
- దీనిపై కసరత్తు జరుగుతోంది.. వెల్లడించిన కేంద్రమంత్రి నిర్మల
న్యూఢిల్లీ: అమెరికా సుంకాలతో నష్టపోతున్న భారతీయ ఎగుమతిదారులకు మద్దతు ఇవ్వడానికి ప్రభుత్వం ఒక ప్యాకేజీపై కసరత్తు చేస్తోందని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ వెల్లడించారు. ప్యాకేజీపై వివిధ శాఖలు ప్రభావంపై అంచనా వేస్తున్నాయని అన్నారు. మనదేశ ఎగుమతిదారులకు మద్దతు ఇవ్వడానికి అవసరమైన చర్యలు తీసుకోవడానికి వివిధ పరిశ్రమల నుంచి సమాచారం సేకరిస్తున్నామని ఆమె చెప్పారు. వీళ్లకు జరుగుతున్న నష్టం గురించి తెలుసుకుంటున్నామని పేర్కొన్నారు.
రష్యా నుంచి ఇండియా ముడి చమురు కొనుగోలు చేస్తున్నదంటూ అమెరికా మన ఎగుమతులపై అదనంగా 25 శాతం సుంకాన్ని విధించింది. దీంతో మొత్తం టారిఫ్50 శాతానికి చేరింది. జౌళి, వస్త్రాలు, రత్నాలు, ఆభరణాలు, రొయ్యలు, తోలు, చెప్పులు, జంతు ఉత్పత్తులు, రసాయనాలు, ఎలక్ట్రికల్, మెకానికల్ యంత్రాలు వంటి శ్రమ-ఆధారిత రంగాలు ఈ సుంకాల వల్ల ప్రభావితమయ్యాయి.
ఫార్మా, ఇంధన ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్ వస్తువులు వంటి రంగాలను మాత్రం ఈ సుంకాల నుంచి మినహాయించారు. ఈ ప్యాకేజీలో ప్రధానంగా క్రెడిట్ లిక్విడిటీ మద్దతుకు సంబంధించిన నాలుగు పథకాలు ఉండవచ్చని తెలుస్తోంది. ఈ పథకాలు చిన్న పరిశ్రమలకు సహాయం చేయడానికి, ఉద్యోగాలను కాపాడటానికి, వర్కింగ్ క్యాపిటల్ ఒత్తిడిని తగ్గించడానికి కొత్త మార్కెట్లను వెతకడానికి వీలు కల్పిస్తాయి.
కరోనా సమయంలో ఎంఎస్ఎంఈలకు ప్రకటించిన ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీ తరహాలో ఈ కొత్త ప్యాకేజీ ఉండవచ్చని అధికారులు చెబుతున్నారు. 2024-25లో భారతదేశ మొత్తం వస్తువుల ఎగుమతుల్లో అమెరికా వాటా 20 శాతం ఉంది. 2021-–22 నుంచి అమెరికా భారతదేశానికి అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. 2024-25లో వస్తువుల వాణిజ్యం 131.8 బిలియన్ డాలర్లు (86.5 బిలియన్ డాలర్ల ఎగుమతులు, 45.3 బిలియన్ డాలర్ల దిగుమతులు) ఉంది.
ఇజ్రాయెల్‌తో ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందం
భారతదేశం, ఇజ్రాయెల్ మధ్య సోమవారం ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందం (బీఐఏ) కుదిరింది. ఇది గత సంవత్సరం యూఏఈతో భారతదేశం కుదుర్చుకున్న ఒప్పందం మాదిరే ఉంది. దీంతో పెట్టుబడిదారులకు భద్రత, సురక్షితమైన పెట్టుబడులు, పారదర్శకత ఉంటాయి. వివాదాల పరిష్కారం కోసం ఇజ్రాయెల్ పెట్టుబడిదారులు స్థానిక చట్టపరమైన వ్యవస్థను ఉపయోగించుకోవాల్సిన కాల పరిమితిని ఐదు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాలకు తగ్గించారు. ఈ ఒప్పందంలో పోర్ట్‌ఫోలియో పెట్టుబడులూ ఉంటాయి.
పెట్టుబడుల రక్షణ, నష్టాలకు పరిహారం చెల్లింపు, పారదర్శకత వంటి అంశాలను బీఐఏలో చేర్చారు. రెండు దేశాల మధ్య ఆర్థిక సహకారాన్ని పెంచేందుకు, ముఖ్యంగా ఫిన్‌టెక్ ఇన్నోవేషన్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, డిజిటల్ చెల్లింపుల వంటి రంగాల్లో కలిసి పనిచేయడానికి అంగీకరించారు. ఏప్రిల్ 2000 నుంచి జూన్ 2025 మధ్య భారతదేశానికి ఇజ్రాయెల్ నుంచి 337.77 మిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐలు వచ్చాయి. ప్రస్తుతం రెండు దేశాల మధ్య మొత్తం పెట్టుబడులు 800 మిలియన్ డాలర్లుగా ఉన్నాయి.