
- వరదలకు శాశ్వత పరిష్కారం చూపేలా హామీ
- మూసీ నదీ తీరాన్ని షాపింగ్ హబ్‌గా మార్చేలా భరోసా
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ ప్రజల కోసం కాంగ్రెస్ స్పెషల్ డిక్లరేషన్‌కు ప్లాన్ చేస్తున్నది. ‘హైదరాబాద్ డిక్లరేషన్’ పేరుతో త్వరలోనే మరో డిక్లరేషన్ ప్రకటించేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తున్నది. వాస్తవానికి సిటీ పరిధిలోని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అంత బలంగా లేదన్న వాదన ఉంది. పోయినసారి జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ ఒక్క సీటూ గెలవలేదు. బీజేపీ కార్పొరేటర్ అకాల మరణంతో జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి దరిపల్లి రాజశేఖర్ రెడ్డి విజయం సాధించారు. ఈ క్రమంలోనే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా సిటీ ఓటర్లను ఆకర్షించేలా హైదరాబాద్ డిక్లరేషన్‌తో కాంగ్రెస్ ముందుకు వస్తున్నట్టు సమాచారం.
వరదలకు శాశ్వత పరిష్కారం
చిన్న వాన పడ్డా సిటీ రోడ్లపై భారీగా నీళ్లు జమ అవుతాయి. వరదలకు శాశ్వత పరిష్కారం చూపే మార్గాలను హైదరాబాద్ డిక్లరేషన్‌లో పొందుపరచాలని పార్టీ పెద్దలు భావిస్తున్నట్టు తెలిసింది. నాలాల వెంట ఆక్రమణల తొలగింపునకు స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని భావిస్తున్నట్లు టాక్ ఉంది. నాలాలకు ఆనుకుని నిర్మాణాలు చేపట్టిన వారికి పెద్ద మొత్తంలో పరిహారం ముట్టజెప్పి.. వారికి నచ్చిన బిజినెస్‌ను పెట్టించి వేరే చోట షెల్టర్ కల్పించేలా హామీ ఇవ్వనున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తున్నది. మరోవైపు, బిల్డింగ్ పర్మిషన్ల ప్రక్రియను మరింత మెరుగుపరిచేలా ఓ వ్యవస్థ ఏర్పాటు చేసేందుకూ డిక్లరేషన్‌లో పేర్కొంటారని అంటున్నారు. బోనాలకు స్పెషల్ బడ్జెట్ కేటాయిస్తూ.. అన్ని వర్గాలకూ సమాన ప్రాధాన్యం ఇచ్చేలా డిక్లరేషన్‌లో హామీలు పొందుపరిచేందుకు కాంగ్రెస్ పెద్దలు కసరత్తు చేస్తున్నారని సమాచారం.
మూసీ సుందరీకరణ
మూసీ సుందరీకరణ, హుస్సేన్‌సాగర్ క్లీన్ అప్ పై కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ఇప్పటికీ అమలు కాలేదని కాంగ్రెస్ లీడర్లు విమర్శిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలు ఎండగట్టేందుకు హైదరాబాద్ డిక్లరేషన్‌లో ఈ అంశాన్ని యాడ్ చేయాలని కాంగ్రెస్ భావిస్తున్నట్టు తెలిసింది. మూసీ నదీ తీరాన్ని షాపింగ్ హబ్‌గా మార్చేందుకూ కాంగ్రెస్ కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. వీలున్న చోట నదిలో బోటు షికారుకు వెళ్లేలా ప్లాన్ చేస్తున్నట్టు పార్టీ నేతలు చెప్తున్నారు. మూసీని టూరిజం హబ్‌గా మార్చేందుకు ఏం చేస్తారో డిక్లరేషన్‌లో వివరిస్తారని అంటున్నారు.