
ప్రొఫెసర్ కంచ ఐలయ్య తేదీ 24.09.2025 నాడు ‘వెలుగు’ దినపత్రిక ఓపెన్ పేజీలో రాసిన ‘విశ్వ గురు ప్రచారంతో దేశం ఏమవుతుంది?’ అనే వ్యాసానికి స్పందన ఇది. ఇటీవల విశ్వకర్మ జయంతి రోజు దేశ ప్రధాని నరేంద్ర మోదీని విమర్శించాలన్న తీవ్రతలో ఎందరో విశ్వకర్మలు ఆరాధించే భగవాన్ విశ్వకర్మను తిట్టి వాళ్ళ మనోభావాలను గాయపరిచాడు. గతంలో సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు అంటూ వైశ్య కులాన్ని ఇష్టారీతిన విమర్శించాడు. కోట్ల మంది ఆరాధించే సరస్వతీ దేవిని ఆమె ఏ స్కూల్లో చదువుకున్నదని తీవ్ర విమర్శలు చేశాడు. దీనికంతా ఆయన పెట్టుకున్న పేరు బహుజన వాదం.
భావ స్వేచ్ఛ పేరుతో ఎంతోమంది మనోవేదనకు కేంద్ర బిందువుగా మారుతున్నాడు. తన ప్రతి అక్షరంలో ఆర్ఎస్ఎస్పై విషం కక్కుతూ తాను పెద్దవాడినవ్వాలని తాపత్రయపడుతున్నాడు. ఆ క్రమంలోనే ఈ వ్యాసం రాయాల్సివచ్చింది. విశ్వగురు అని మొదలుపెట్టిన వ్యాసం ఎమర్జెన్సీలో పార్టీల ఏకం ఆర్ఎస్ఎస్ బీజేపీ బలపడడం వంటి చర్చతో ప్రారంభం చేశారు. ఏ సిద్ధాంతం అయినా ఎవరైనా ఆపితే ఆగుతుందా? 2004 నుంచి 2014 వరకు యూపీఏ లీడర్‌గా ఉన్న కాంగ్రెస్ అధికారంలో ఉన్నా.. ఆర్ఎస్ఎస్/ బీజేపీలను బలహీనపరచలేదు అంటూ ఆర్ఎస్ఎస్పై తన అక్కసు వెళ్లగక్కాడు.
నిజానికి బీజేపీ బలపడడానికి 1975 ఎమర్జెన్సీ కారణం కాదు. 1966 జనవరిలో శాస్త్రి మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీని ప్రధానిగా ఎంచుకున్నారు. ఆమెకన్నా ఎంతో పేరుపొందిన ఎందరో సీనియర్ నాయకులు
కే.కామరాజు, బాబు జగ్జీవన్ రామ్, మొరార్జీ దేశాయ్ వంటి వారు ఆనాడు లైనులో ఉన్నా, లెక్కపెట్టకుండా ఇందిరను ప్రధానిగా ఎంచుకున్నప్పుడే, దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని ఎందరో నాయకులు ఆలోచించడం మొదలుపెట్టారు. అక్కడే అసలు ముసలం పుట్టింది.
సేవాభారతి సేవలు తెలుసా?
ఆర్ఎస్ఎస్ బీజేపీని జంట పదాలులాగ సూచించే ప్రయత్నం చేశాడు. నిజానికి బీజేపీ ఆర్ఎస్ఎస్ నడిపించే అనేక విభాగాల్లో ఒకటి. ఇతనికి తెలిసింది కేవలం రాజకీయ పరిభాష మాత్రమే కాబట్టి అయినదానికి కాని దానికి ఆర్ఎస్ఎస్ను బీజేపీతో ముడి వేస్తున్నాడు. కానీ, సంఘంచేసే సేవ గురించి తలా తోక తెలియదు. విద్య, వైద్య, స్కిల్ డెవలప్మెంట్ వంటి కార్యక్రమాలతో ‘సేవా భారతి’ 373 జిల్లాల్లో సుమారు 35 వేల ఆరువందల శాఖలు సేవను అందిస్తున్నాయి. దేశ విభజన ఉపద్రవం మొదలుకొని ఇటీవల వచ్చిన కొవిడ్ వరకు అనేక విపత్తుల సందర్భంలో ఆర్ఎస్ఎస్ తన సేవలను కొనసాగిస్తూ శతాబ్ది వైపు ప్రయాణం చేస్తూ ఉన్నది. సంఘం గురించి వర్ణమాల కూడా తెలియని ఇలాంటి మేధావులు అంతా రోజూ తమకు తోచిన విషయా
లన్నీ రాస్తూ ఉంటారు.
