గోమూత్రంతో కర్నాటక అసెంబ్లీ శుద్ధి

గోమూత్రంతో కర్నాటక అసెంబ్లీ శుద్ధి
  • బీజేపీ అవినీతి పాలన ముగిసిందంటూ విమర్శ

బెంగళూరు : కర్నాటకలో బీజేపీ అవినీతి పాలన ముగిసిందంటూ కాంగ్రెస్​ లీడర్లు, కార్యకర్తలు సోమవారం అసెంబ్లీ ఆవరణను గోమూత్రంతో శుద్ధి చేశారు. తాము అధికారంలోకి రాగానే అసెంబ్లీని గోమూత్రంతో శుద్ధి చేస్తామంటూ డీకే శివకుమార్ జనవరిలోనే ప్రకటించారు. బీజేపీ హయాంలో జరిగిన అవినీతి కారణంగా అసెంబ్లీ అపవిత్రమైందని విమర్శించారు. ‘‘మేం అసెంబ్లీని శుద్ధి చేయడానికి కొంత డెటాల్‌‌తో వస్తాం. నా దగ్గర శుద్ధి చేయడానికి కొంత గోమూత్రం కూడా ఉంది” అని శివకుమార్ అప్పట్లో అన్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్​ కార్యకర్తలు సోమవారం ఈ ‘శుద్ధి’ కార్యక్రమం నిర్వహించారు. గో మూత్రంతో అసెంబ్లీ పరిసరాలన్నీ శుద్ధి చేశామని, ప్రత్యేక పూజలు కూడా నిర్వహించామని పార్టీ కార్యకర్తలు ప్రకటించారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

‘కరప్షన్​ రేట్ కార్డు’తో బీజేపీపై విమర్శలు

కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు మే 10న జరిగాయి. దీనికి ముందు మే 5న కాంగ్రెస్ లీడర్లు బీజేపీ ‘కరప్షన్ రేట్ కార్డ్’ను రిలీజ్ చేశారు. బీజేపీ హయాంలో జరిగిన స్కామ్స్​ను వెలుగులోకి తీసుకొచ్చాయి. ఇంగ్లిష్, కన్నడ భాషల్లో కరప్షన్​ రేట్ కార్డును ప్రింట్​ చేసి సర్క్యులేట్​ చేశారు. బీజేపీ ప్రభుత్వం మూడున్నరేండ్లలో రూ.1,50,000 కోట్లు కొల్లగొట్టిందంటూ ప్రచారం చేశారు. సీఎం కుర్చీ కాస్ట్​ రూ.2,500 కోట్లు అని, మినిస్టర్​ పోస్ట్ రేట్​ రూ.500 కోట్లు అని కాంగ్రెస్​ విమర్శించింది. బీజేపీ డబుల్​ ఇంజిన్​ గవర్నమెంట్ కాదని ట్రబుల్ ఇంజిన్ గవర్నమెంట్ అంటూ క్యాంపెయిన్ చేసింది.అన్ని పనుల్లో కమీషన్ తీసుకున్నదంటూ రేట్​కార్డ్​లో ప్రస్తావించింది. ఒక్కో పనిలో ఒక్కో రకమైన కమీషన్​ ఫిక్స్​ చేసిందని విమర్శించింది. గ్రాంట్ల కోసం 30శాతం కమీషన్​ సెట్ చేసిందని ఆరోపించింది. రోడ్డు కాంట్రాక్ట్​ల కోసం 40% కమీషన్, కోవిడ్ 19 సప్లైయ్స్ కోసం ఏకంగా 75% కమీషన్​ డిమాండ్ చేసిందని విమర్శించింది.

సిద్ధరామయ్యను విమర్శించిన టీచర్​పై వేటు

కర్నాటకలో కొత్తగా కొలువుదీరిన ప్రభుత్వంతో పాటు సీఎం సిద్ధరామయ్యను విమర్శిస్తూ ఫేస్​బుక్​లో పోస్టు పెట్టిన గవర్నమెంట్ టీచర్​ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. చిత్రదుర్గ జిల్లా హోసదుర్గంలోని కానుబెన్నహళ్లి గవర్నమెంట్ స్కూల్​లో ఎంజీ శాంతమూర్తి టీచర్​గా పని చేస్తున్నాడు. సీఎం సిద్ధరామయ్యతో పాటు అధికారంలోకి వచ్చేందుకు ఇచ్చిన ఉచిత స్కీమ్​ హామీలను విమర్శిస్తూ ఫేస్​బుక్​లో పోస్టు పెట్టాడు. ‘‘ఉచితాలు ఇవ్వకుండా ఇంకేం చేయగలం’’ అని క్యాప్షన్ ఇచ్చి వివిధ సీఎంల హయాంలో చేసిన అప్పులను శాంతమూర్తి ప్రస్తావించాడు. ఎస్ఎం కృష్ణ హయాం నుంచి శెట్టర్ సీఎంగా ఉన్నంత వరకు రూ.71,331 కోట్ల అప్పులు కాగా, ఒక్క సిద్ధరామయ్య హయాంలోనే రూ.2,42,000 కోట్ల అప్పులు అయ్యాయని విమర్శించారు. దీన్ని సిద్ధరామయ్య ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. పోస్టు పెట్టిన నిమిషాల్లోనే శాంతమూర్తిని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది.