
డాన్స్ మాస్టర్‌గా దాదాపు ఇరవైయ్యేళ్ల జర్నీ అతనిది..ఈ ఇరవై య్యేళ్లలో రియాలిటీ షోలతో మొదలు పెట్టి ...ఎన్నో టీవీ ఈవెంట్స్‌కి స్టెప్స్ డిజైన్ చేశాడు. సినిమాలకి కలర్‌ఫుల్ సాంగ్స్ కొరియోగ్రఫీ చేశాడు. బిగ్‌బాస్ మూడు , నాలుగు సీజన్లకి డాన్స్ కంపోజ్ చేశాడు. ప్రస్తుతం టెలికాస్ట్ అవుతున్న ఐదో సీజన్‌కి కూడా కొరియో గ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు. కంటెస్టెంట్ల ఇంట్రడక్షన్‌తో మొదలుపెట్టి గ్రాండ్ ఫినాలె వరకు సాంగ్స్ అన్నీ కొరియోగ్రఫీ చేసింది ఇతనే. వీకెండ్స్‌లో నాగార్జున ఎంట్రీ సాంగ్ డిజైన్ చేసేది కూడా ఈ మాస్టరే. తెర వెనకే ఉంటూ వినోదాన్ని పంచుతున్న హైదరాబాద్ కొరియోగ్రాఫర్ ఉదయ్ గురించి..
‘‘నాలుగైదు నిమిషాల సాంగ్. సెకనుకో ఫ్రేమ్ మారుతుంటుంది. నిమిషానికో కాస్ట్యూమ్ ఛేంజ్ అవుతుంటుంది. పైగా హీరోహీరోయిన్ల స్టైల్, సాంగ్‌లోని ఫీల్‌ని క్యారీ చేయాలి. అన్నింటికంటే ముఖ్యంగా ఉన్న కొద్ది టైంలోనే అనుకున్న కాన్సెప్ట్‌ని వివరంగా చెప్పాలి. వీటన్నింటికి నెలల తరబడి ప్రాక్టీస్ కావాలి. వీటన్నింటికి బ్యాక్‌గ్రౌండ్‌లో డాన్స్‌మాస్టర్ కష్టం ఎంతో ఉంటుంది. కానీ, మన స్టెప్పులకి ఆడియెన్స్ చప్పట్లు కొడితే ఆ చప్పుడుకే కొరియోగ్రాఫర్ కష్టాన్ని మర్చిపోతాడు. అలా ఈ ఇరవై య్యేళ్లలో ఎన్నో ఎక్స్‌పీరియెన్స్‌లు చూశా. అయితే కొరియోగ్రాఫర్‌గా నా జర్నీ నేను కలలో కూడా ఊహించనిది.
అనుకోకుండా..
చిన్నప్పట్నించీ చదువు అబ్బలేదు నాకు. కానీ, తప్పక టెన్త్ వరకు నెట్టుకొచ్చా. ఇంటర్‌కి వచ్చేసరికి చదువు నా వల్ల కాదని ఇంట్లో చెప్పా. ఈ విషయంలో అమ్మానాన్న చాలా ప్రాక్టికల్‌గా ఆలోచించారు. నాకు చదువు వర్కవుట్ అవ్వదని.. సెటిల్మెంట్ కోసం నెక్స్ట్ ఆప్షన్ని సెర్చ్ చేశారు. ఆ ప్రాసెస్‌లో ఆఫీస్ బాయ్, కొరియర్ బాయ్, పోస్ట్ మ్యాన్, సెక్యూరిటీ గార్డ్ ఇలా బోలెడు జాబ్‌లు చేశా. కానీ, ఎందులోనూ నెలకి మించి ఇమడలేకపోయా. దాంతో నాకు ఏ జాబ్ సెట్ అవ్వట్లేదని మా ఫ్రెండ్ ఒకతను ‘సత్యం మాస్టర్ డాన్స్ ఇన్స్టిట్యూట్’లో చేరమన్నాడు. వినాయక మండపాల్లో ప్రతి సంవత్సరం డాన్స్ చేసేవాడ్ని. స్కూల్ కల్చరల్ యాక్టివిటీస్‌లోనూ స్టెప్పులేసేవాడ్ని. అవి తప్పించి డాన్స్‌లో నాలెడ్జ్ లేదు. అయినా సరే.. ఏదైనా కొత్తగా ప్రయత్నించాలని 17 ఏళ్ల వయసులో సత్యం మాస్టర్ దగ్గర బ్యాక్ గ్రౌండ్ డాన్సర్‌గా చేరా. నాలుగేళ్లు ఆయనతో ట్రావెల్ చేసి బ్యాక్ గ్రౌండ్ డాన్సర్స్‌లో 12 వ పొజిషన్ నుంచి మెయిన్ లీడ్‌కి వచ్చా. ఆ తర్వాత కొరియోగ్రాఫర్‌గా జర్నీ మొదలుపెట్టా.
కొరియోగ్రాఫర్‌గా..
