సాహితీ సుగంధాన్ని ఇముడ్చుకున్న అభ్యుదయ కవి సామ్రాట్

సాహితీ సుగంధాన్ని ఇముడ్చుకున్న అభ్యుదయ కవి సామ్రాట్

ఆయన కలం.. తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ గళమెత్తింది....
తెలంగాణ ప్రజల కన్నీళ్లు చూసి ‘అగ్నిధార’ను కురిపించింది....
ఉర్దూ మిళితమైన తెలుగుతో సాహితీ సౌరభాలను వెదజల్లింది.... 
సినిమా గేయాలతో ప్రతి గుండెనీ తట్టింది....
ఆ కలం.. దాశరథి కృష్ణమాచార్యది.
రచనలో వైవిధ్యం.. ప్రతి అక్షరంలో మాధుర్యం.. ఆధునిక తెలుగు సాహిత్యంలో ఆయనది ఓ ప్రత్యేక స్థానం.
తరతరాలనూ ప్రభావితం చేసేంత గొప్ప సాహిత్యాన్ని అందించిన ఆ మహాకవి జయంతి (జులై 21) సందర్భంగా స్పెషల్ స్టోరీ.    

చిన్న తనంలో పద్యాలు అల్లిన దాశరథి..

1925, జులై 22న వరంగల్ జిల్లాలోని గూడూరు గ్రామంలో దాశరథి పుట్టారు. ఇప్పుడా ఊరు మహబూబాబాద్ జిల్లాలో ఉంది. ఆయన చిన్నతనమంతా ఖమ్మం జిల్లాలో సాగింది. ఉర్దూలో మెట్రిక్ చదివిన దాశరథి... ఆ తర్వాత ఇంటర్మీడియట్, ఇంగ్లీష్ లిటరేచర్‌‌లో గ్రాడ్యుయేషన్ చేశారు. సంస్కృత, ఉర్దూ భాషల్లో ప్రావీణ్యం సంపాదించారు. చిన్నతనంలోనే పద్యాలు అల్లారు. అనంతరం ఓ ఏజ్ వచ్చాక కమ్యూనిస్టు పార్టీలో చేరారు. రెండో ప్రపంచయుద్ధ సమయంలో పార్టీ వైఖరి నచ్చక బయటకు వచ్చేశారు. నిజాం అరాచక ప్రభుత్వాన్ని వ్యతిరేకించే ఉద్యమంలో దాశరథి పాలు పంచుకున్నారు. టీచర్‌‌గా, పంచాయతీ ఇన్‌స్పెక్టర్‌‌గా పని చేశారు. రేడియోలోనూ వర్క్ చేశారు. కథలు, నాటికలు, కవితలు రాశారు. 

ఆవేశాన్ని రగిలించిన దాశరథి పద్యాలు...

నిజాం పాలనలో ప్రజలు పడుతున్న బాధ ఆయన రచనలకు ఊపిరి పోసింది. ఆయన కలం పీడిత ప్రజల గొంతుకగా మారింది. అగ్నిధార, రుద్రవీణ, మహాంధ్రోదయం, తిమిరంతో సమరం లాంటి ఎన్నో కవితా సంపుటాలు ఆయన నుంచి వెలువడ్డాయి. మీర్జా గాలిబ్ ఉర్దూ గజల్స్‌కి గాలిబ్ గీతాలు పేరుతో తెలుగులోకి అనువదించారు. తల్లి మీద, తల్లి తెలంగాణ మీద ఆయన రచించిన పద్యాలు ఎందరిలోనో ఆవేశాన్ని రగిలించాయి. ఆంధ్ర మహాసభలో చైతన్యవంతమైన పాత్రను పోషించి దాశరథి జైలుకు సైతం వెళ్లారు. తెలంగాణ రచయితల సంఘాన్ని స్థాపించిన ఆయన.. ఆంధ్రప్రదేశ్ ఆస్థానకవిగా ఎనిమిదేళ్లు పని చేశారు. కవిసింహం, అభ్యుదయ కవి సామ్రాట్, యువ కవి చక్రవర్తి, ఆంధ్ర కవితా సారధి లాంటి ఎన్నో బిరుదులు పొందారు. రాష్ట్ర, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుల్ని కూడా దాశరథి అందుకున్నారు. 

