, వెలుగు: ఎస్సీ, ఎస్టీ, బీసీ పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించ‌‌డానికి ప్రత్యేక రాయితీలు ఇస్తామ‌‌ని డిప్యూటీ సీఎం మ‌‌ల్లు భ‌‌ట్టి విక్రమార్క తెలిపారు. కొన్ని చిన్న, మధ్య తరగతి ఐటీ కంపెనీలు, యానిమేషన్, గేమింగ్, విక్స్ఎఫ్‌‌ కంపెనీలకు ప్రోత్సాహకాలు అందించేలా బడ్జెట్ కేటాయింపులు ఉంటాయ‌‌ని వెల్లడించారు. సోమ‌‌వారం సెక్రటేరియెట్​లో ఐటీ, ప‌‌రిశ్రమ‌‌లు, శాస‌‌న‌‌స‌‌భ వ్యవ‌‌హారాల శాఖ‌‌లు రూపొందించిన బ‌‌డ్జెట్ ప్రతిపాద‌‌న‌‌లపై మంత్రి దుద్దిల్ల శ్రీధ‌‌ర్ బాబుతో క‌‌లిసి సంబంధిత అధికారుల‌‌తో స‌‌మీక్ష చేశారు.

ఈ ఏడాది చేప‌‌ట్టే కార్యాక‌‌ల‌‌పాల‌‌కు కావాల్సిన నిధుల గురించి రిపోర్టు అంద‌‌జేశారు. ఈ సంద‌‌ర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ తెలంగాణ‌‌లో పరిశ్రమల వ్యాప్తి జ‌‌రుగుతున్న నేపథ్యంలో డ్రైపోర్టుల ఏర్పాటుపై ప్రత్యేక ఫోకస్ పెట్టాల‌‌ని అధికారుల‌‌ను ఆదేశించారు. రాష్ట్రంలో ప‌‌రిశ్రమలు ఉత్పత్తి చేసే వ‌‌స్తువుల‌‌ను ఎగుమ‌‌తులు పెంచుకోవ‌‌డానికి డ్రై పోర్టుల ఆవ‌‌శ్యక‌‌త ఉంద‌‌న్న విష‌‌యాన్ని గుర్తు చేశారు. ప‌‌రిశ్రమ‌‌ల ఏర్పాటు కోసం రైతుల నుంచి సేక‌‌రించే భూమికి ప‌‌రిహారం స‌‌ముచితంగా ఇస్తామ‌‌న్నారు. లిడ్ క్యాప్ ను గ‌‌త ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసింద‌‌ని, రాష్ట్రంలో లెద‌‌ర్ పార్క్​ల ఏర్పాటుకు చ‌‌ర్యలు తీసుకోవాల‌‌ని చెప్పారు. రీజినల్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్డు మధ్యన ఇండస్ట్రియల్ క్లస్టర్ ఏర్పాటు చేయ‌‌డం వ‌‌ల్ల రోడ్డు కనెక్టివిటి పెరుగుతుందన్నారు.

గ్రామీణ యువత కోసం కొత్త ఎంఎస్​ఎంఈ పాలసీ

గ్రామీణ ప్రాంతాల్లో యువతకు ఉపాధి కల్పన పెంచడ మే ప్రధానమైన ఆలోచనతోనే నూతన ఎంఎస్ఎంఈ పాలసీని తీసుకురాబోతున్నట్లు మంత్రి శ్రీధ‌‌ర్ బాబు తెలిపారు. దావోస్ పర్యట‌‌న‌‌లో చాలా మంది పారిశ్రామికవేత్తలు ఎంఎస్ఎంఈ  పాలసీ గురించి ఆరా తీశారని, అందుకనూ నూతన ఎంఎస్ఎంఈ పాలసీని ఈ రాష్ట్రంలో తీసుకురాబోతున్నట్లు చెప్పారు. తొమ్మిది జిల్లాల్లో నూత‌‌నంగా ఇండస్ట్రియల్ జోన్స్ ఏర్పాటుకు ప్రణాళిక‌‌లు రెడీ చేశామ‌‌న్నారు. 

గత సర్కారు కంటే మేమే కరెంట్​ ఎక్కువ ఇస్తున్నం

బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో కరెంట్ స‌ర‌ఫ‌రాపై వదంతులు సృష్టిస్తూ రాష్ట్ర ప్రజలను తప్పుదోవ ప‌ట్టిస్తున్నదని డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్రమార్క మండిపడ్డారు. రాష్ట్రం చీకట్లో ఉండాలని కలలు కంటున్న బీఆర్ఎస్‌ అసలు స్వరూపాన్ని ప్రజలు గమనిస్తున్నారని, అలాంటివి మానుకోకుంటే సరైన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. ఇందిర‌మ్మ రాజ్యం ప్రజల ప్రభుత్వమ‌ని, ప్రజల కలలు నిజం చేయడమే మా ధ్యేయమ‌న్నారు. నాణ్యమైన నిరంతర విద్యుత్తు సరఫరా చేస్తున్నామని భట్టి స్పష్టం చేశారు.

