మాట్లాడుకునే రాళ్లు..మణిపూర్ లో స్టోన్ హెంజ్

మాట్లాడుకునే రాళ్లు..మణిపూర్ లో స్టోన్ హెంజ్

స్టోన్​ హెంజ్​.. వందల టన్నుల బరువున్న రాళ్లను స్తంభాల్లా నిలబెట్టి, వాటిపై అడ్డంగా రాళ్లను పెట్టిన ఓ పురాతన వింత. ఎవరు కట్టారో, ఎందుకు కట్టారో, అసలు ఎలా కట్టగలిగారో తెలియదు. ప్రపంచవ్యాప్తంగా ఇది చాలా ఫేమస్​. మనం కంప్యూటర్​లో విండోస్​ ఎక్స్​పీ ఆపరేటింగ్​ సిస్టం వాడినప్పుడు మానిటర్​పై బ్యాక్​గ్రౌండ్​గా కనిపించిన పిక్చర్​ అదే.  మన దేశంలోనూ  ఓ స్టోన్​ హెంజ్​ ఉంది తెలుసా?

మణిపూర్​లోని మారం గ్రామానికి 39 కిలోమీటర్ల దూరంలో ఈ రాళ్లున్నాయి. ఈ ప్రాంతాన్ని ‘విల్లోంగ్​ ఖుల్లెన్​’గా పిలుస్తారు. కొండ చివరల్లో ఉన్న ఈ ప్రాంతాన్ని ఆనుకుని చిన్న గ్రామం కూడా ఉంటుంది. దీర్ఘచతురస్రాకారంలో నిలువుగా చెక్కిన ఈ రాళ్లు.. ఒక్కోటీ రెండు మీటర్ల వరకు వెడల్పు, మీటరు మందంతో, ఏడు మీటర్ల వరకు పొడవుతో ఉన్నాయి. వీటిని నేలలో రెండు మీటర్ల వరకు తవ్వి పాతినట్టుగా శాస్త్రవేత్తలు గుర్తించారు. దూరం నుంచి చూస్తే చిన్నగా కనిపించే ఈ రాళ్లు.. ఒక్కోటీ 10 టన్నులకుపైగా బరువు ఉండటం గమనార్హం.

లెక్క తెలియదు..

కొండ వాలులో ఈ నిలువు రాళ్లు దగ్గరదగ్గరగా ఉండగా.. చుట్టుపక్కల దూరం దూరంగా ఏర్పాటు చేసి ఉన్నాయి. ఇవి మొత్తం ఎన్ని ఉన్నాయన్నది ఎవరూ కచ్చితంగా లెక్కపెట్టలేదు. ఈ ప్రాంతంలో ఏదో శక్తి ఉందని, అందువల్ల ఆ రాళ్లన్నింటినీ లెక్కబెట్టడం సాధ్యం కాదని చెప్తుంటారు. రాళ్లను లెక్కపెట్టాలని చూస్తే.. మధ్యలోకి రాగానే కన్ఫ్యూజ్​ అవుతారని అంటుంటారు. ఓసారి ఎవరో జపాన్​ వ్యక్తి తాను కచ్చితంగా లెక్కపెడతానని ప్రయత్నించాడట. కన్ఫ్యూజ్​ అవుతూ, లెక్కపెడుతూ కొద్దిరోజులు గడిపాడని, ఓ రోజు పెద్ద తెల్ల ఎలుగుబంటి వచ్చి అతడిని తరిమికొట్టిందని చెబుతారు.

మగ గొంతుతో మాట్లాడుకుంటాయట!

ఈ నిలువు రాళ్ల ప్రత్యేకత గురించి స్థానికుల్లో ఓ గాథ ప్రచారంలో ఉంది. వారి పూర్వీకులు ఈ భారీ రాళ్లను ఏర్పాటు చేశారని వారు చెబుతారు. వారు బాగా బలంగా ఉండి, ఒక్కరే ఆ రాళ్లను తెచ్చి పెట్టేవారట. ఇందుకు రూల్​ కూడా ఉంది. ముందు చుట్టూ ఉన్న ప్రాంతాల్లో మంచి రాళ్ల కోసం వెతికేవారట. అలా గుర్తించాక ఓ రోజంతా ఉపవాసం ఉండి.. ఆ రాయి దగ్గర ప్రత్యేక పూజలు చేసి, వైన్​ కూడా సమర్పించేవారట. అప్పుడు ఆ రాయి అక్కడి నుంచి వచ్చేందుకు అనుమతి ఇచ్చేదని, ఆ వ్యక్తి దానిని తీసుకువచ్చి ‘విల్లోంగ్​ ఖుల్లెన్​’లో పెట్టేవారని చెబుతారు. అంతేకాదు ఈ రాళ్లకు ఒక్కోదానికి ‘కల, కంగ, హిల..’ఇలా ఒక్కో పేరు ఉంటుందట. రోజూ రాత్రిళ్లు అవి ఒకదానికొకటి పేర్లతో పిలుచుకుంటూ మగ గొంతుకతో మాట్లాడుకుంటాయట.

ఏందీ స్టోన్​ హెంజ్​?

నిలువుగా రెండు పెద్ద రాళ్లు పెట్టి, దానిపై అడ్డంగా మరో పెద్ద బండను పెట్టి, గుండ్రంగా ఏర్పాటు చేసిన రాళ్ల సమూహమే స్టోన్​ హెంజ్. ఇంగ్లండ్​లోని శాలిస్​బరీ ప్రాంతంలో ఉన్న ఈ నిర్మాణాలను క్రీస్తుపూర్వం మూడు వేల సంవత్సరం సమయంలో నిర్మించారని గుర్తించారు. అంటే ఇప్పటి నుంచి చూస్తే సుమారు 5 వేల సంవత్సరాల కిందటివన్న మాట.ఈజిప్ట్​ పిరమిడ్లలో వాడిన రాళ్లకంటే పదింతలు పెద్దరాళ్లు ఇవి. అంత బరువైన వాటిని ఎలా నిలబెట్టారు, వాటిపైన అంతపెద్ద బండలను ఎలా పెట్టగలిగారు, అసలు ఎవరు కట్టారన్నది ఇప్పటివరకు కనుగొనలేకపోయారు. అప్పటికాలంలో దానిని పూజా స్థలంగా వినియోగించి ఉంటారని మాత్రం అంచనా వేస్తున్నారు. చిత్రమైన విషయం ఏమిటంటే ఆ రాళ్లను ఆ ప్రాంతానికి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండల నుంచి తరలించారని గుర్తించారు. దీనివెనుక ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి.గ్రహాంతరవాసులు భూమి మీదికి వచ్చారని, తమ కోసమే అలా కట్టుకుని ఉంటారని కూడా ఊహిస్తుంటారు.