ప్రేమగానమైనా, విషాద గీతికైనా....

ఇదంతా ఒకెత్తయితే... సినీ రచయితగా ఆయన ప్రయాణం మరొకెత్తు. కవిగా నిప్పు కణికలు కురిపించిన ఆయన కలం.. లిరిసిస్ట్ గా రకరకాల భావాల్ని కుమ్మరించింది. ‘ఖుషీ ఖుషీగా నవ్వుతూ.. చలాకి మాటలు రువ్వుతూ’ అంటూ ‘ఇద్దరు మిత్రులు’ కోసం హుషారైన పాటను రాశారు దాశరథి. అయితే ఈ మూవీ కంటే ముందు ‘వాగ్దానం’ సినిమా రిలీజయ్యింది. దాంతో అందులోని ‘నా కంటిపాపలో నిలిచిపోరా’ అనే పాటే ఆయన మొదటి సినిమా పాట అయ్యింది. ఆ తర్వాత ఎన్నో వైవిధ్యభరితమైన పాటలు ఆయన నుంచి వచ్చాయి. అందాల బొమ్మతో ఆటాడవా, ఓ ఉంగరాల ముంగురుల రాజా, గోరొంక గూటికే చేరావే చిలకా, గోదారి గట్టుంది గట్టుమీద సెట్టుంది, నిషాలేని నాడు హుషారేమి లేదు, నీవు రావు నిదుర రాదు, విన్నవించుకోనా చిన్న కోరిక, మదిలో వీణలు మ్రోగే, ఈవేళ నాలో ఎందుకో ఆశలు.. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి పాటా ఆణిముత్యమే. లాలి పాటయినా, ప్రేమగానమైనా, విషాద గీతికైనా.. ఆయన రాసిన ప్రతి మాటా మధురాతి మధురమే. 

తిరుమలవాసుని కీర్తించినా.. శ్రీరామ నామమైనా... 
    
ముఖ్యంగా కృష్ణుడిపై దాశరథి రాసిన పాటల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. చాలా సినిమాల్లో కన్నయ్య మీద కమ్మని పాటలు రాశారాయన. రారా కృష్ణయ్యా రారా కృష్ణయ్యా.. కన్నయ్యా నల్లని కన్నయ్యా.. నను పాలింపగ నడచీ వచ్చితివా గోపాలా.. మనసే కోవెలగా మమతలు మల్లెలుగా నిన్నే కొలిచెదరా కృష్ణా.. పాడెద నీ నామమే గోపాలా వంటి పాటలు ప్రేక్షకుల్ని భక్తి పారవశ్యంలో ముంచేశాయి. నడిరేయి ఏ జాములో స్వామి నిను చేర దిగి వచ్చునో అంటూ తిరుమలవాసుని సైతం కీర్తించారు దాశరథి. నీ దయ రాదా రామా అంటూ శ్రీరామ నామాన్ని సైతం జపించారు. 

భావానికి ప్రాధాన్యతనిచ్చిన కవి.. దాశరథి

ఇలా అలుపు లేకుండా ఆయన కలం పాటల్ని ఒలికిస్తూనే ఉంది. తెలుగు సినిమా పాటల్లో ప్రాసకి, భావానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన కవుల్లో ఆయన ఒకరు. విరహ గీతాలకు ఆత్రేయ, జానపదాలకు కొసరాజు, భావ గీతాలకు కృష్ణశాస్త్రి, అభ్యుదయ గీతాలకు శ్రీశ్రీ అంటూ ప్రతీ రచయిత ఒక్కో జోనర్‌‌కి ఫేమస్ అయ్యారు. అయితే దాశరథి ఏ ఒక్కదానికీ కట్టుబడిపోలేదు. అన్ని రకాల పాటలూ రాశారు. అంతేకాదు.. ఖవ్వాలి గీతాలకు శ్రీకారం చుట్టారు. ‘ఏ దివిలో విరిసిన పారిజాతమో’ లాంటి పాటలతో తెలుగు సినీ సాహిత్యానికి అత్యున్నత విలువలు కల్పించిన దాశరథి గురించి మాటల్లో వర్ణించలేం. ఆ సాహితీ సుగంధాన్ని ఆస్వాదిస్తూ అనుక్షణం ఆరాధించాల్సిందే.