రాష్ట్రంలో విద్యుత్ సరఫరా నిరుటితో పోలిస్తే గణనీయంగా మెరుగుపడిందన్నారు. 2023 డిసెంబర్ నెలలో రాష్ట్రంలో రోజు సగటున 207.7 మిలియన్ యూనిట్ల కరెంటు సరఫరా చేశామని చెప్పారు.  2022 డిసెంబర్ లో సగటున 200 మిలియన్ యూనిట్లే సరఫరా జరిగిందని గుర్తు చేశారు. 2024 జనవరి1 నుంచి 28 వరకు, రాష్ట్రంలో సగటున 242.43 మిలియన్ యూనిట్ల కరెంటు సరఫరా చేశామ‌ని, నిరుడు ఇదే టైమ్​లో సగటున 226 మిలియన్ యూనిట్లు మాత్రమే సరఫరా అయింద‌న్నారు.

వచ్చే ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు విద్యుత్తు డిమాండ్‌ను తీర్చడానికి తగిన‌ చర్యలు తీసుకున్నామ‌ని తెలిపారు. వేస‌విలో ప్రజ‌ల అవ‌స‌రాల‌కు అనుగుణంగా వివిధ రాష్టాల‌తో ఒప్పందం చేసుకుని1200 మెగావాట్ల విద్యుత్తును ముంద‌స్తుగా రిజ‌ర్వు చేసుకున్నామ‌న్నారు. ఆ రాష్ట్రాల్లో విద్యుత్తు కొర‌త ఉన్నప్పుడు తిరిగి ఇచ్చేలా ఈ ఒప్పందం చేసకున్నట్లు చెప్పారు. రాబోయే రోజుల్లో కరెంటు స‌ర‌ఫ‌రాలో అంత‌రాయం లేకుండా ముందే నిర్వహణ ప‌నులు చేప‌ట్టామ‌న్నారు. కరెంటు సరఫరాపై సోషల్ మీడియాలో వ‌స్తున్న తప్పుడు వార్తలు, వదంతులను నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా 2023 జ‌న‌వ‌రి కంటే 2024 జ‌న‌వ‌రిలో ఎక్కువ‌గా విద్యుత్తు స‌ర‌ఫ‌రా జ‌రిగిన గ్రాఫ్‌ను భట్టి సోమవారం విడుద‌ల చేశారు. 

మహిళా సాధికారతే మా ప్రభుత్వ లక్ష్యం: శ్రీధర్​బాబు

మహిళా సాధికారతే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్​బాబు అన్నారు. సోమవారం వీ హబ్​లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మహిళా సాధికారిత పునాదులపైనే తెలంగాణ డెవలప్ అవుతుందని తాము నమ్ముతున్నామన్నారు. అందులో భాగంగానే మహిళలకు ఫ్రీ బస్ జర్నీ, రూ.500లకే ఎల్పీజీ సిలిండర్​పంపిణీ లాంటి కార్యక్రమాలు చేపట్టామన్నారు. మహిళలకు క్షేత్ర స్థాయిలో ఎదురవుతున్న సమస్యలు పరిష్కరించకపోతే వారు ప్రపంచంతో పోటీ పడలేరని, వాటిపై కాంగ్రెస్  ప్రభుత్వం దృష్టి సారించిందని తెలిపారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతామన్నారు. ఈ సందర్భంగా ఆస్ట్రేలియా హై కమిషనర్ ​ఫిలిప్​ గ్రీన్​సమక్షంలో ఆస్ట్రేలియా ప్రభుత్వంతో ఎంవోయూ చేసుకున్నారు. ఈ ఒప్పందంలో భాగంగా మహిళలు, అణగారిన వర్గాలకు ఎంటర్​ ప్రెన్యూర్​షిప్​లో స్టార్ట్​– ఎక్స్​పేరుతో 13 వారాలు వీ హబ్​ప్రీ ఇంక్యూబేషన్​కార్యక్రమం నిర్వహిస్తుందని శ్రీధర్ బాబు చెప్పారు. ఆస్ట్రేలియా హైకమిషనర్ ఫిలిప్ గ్రీన్ మాట్లాడుతూ, కాంగ్రెస్​ ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారంటీలు బాగున్నాయని, మహిళలకు ఫ్రీ బస్​ జర్మీ మంచి ఆలోచన అని అన్నారు. ఆస్ట్రేలియా కాన్సులేట్​జనరల్​(బెంగళూరు) హిలరీ మెగ్​గెచ్చి, ఇండస్ట్రీస్ ​ప్రిన్సిపల్​ సెక్రటరీ జయేశ్​ రంజన్, వీ హబ్​సీఈవో దీప్తి రావు  పాల్గొన్నారు.

తెలంగాణకు ఇతర దేశాలతోనే పోటీ

పెట్టుబడులను ఆకర్షించే విషయంలో మన రాష్ట్రం ఇతర రాష్ట్రాలతోపాటు మన సైజులో ఉన్న ఇతర దేశాలతోనూ పోటీ పడుతోందని రాష్ట్ర ఐటీ, పరి శ్రమలశాఖ మంత్రి డి.శ్రీధర్‌‌బాబు అన్నారు. రాష్ట్రం లో పెట్టుబడి అవకాశాలను నార్డిక్స్, ఎస్టోనియా, పశ్చిమ యూరప్‌‌లకు చెందిన 12 మంది సభ్యుల ప్రతినిధులకు సోమవారం టీ–హబ్‌‌లో జరిగిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్‌‌లో ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దావోస్​లో తమ ప్రభుత్వం రూ.40 వేల కోట్ల విలువైన ఒప్పందాలను కుదర్చుకుందని చెప్పారు.