ఎండాకాలంలో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించిన రాష్ట్ర ప్రభుత్వం.. పర్యవేక్షణ కోసం జిల్లాలకు స్పెషల్‌ఆఫీసర్లను కూడా నియమించింది. ఎక్కడ సమస్య తలెత్తినా 24 గంటల్లో పరిష్కరించేలా మిషన్‌భగీరథ, ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ ఆఫీసర్లకు ఆదేశాలున్నాయి. కానీ, ఫీల్డ్ లెవల్లో భగీరథ గ్రిడ్ నుంచి తక్కువ ప్రెజర్‌తో వస్తున్న వాటర్ గ్రామాలకు చేరకపోవడం, ట్యాంకుల నుంచి రిలీజ్‌చేస్తే ఇంట్రా పైపులైన్లు ఎక్కడికక్కడ పగులుతుండడం వల్ల తాము ఏమీచేయలేకపోతున్నామని కలెక్టర్లకు మొరపెట్టుకుంటున్నారు.
ఇదే విషయాన్ని ప్రభుత్వానికి రిపోర్ట్ చేయడంతో మిషన్‌భగీరథ నీళ్లు అందని ఏరియాల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని, ఇందుకోసం స్పెషల్ డెవలప్‌మెంట్‌ఫండ్ కింద ఎమ్మెల్యేలకు కేటాయించిన ఫండ్స్‌ను వాడుకోవాలని సూచించింది. దీంతో ఆయా నియోజకవర్గాల్లో ఫీల్డ్ స్టాఫ్ ప్రతిపాదనలకు తగ్గట్టుగా ఆఫీసర్లు గ్రామాల్లోని పాత బావులను, బోర్లను, చేతిపంపులను వినియోగంలోకి తీసుకువస్తున్నారు. బోర్లు పడని చోట్ల ట్యాంకర్ల ద్వారా వాటర్ సప్లై చేస్తూ భగీరథ ఇబ్బందుల నుంచి జనాలకు కొంత ఉపశమనం కలిగిస్తున్నారు.
