సెప్టెంబర్ 18 నుంచి పార్లమెంట్ స్పెషల్ సెషన్..

సెప్టెంబర్ 18 నుంచి పార్లమెంట్ స్పెషల్ సెషన్..
  • ఐదు రోజులపాటు సమావేశాలు
  • మొదటి రోజు 75 ఏండ్ల పార్లమెంట్ ప్రస్థానంపై చర్చ
  • ఉభయ సభల ముందుకు నాలుగు కీలక బిల్లులు

న్యూఢిల్లీ, వెలుగు:పార్లమెంట్ స్పెషల్​ సెషన్ సోమవారం నుంచి ప్రారంభం అవుతున్నది. ఐదు రోజుల పాటు జరిగే ఈ భేటీలో.. మొదటి రోజంతా ఉభయ సభల్లో 75 ఏండ్ల పార్లమెంట్ ప్రస్థానం (సంవిధాన్ సభ)పై చర్చ ఉంటుందని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. 75 ఏండ్ల పార్లమెంట్ జర్నీలో సాధించిన విజయాలు, అనుభవాలు, జ్ఞాపకాలు, నేర్చుకున్న అంశాలపై సభ్యులు మాట్లాడుతారు. తర్వాత ఇండియా అధ్యక్షతన విజయవంతంగా ముగిసిన జీ20 సమిట్​పై ప్రత్యేకంగా చర్చించే అవకాశం ఉంది. 

సోమవారం పాత పార్లమెంట్ లోనే చర్చ కొనసాగుతుంది. మంగళవారం నుంచి కొత్త పార్లమెంట్​లోని సెంట్రల్ హాల్​లో స్పెషల్​ సెషన్ ప్రారంభం అవుతుంది. ఆ రోజు పాత పార్లమెంట్ బిల్డింగ్ ముందు ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి మంత్రులు, ఉభయ సభల సభ్యులు గ్రూప్ ఫొటో దిగుతారు. ఐదు రోజుల స్పెషల్​ సెషన్​లో నాలుగు కీలక బిల్లులు కేంద్రం ప్రవేశపెట్టనుంది. 2023, ఆగస్టు 3న రాజ్యసభలో ఆమోదం పొందిన ‘ది అడ్వకేట్స్ (సవరణ) బిల్లు – 2023’, ‘ది ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఆఫ్ పీరియాడికల్స్ బిల్లు – 2023’ను లోక్​సభలో ప్రవేశపెడుతుంది. ఆఫీషియల్ బులెటిన్ ప్రకారం.. ‘ది పోస్టాఫీస్ బిల్లు 2023’ కూడా లోక్​సభలో లిస్ట్ చేశారు. 2023, ఆగస్టు 10న ఈ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్​ల నియామకానికి సంబంధించిన మార్పులతో కూడిన బిల్లును మాన్​సూన్ సెషన్​లోనే రాజ్యసభలో ప్రవేశపెట్టారు.

Also Raed :- రికార్డ్​ సేల్స్..ఏడాదిలోనే 38 లక్షల బండ్ల అమ్మకం

చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఇద్దరు ఎలక్షన్ కమిషనర్ల సర్వీస్ కండీషన్లు కేబినెట్ సెక్రటరీతో సమానంగా ఉండాలంటూ ప్రతిపక్షాలు నిరసనం వ్యక్తం చేశాయి. దీంతో ఈ బిల్లుపై ఎలాంటి చర్చ జరగకుండానే మాన్​సూన్ సెషన్ ముగిసింది. ఇప్పుడు మళ్లీ ఆ బిల్లు రాజ్యసభలో ప్రవేశపెట్టి చర్చ ప్రారంభించాలనే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. దీంతో పాటు మరికొన్ని కీలక అంశాలు కూడా సభలో ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నట్లు చర్చ జరుగుతున్నది.

మహిళల రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టే చాన్స్

లోక్​సభ, అసెంబ్లీల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్ చాలా ఏండ్ల నుంచి ఉంది. ఇటీవల జరిగిన జీ20 సమిట్​లో మహిళా సాధికారత అంశాన్ని ప్రపంచ దేశాధినేతల ముందు ప్రధాని నరేంద్ర మోదీ హైలెట్ చేశారు. అన్ని రంగాల్లో భారతీయ మహిళలు రాణిస్తున్నారని చెప్పారు. వారికి సమాన అవకాశాలు కల్పిస్తామని కూడా ప్రకటించారు. ఈ క్రమంలో సోమవారం నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ స్పెషల్​ సెషన్​లో మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్​సభలో ప్రవేశపెడ్తారనే చర్చ జరుగుతున్నది. మంగళవారం నుంచి కొత్త పార్లమెంట్​లో స్పెషల్​ సెషన్ ప్రారంభం అవుతుండటంతో బిల్డింగ్​ను ముస్తాబు చేశారు. పార్లమెంటరీ స్టాఫ్​తో పాటు పలు డిపార్ట్​మెంట్స్ సిబ్బందికి కొత్త యూనిఫాంలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు.

కొత్త పార్లమెంట్ బిల్డింగ్​లో జెండా ఆవిష్కరించిన ఉప రాష్ట్రపతి

ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్‌‌‌‌‌‌‌‌ ధన్‌‌‌‌‌‌‌‌ఖడ్‌‌‌‌‌‌‌‌ ఆదివారం కొత్త పార్లమెంట్ భవనం వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించారు. సోమవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఒక రోజు ముందుగానే జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమం చేపట్టారు. కొత్త పార్లమెంట్ గజ ద్వారం వద్ద ధన్‌‌‌‌‌‌‌‌ఖడ్‌‌‌‌‌‌‌‌ జెండా ఆవిష్కరించారు. లోక్‌‌‌‌‌‌‌‌సభ స్పీకర్ ఓం బిర్లాతో పాటు పలువురు మంత్రులు, ఎంపీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకుముందు పార్లమెంట్​లో విధులు నిర్వహించే సీఆర్పీఎఫ్ సిబ్బంది నుంచి రాజ్యసభ చైర్మన్ ధన్​ఖడ్ గౌరవ వందనం స్వీకరించారు.