Special Story : తెల్ల టీ షర్ట్​ ఉద్యమం

Special Story : తెల్ల టీ షర్ట్​ ఉద్యమం

సామాజిక న్యాయం, అహింస, ఐక్యత, ప్రజలందరి పురోగతి అన్న అంశాలపై ఆధారపడి భారత దేశంలో మహత్తరమైన  ‘వైట్ టీషర్ట్’ ఉద్యమాన్ని  నిర్మిస్తున్న నేత రాహుల్ గాంధీ. 2025 జనవరి 19న  ప్రారంభమైన ఈ ఉద్యమం దేశవ్యాప్తంగా యువతను ప్రేరేపించడంలో   ఒక కొత్త ట్రెండ్​ను సృష్టించింది. సామాజిక న్యాయం ఎజెండాతో ముందుకు సాగుతున్న  రాహుల్ గాంధీ  తెల్ల టీషర్ట్  ఉద్యమంపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

 2022 రాహుల్ నేతృత్వంలో ప్రారంభమైన భారత జోడో  యాత్ర ముగింపు వరకు రాహుల్​గాంధీ  వైట్ టీషర్ట్ పైనే కొనసాగడం పలువురిని ఆకట్టుకుంది. అందరికీ సమన్యాయం, సామాజిక న్యాయం కోసం జరిగిన భారత్ జోడో యాత్రలో  వైట్ టీషర్ట్ ఫిలాసఫీని దేశ ప్రజలకు రాహుల్ గాంధీ ఒక ఉద్యమంగా పరిచయం చేశారు. దానితో వైట్ టీషర్ట్ ఉద్యమం ప్రాధాన్యత జనంలో పెద్ద ఎత్తున ప్రచారానికి నోచుకుంది. ఫ్రాన్స్​లో జరిగిన ఎల్లో వేస్ట్స్ ఉద్యమం, సింగపూర్​లో వైట్ షర్ట్ ఉద్యమం తరహాలో ఇండియాలో రాహుల్ నేతృత్వంలో వైట్ టీషర్ట్ ఉద్యమం కొనసాగుతోంది. 

శాంతి, అహింసకు చిహ్నం అయిన తెల్లరంగును రాహుల్ వైట్ టీషర్ట్ ఉద్యమంగా కొనసాగిస్తున్నారు. ఒక సాధారణ తెల్లరంగు టీషర్ట్​ను శాంతి, మత సామరస్య ఉద్యమానికి సంకేతంగా మార్చిన ఘనత రాహుల్ గాంధీకే దక్కుతుంది. విదేశీ వస్త్ర బహిష్కరణ ఉద్యమంలో సాధారణ దేశీయ ఖాదీ, చరఖాతో యావత్ దేశాన్ని కదిలించిన జాతీయ ఉద్యమం నుంచి  ప్రేరణ పొందినదే వైట్ టీషర్ట్ ఉద్యమం కూడా. 

భిన్నత్వంలో  ఏకత్వం ఉన్న సమాజ నిర్మాణాన్ని కాపాడుతూ ఈ జాతిని సంపన్నం చేసిన దేశ మూలవాసుల సర్వతోముఖాభివృద్ధి ఎజెండా గా వైట్ టీషర్ట్ ఉద్యమం కొనసాగుతోందని రాహుల్ అనేకమార్లు ఉద్ఘాటించారు.  గొప్ప సాంస్కృతిక చరిత్ర ఉన్న ఈ దేశ వైవిధ్యాన్ని కాపాడాలంటే గొప్ప సాంస్కృతిక పోరాటం అవసరమని రాహుల్ గాంధీ పదే పదే తన ఉపన్యాసాల్లో గుర్తుచేస్తుంటారు. అలాంటి సాంస్కృతిక పోరాటమే  వైట్ టీషర్ట్ ఉద్యమం అని రాహుల్ గాంధీ అభిప్రాయం. 

కార్మిక, కర్షక, నిరుద్యోగ, మహిళా, ఆదివాసి, దళిత, వెనుకబడినవర్గాల సమస్యలను రాహుల్​గాంధీ  వైట్ టీషర్ట్ ఉద్యమం   ఎజెండాగా మార్చారు. సామాజిక న్యాయ సాధనకు ప్రేరణగా సమతారాజ్య లక్ష్యంగా  ఉద్యమాన్ని కొనసాగిస్తున్న నేత రాహుల్ గాంధీ. దేశం మొత్తం బీజేపీ మతతత్వ రాజకీయాలతో  భారతదేశ వైవిధ్య సమాజాన్ని దెబ్బతీస్తుంది. భిన్నత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత భారత బుద్ధిజీవి వర్గంపై ఉంది.  

బీజేపీ తప్పుడు సిద్ధాంతాన్ని ఎండగట్టడానికి దేశంలో సమత సిద్ధాంతస్థాపన చారిత్రక అవసరాన్ని రాహుల్ పదేపదే చెబుతున్నారు.  రాహుల్ గాంధీ ఉద్యమం భారత  సాధారణ ప్రజానీకాన్ని జాగృతం చేయడమే కాకుండా100 సంవత్సరాల పై బడిన  కాంగ్రెస్ పార్టీకి శస్త్రచికిత్సలాంటిది. బీజేపీ  సిలబస్​కు సమాధానమే   వైట్ టీషర్ట్ ఉద్యమం. సమత, సామాజిక న్యాయం, జాతి పటిష్ట నిర్మాణం, దేశ వైవిధ్యాన్ని కాపాడే లక్ష్యానికి తెల్లని టీషర్ట్​ చిహ్నం. 

జాతి ఉన్నతిని మరింత పెంచి  విరుద్ధ భావజాల సంఘర్షణ నుంచి కొత్త చరిత్ర పురుడు పోసుకోవాలి. అలాంటి కొత్త చరిత్రకు ఆహ్వానం పలుకుదాం.  శైవం, శాక్తేయం, వామాచారం, వీరశైవం, వైష్ణవం, బౌద్ధం, జైనం అనే సిద్ధాంతాలు ఈ నేలను పునీతం చేశాయి. అరాచకం  రాజ్యమేలినప్పుడల్లా  కొత్త సిద్ధాంతం జాతిని మేల్కొల్పిన చరిత్ర వారసత్వానికి నిజమైన ప్రతీక వైట్ టీషర్ట్ ఉద్యమం.

- దొమ్మాట వెంకటేశ్,ఫోరం ఫర్ సోషల్ జస్టిస్–