తెలుగులో ఫస్ట్ డాన్స్ రియాలిటీ షో ‘స్టార్ వార్’తో కొరియోగ్రాఫర్‌గా నా జర్నీ మొదలైంది. సెలబ్రిటీలతో కలిసి కొరియోగ్రాఫర్స్‌గా పార్టిసిపేట్ చేసే ఆ షో నాకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత తెలుగుతో పాటు కన్నడలోని మరెన్నో రియాలిటీ షోలలో పార్టిసిపేట్ చేశా. అలా సాగిపోతున్న టైంలో ఓ రియాలిటీ షోకి కంటెస్టెంట్‌గా వెళ్లా. ఆ షో డైరక్టర్ ‘డాన్స్‌కి కెరీర్ ఉంటుందో లేదో తెలియదు.. కానీ, నీ ఆడియో ఎడిటింగ్ కట్స్ బాగుంటాయి’ అన్నారు. దాంతో ఎడిటింగ్‌లో మరిన్ని టెక్నిక్స్ నేర్చుకుని అటుగా వెళ్లా. కానీ, రానురాను ‘నేను డాన్సర్‌ని కదా! ఇలా నాలుగ్గోడల మధ్య ఎడిటింగ్ రూంలో ఎందుకు ఆగిపోయా?’ అని నన్ను నేనే ప్రశ్నించుకున్నా. మళ్లీ కొరియోగ్రఫీ వైపు వచ్చా.
బిగ్‌బాస్ అవకాశం
నా ఫ్రెండ్స్ భరత్, మృదుల ద్వారా బిగ్‌బాస్ రెండో సీజన్‌కే కొరియోగ్రఫీ ఛాన్స్ కోసం ప్రయత్నించా. కానీ, కొన్ని కారణాల వల్ల ఆ ఛాన్స్ మిస్సయ్యింది.నేను అంతకుముందు చేసిన వర్క్స్ చూసి పిలిచి మూడో సీజన్‌కి అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత వచ్చిన నాలుగో సీజన్‌తో పాటు ప్రస్తుతం ఐదో సీజన్‌కి కూడా కొరియోగ్రఫీ చేస్తున్నా. కంటెస్టెంట్ల ఎంట్రీతో పాటు గ్రాండ్ ఫినాలేకి, వీకెండ్లో నాగార్జున గారికి కూడా కొరియోగ్రఫీ చేస్తున్నా. వీటితో పాటు టీవీల్లో వచ్చే పండుగల స్పెషల్ ఈవెంట్స్‌కి, అవార్డు ఫంక్షన్స్‌కి కూడా కొరియోగ్రఫీ చేస్తున్నా. కొన్ని సినిమాలకి కూడా పనిచేశా.
ప్రి షూటింగ్ చేస్తా..
టీవీ అవార్డు ఫంక్షన్లు, ఈవెంట్స్ చేసేటప్పుడు 40 నుంచి 50 సాంగ్స్ కంపోజ్ చేయాలి. వాళ్లతో రిహార్సల్స్ చేయించాలి. అలాంటప్పుడు ఒక్కో ఆర్టిస్ట్‌కి ఒక్కో గంట స్లాట్ ఇచ్చి డాన్స్ నేర్పిస్తాం. అలాగే, డాన్స్ వచ్చిన వాళ్లకి ఒకలా, రానివాళ్లకి ఒకలా మూమెంట్స్ ఇస్తాం. కొన్ని సాంగ్స్‌ని విజువల్‌గా బాగా క్రియేట్ చేసి జస్ట్ యాక్టర్స్‌ని అటుఇటు నడిపించి మ్యానేజ్ చేస్తుంటాం. కానీ, ఫార్మేషన్స్ వల్ల అది ఆడియెన్స్‌కి పెద్దగా తెలీదు. అలాగే అవార్డు ఫంక్షన్స్‌లో చాలావరకు సాంగ్స్‌ని ప్రి షూట్ చేస్తాం. మామూలు టైంలో కొన్ని థీమ్స్ చేసి, బ్యాక్ అప్లోనూ పెట్టుకుంటాం. దీనంతటికి నా టీమ్, ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఉంది.
అదే నా గోల్
తెలుగులో మ్యూజికల్ థియేటర్ పెట్టాలన్నది నా డ్రీమ్. ఆస్ట్రేలియా, అమెరికా లాంటి దేశాలతో పాటు బెంగళూరు, ముంబైలోనూ మ్యూజికల్ థియేటర్స్ ఉన్నాయి. అలా మన హైదరాబాద్‌లోనూ పాటలు, డాన్స్‌తో పాటు అన్ని ఎలిమెంట్స్ ఉన్న విజువల్ యాక్ట్స్ చేయాలనుకుంటున్నా. 2018 లో ప్రొడక్షన్ హౌజ్ స్టార్ట్ చేశా.
అందులో మంచి కంటెంట్ ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నా. సినిమా డైరక్ట్ చేసే ఆలోచన కూడా ఉంది.
::: ఆవుల యమున