పార్లమెంట్‌ భవనం ఎదుట ఎంపీల గ్రూపు ఫొటో

పార్లమెంట్‌ భవనం ఎదుట ఎంపీల గ్రూపు ఫొటో

సెప్టెంబర్ 19వ తేదీ నుంచి కొత్త పార్లమెంట్‌  భవనంలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. మధ్యాహ్నం 1.15 గంటలకు లోక్‌ సభ, 2.15 గంటలకు రాజ్యసభ సమావేశాలు మొదలవుతాయి. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 19వ తేదీ ఉదయం 9:30 గంటలకు పాత పార్లమెంట్‌ భవనం వద్ద కేంద్ర ప్రభుత్వం ఫొటో సెషన్‌ నిర్వహించింది. ఈ ఫోటో సెషన్లో  ప్రధాని మోదీ సహా కేంద్ర మంత్రులు, కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, ఉభయ సభలకు చెందిన ఎంపీలు పాల్గొన్నారు.

ALSO READ: ఎవరు ఎవర్నయినా పెళ్లి చేసుకోవచ్చు.. ఇది హక్కు : ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు

మరోవైపు కొత్త పార్లమెంట్ భవనానికి కేంద్రం నామకరణం చేసింది.  పార్లమెంట్ హౌస్ ఆఫ్ ఇండియాగా పేరు పెట్టింది.  పార్లమెంట్‌ కొత్త భవనాన్ని నోటిఫై చేస్తూ కేంద్రం గెజిట్‌ విడుదల చేసింది. ఇందులో కొత్తగా నిర్మించిన భవనమే ఇక నుంచి పార్లమెంట్‌ అని ప్రకటించింది.

కొత్త పార్లమెంట్ భవనంలో మొదలయ్యే సమావేశాల్లో తొలి బిల్లుగా మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టనుంది కేంద్రం.  ఈ బిల్లుకు ఉభయ సభల్లో ఆమోదం లభించి చట్టంగా మారితే.. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ దక్కనుంది.  లోక్‌సభ, రాష్ట్రాల్లోని శాసనసభల్లోని మొత్తం సీట్లలో 33 శాతం లేదా మూడింట ఒక వంతు మహిళలకు కేటాయించాలని ఈ బిల్లు తెలియజేస్తుంది. 

ఐదు రోజుల ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు సెప్టెంబర్‌ 18 నుంచి మొదలయ్యాయి.  తొలి రోజు సమావేశాలు పార్లమెంట్ పాత భవనంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీతో పాటు ఇతర పార్టీలకు చెందిన ఎంపీలు పాత పార్లమెంట్‌లో చివరి ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా మోడీ 75 ఏళ్ల స్వతంత్ర భారత ప్రయాణ విశిష్టతను వివరించారు.