ప్రత్యేక పార్లమెంట్.. ముందస్తు ఎన్నికలకా? బిల్లుల ఆమోదానికా?

ప్రత్యేక పార్లమెంట్.. ముందస్తు ఎన్నికలకా? బిల్లుల ఆమోదానికా?
  • ముందస్తు ఎన్నికలకా?బిల్లుల ఆమోదానికా?
  • రాజకీయ వర్గాల్లో భిన్న వాదనలు

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఈ నెల​18 నుంచి 22 వరకు పార్లమెంట్ స్పెషల్ సెషన్ నిర్వహించాలని నిర్ణయించింది. ఈ సమావేశాల్లో ఐదు సిట్టింగ్స్ ఉంటాయని తెలిపింది. ఈ మేరకు గురువారం కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషీ ట్విట్టర్​లో ప్రకటించారు. అయితే, ఎజెండాను మాత్రం ప్రకటించలేదు. దీంతో ఎన్డీఏ కూటమి ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నదని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. 

కేంద్రంలో ప్రధాని మోదీ రెండోసారి అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత జమిలి ఎన్నికల దిశగా కొన్ని రోజులు ప్రయత్నాలు చేశారు. దేశమంతా ఒకేసారి ఎన్నికలకు మొదట్లో మొగ్గు చూపారు. కానీ, ఇది కేవలం ప్రతిపాదనగానే మిగిలిపోయింది. అయితే, మరో ఏడెనిమిది నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. అదేవిధంగా, డిసెంబర్​లో ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు ఉన్నాయి. ఈ క్రమంలో ముందస్తు ఎన్నికల అంశం తెరపైకి వచ్చింది. దీనికితోడు..

 ఇప్పటికిప్పుడు లోక్​సభ ఎన్నికలు జరిగితే ఎన్డీఏ కూటమి బంపర్ మెజార్టీతో గెలుస్తుందని పలు జాతీయ, అంతర్జాతీయ సర్వే సంస్థలు కూడా రిపోర్ట్ ఇచ్చాయి. అమెరికాకు చెందిన ‘ప్యూ రీసెర్చ్ సెంటర్’ సర్వేలో కూడా దేశ వ్యాప్తంగా మోదీకి పాపులారిటీ ఏమాత్రం తగ్గలేదని ప్రకటించింది. ప్రతి 10 మందిలో 8 మంది మోదీవైపే ఉన్నారని సర్వే సంస్థ చెప్పింది. మొత్తం 80 శాతం మంది మోదీకే జై కొడ్తున్నారని ప్రకటించింది. ఈ స్పెషల్ పార్లమెంట్ సెషన్ లో ముందస్తు ఎన్నికలపై కేంద్రం కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని పలువురు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

ముందుస్తుపై మమతా బెనర్జీ, నితీశ్ కామెంట్లు

కొన్ని రోజుల కింద వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా సంచలన కామెంట్లు చేశారు. మోదీ ప్రభుత్వం డిసెంబర్​లో ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నదని, ఎంపీలు అందరూ దేశ వ్యాప్త ప్రచారం కోసం హెలికాప్టర్లు కూడా బుక్ చేసుకున్నారని చెప్పారు. కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ముందస్తు సమాచారం వెళ్లిందని, వాళ్లు కూడా ఏర్పాట్లు చేస్తున్నారని అన్నారు. ఎన్నికలకు వెళ్లే ఉద్దేశం లేకపోతే హెలికాప్టర్‌‌లను ఎందుకు బుక్ చేసుకుంటారని మమతా బెనర్జీ ప్రశ్నించారు. 

ఇదే అనుమానం బీహార్ సీఎం నితీశ్‌‌ కుమార్ కూడా వ్యక్తం చేస్తున్నారు. అయితే, కేంద్ర ప్రభుత్వం మాత్రం విపక్షాల కామెంట్లపై స్పందించ లేదు. బీజేపీ ప్రణాళికలు, ప్లాన్​లను పరిశీలిస్తున్న రాజకీయ పరిశీలకులు మాత్రం.. కేంద్రం ముందస్తు ఎన్నికలకు వెళ్లే చాన్సే ఎక్కువగా ఉందని అంటున్నారు. ముంబైలో ఇండియా కూటమి భేటీ గురువారం ప్రారంభమైంది. ప్రతిపక్షాల వ్యూహాలకు చెక్​ పెట్టేందుకు ఎన్డీఏ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తున్నది. సెప్టెంబర్​లో లోక్​సభను రద్దు చేసి నవంబర్ చివర్లో లేదా డిసెంబర్​లో ముందస్తుకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. 