భారత్ విశ్వగురు కాకూడదా?
మళ్లీ 2019లో అధికారంలోకి వచ్చాక విశ్వగురు మత ప్రచారం పశ్చిమ దేశాల్లో చేయడం ఐలయ్యకు నచ్చలేదట. ట్రంప్ గెలవడంతో ఆర్ఎస్ఎస్ ఆలోచన తలకిందులైందట. యోగా పేరుతో అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్ వంటి దేశాల్లో హిందూత్వ సంస్థలు బలపరచడం కూడా ఆయనకు నచ్చలేదట. అంటే ఈ ప్రపంచ మేధావి ఐలయ్య ఆలోచనల ప్రకారం భారతదేశం విశ్వ గురువు స్థానంలో ఉండకూడదు అన్నమాట. మరి ఐలయ్య ఎలాంటి భారతదేశాన్ని కోరుకుంటున్నాడు? ఏండ్ల చరిత్ర ఉన్న యోగవిద్య ప్రపంచంలో తలమానికమైంది. ఎందరో ఋషులు చెప్పిన యోగవిద్య వల్ల మనదేశంలోని ఇంత పెద్ద జనాభా ఆరోగ్యంగా ఉంటున్న సంగతి ఈ మేధావికి తెలియకపోతే ఎలా? అందర్నీ ఆసుపత్రులు మాత్రమే రక్షిస్తున్నాయా? అంతేకాకుండా ఒక దేశ చరిత్రకు ఆధారభూతమైన సాంస్కృతిక దృక్పథాన్ని విస్మరించే వాళ్ళు మేధావులు ఎలా అవుతారు?
భారత్ స్వయం సెక్యులర్
ఇస్లామిక్ దేశాలలో ప్రజాస్వామ్యం లేదని అలాగే ట్రంప్ కూడా క్రిస్టియన్ మతవాది అని ఇంచుమించు మోదీది కూడా అదే ధోరణి అన్నట్టుగా చెప్పకనే చెప్పారు ఐలయ్య! ఇంకో పెద్ద అబద్ధాన్ని సమాజం ముందుపెట్టే ప్రయత్నం చేశారు. ప్రపంచ మతాలను అధ్యయనం చేసిన అంబేద్కర్ జాగ్రత్తగా ఆలోచించి సెక్యులర్ ప్రజాస్వామ్య దేశంగా రూపుదిద్దే రాజ్యాంగం రాశాడు అన్నారు. ఆసియా ఖండంలో అతిపెద్ద ప్రజాస్వామ్యంగా బతకడానికి ఈ సెక్యులర్ డెమోక్రసీ కారణమన్నాడు. అసలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన మొదటి రాజ్యాంగంలో సెక్యులర్ అన్న శబ్దం ఉందా? 1950 జనవరి 26న ఆమోదించిన భారత రాజ్యాంగంలో అంబేద్కర్ సెక్యులర్ అన్న పదాలను అందులో చేర్చలేదు.
ఈ దేశం స్వయంగా సెక్యులర్‌గా ఉన్నది. దానికి కారణం ఈ దేశంలోని మెజార్టీ హిందువులు. అన్నింటిని అంగీకరించే సహృదయత. రాజ్యాంగ ప్రవేశిక మొత్తం రాజ్యాంగానికి తలమానికమైంది. అది శిలాశాసనం. 1976 ఎమర్జెన్సీ తర్వాత నాటి ప్రధాని ఇందిరాగాంధీ ప్రతిపక్ష నాయకులందరినీ జైలులో బంధించి 42వ రాజ్యాంగ సవరణ ద్వారా సోషలిస్టు, సెక్యులర్ పదాలను చేర్చి రాజ్యాంగాన్ని అవమానపరిచిన విషయాన్ని తెలుసుకోలేని మేధావులు ఇంకా ఉన్నారా అంటే ఆశ్చర్యం అనిపిస్తుంది.
భారత్‌కు మించిన సెక్యులర్ ఎవరు?