కీలక అంశాలపై చర్చించే చాన్స్

ఢిల్లీలో జీ20 సమావేశాలు సెప్టెంబర్ 9న ప్రారంభమై 10న ముగుస్తాయి. స్పెషల్ పార్లమెంట్ సెషన్ 18న ప్రారంభం అవుతుంది. ఈ సమావేశాల్లో పదికి పైగా కీలక బిల్లులను ప్రవేశపెట్టి వాటికి ఆమోదం తెలిపే అవకాశం ఉందని తెలుస్తున్నది. ఇందులో ‘ఒక దేశం – ఒకేసారి ఎన్నికలు’ బిల్లు కూడా ఉండే చాన్స్ ఉంది. అదేవిధంగా, జీ20 సమావేశాల్లో చర్చకు వచ్చిన అంశాలపై కూడా ఈ పార్లమెంట్ స్పెషల్ సెషన్​లో చర్చించే అవకాశాలున్నట్లు సమాచారం. 

చంద్రయాన్ 3 మిషన్ సక్సెస్ కావడంతో దానిపై కూడా చర్చ జరిగే చాన్స్​ ఉన్నట్లు తెలుస్తున్నది. యూనిఫాం సివిల్ కోడ్ బిల్లును ప్రవేశపెట్టే అవకాశాలు, కాశ్మీర్ లో ఎన్నికలకు సంబంధించి ఇటీవల సుప్రీం తీర్పు అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశాలున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. మే 28న మోదీ ప్రారంభించిన కొత్త పార్లమెంట్ భవనంలోకి పార్లమెంటరీ కార్యకలాపాలు మార్చేందుకే ఈ సమావేశాలు నిర్వహిస్తున్నారనే చర్చ కూడా జరుగుతున్నది. పాత పార్లమెంట్​లో సమావేశాలు ప్రారంభమై.. కొత్త పార్లమెంట్​లో ముగుస్తాయని సమాచారం. అందుకే, కొత్త పార్లమెంట్​ను కూడా సిద్ధం చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.

అత్యవసర భేటీపై ప్రతిపక్షాల విమర్శలు

ఇంత సడెన్​గా పార్లమెంట్ అత్యవసర సమావేశాలు నిర్వహించాల్సిన అవసరం ఏం వచ్చిందన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. వర్షాకాల సమావేశాలు ముగిసిన మూడు వారాల్లోనే ఐదు రోజుల సెషన్ ఏంటని కాంగ్రెస్ లీడర్ జైరామ్ రమేశ్ కేంద్రాన్ని ప్రశ్నించారు. కూటమి భేటీ, అదానీ ఇష్యూను డైవర్ట్​ చేసేందుకే ఈ సెషన్ అని విమర్శించారు. ఈ సెషన్​లోనూ అదానీ వ్యవహారంపై జేపీసీ వేయాలన్న డిమాండ్ చేస్తామన్నారు. వినాయక ఉత్సవాల టైమ్​లో ఐదు రోజుల స్పెషల్ సెషన్ ఏంటని శివసేన (యూబీటీ) నేత ప్రియాంక చతుర్వేది ఫైర్ అయ్యారు.

ప్రత్యేక భేటీలు ఎప్పుడు జరిగాయంటే..

చివరి సారిగా జీఎస్​టీ విషయంలో 2017, జూన్ 30న అర్ధరాత్రి వరకు పార్లమెంట్ ప్రత్యేకంగా సమావేశమైంది. ఇండియాకు స్వాతంత్ర్యం వచ్చి 50 ఏండ్లు పూర్తయిన సందర్భంగా 1997, ఆగస్టులో ఆరు రోజులు స్పెషల్​గా భేటీ అయింది. 1992, ఆగస్టు 9న క్విట్ ఇండియా మూవ్​మెంట్ 50 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా, 1972, ఆగస్టు 14-15న ఇండియా ఇండిపెండెన్స్ డే సిల్వర్ జుబ్లీ వేడుకల సందర్భంగా పార్లమెంట్ స్పెషల్​గా భేటీ అయింది. స్వాతంత్ర్యం వచ్చాక 1947, ఆగస్టు  14-15లో ఫస్ట్ సెషన్ జరిగింది.