హిందూత్వం ఒక జీవన విధానం అని ఎందరో హేతువాదులు, కమ్యూనిస్టులు కూడా చెప్పిన విషయం మర్చిపోరాదు. చివరకు హిందూత్వ ఒక మతం కాదని అది విశ్వజనీనమైన ఒక జీవన విధానం అని సుప్రీంకోర్టు తన తీర్పులోనే చెప్పింది. హిందుత్వ ఉన్నందుకే ఈ దేశంలో సెక్యులరిజం మనగలుగుతుంది అన్న సత్యం విదేశాల్లో విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న ఎందరో రీసెర్చ్ స్కాలర్స్ చెప్తున్న మాట. దేశ విభజన జరిగి భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇద్దరు దళిత మేధావులు పాకిస్తాన్, ఇండియాకు న్యాయశాఖ మంత్రులుగా పని చేశారు.
జోగేంద్రనాథ్ మండల్ ఇలాంటి అతికి వెళ్లే పాకిస్తాన్లో చేతులు కాల్చుకున్నాడు. అదే భారతదేశానికి న్యాయశాఖ మంత్రిగా పనిచేసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో ప్రతివారి గుండెల్లో కొలువై ఉన్నాడు. హిందూత్వ కారణంగానే ప్రజాస్వామ్య దృక్పథం బతుకుతుందన్న విషయం జోగేంద్రనాథ్ మండల్ తిరిగి భారతదేశానికి వచ్చిన తర్వాత రాసిన కథనం ఈ మేధావి వర్గం చదవవచ్చు.
ఆర్ఎస్ఎస్ బూచీగా..
కమ్యూనిస్టు సిద్ధాంతం వెనకబడిపోయిందని, ఆర్ఎస్ఎస్ ముందుకు వెళుతుందని కూడా ఐలయ్య ఏదేదో రాశారు. ఆర్ఎస్ఎస్, కమ్యూనిస్టు పార్టీ రెండూ ఇంచుమించు ఒకే సంవత్సరంలో ప్రారంభమయ్యాయి. ఇవాళ కమ్యూనిస్టుల పరిస్థితి దిక్కులేని నావలాగ ఉంది. ఆర్ఎస్ఎస్ తన పనిని నిశ్శబ్దంగా చేసుకుంటూ వెళ్తుంది. అక్కడ పేరు ప్రతిష్టలకు, హింసకు తావులేదు. కానీ కేరళ, బెంగాల్ వంటి కమ్యూనిస్టు పరిపాలన ఉన్న రాష్ట్రాలలో వందల మంది ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు, ప్రచారకుల ప్రాణాలు తీయబడ్డాయి. ఆర్ఎస్ఎస్ ఎప్పుడూ హింసను ప్రోత్సహించదు. గాంధీ మరణం తర్వాత విధించిన నిషేధం తర్వాత వచ్చిన రిటైర్డ్ జడ్జ్ జేజే కపూర్ చైర్మన్‌గా 1969లో దాదాపు 100 మంది సాక్షులను విచారించి సుదీర్ఘమైన నివేదిక సమర్పించినప్పటికీ ఈ దేశంలో ఆర్ఎస్ఎస్ను బూచిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఈ ప్రొఫెసర్ కూడా రోజూ ఆర్ఎస్ఎస్ ను తిట్టడం వల్ల తన కీర్తి
పెరుగుతుందని భావిస్తున్నాడు.
సంఘం కులం అడగదు
కులం విషయం వచ్చేసరికి ఆర్ఎస్ఎస్ను అపఖ్యాతి పాలు చేయడానికి ఇలాంటి మేధావులు కొందరు కులాల మధ్య ఘర్షణలు సృష్టిస్తున్నారు. ఆర్ఎస్ఎస్ లో సామాజిక సమరసత ఒక ఉద్యమంగా నడుస్తోంది. సంఘంలో ఎవరినీ కులం అడగరు. ఆర్ఎస్ఎస్ మూడో సర్ సంఘ చాలక్ బాలా సాహెబ్ దేవదాస్ .. అంటరానితనం నేరం కాకపోతే ఈ ప్రపంచంలో ఇంకేది నేరంకాదు అన్నాడు. ఏ స్వయంసేవక్ కూడా కులాన్ని అసలు పట్టించుకోరు. ఈ విషయాన్ని ఆర్ఎస్ఎస్ శిక్షణా శిబిరాన్ని సందర్శించిన మహాత్మా గాంధీ, డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ చెప్పారు. కానీ, ఐలయ్య లాంటి మహా మేధావులు చూసే ప్రతి కోణంలో కులం తప్ప ఇంకేం కనిపించదు.
డాక్టర్. పి. భాస్కరయోగి
సోషల్ ఎనలిస్ట్