ఉద్యాన పంటల విస్తరణకు ప్రత్యేక రాయితీలు

ఉద్యాన పంటల విస్తరణకు ప్రత్యేక రాయితీలు

సంగారెడ్డి, వెలుగు : సంగారెడ్డి జిల్లాలో పండ్ల తోటలకు ఉద్యాన శాఖ ప్రోత్సహిస్తోంది. ఆ పంటలపై ఆధారపడ్డ రైతులను ఆదుకునేందుకు ముందుకెళ్తోంది. గత నెలలో కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న కూరగాయల పంటల నష్టాల నుంచి రైతులు తేరుకునేందుకు ఉద్యానపంటలను వేసుకోవాలని సూచిస్తున్నారు. ఈ ఏడాది సమీకృత ఉద్యాన అభివృద్ధి మిషన్ (ఎంఐడిహెచ్) ద్వారా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ పండ్లు, కూరగాయల తోటల సాగు కోసం ప్రత్యేక కార్యచరణ రూపొందించింది. 2022-23 వార్షిక ప్రణాళికలో భాగంగా ఆయా పథకాలు, రాయితీల గురించి రైతులను చైతన్యవంతుల్ని చేస్తోంది. పండ్ల తోటలు, కూరగాయల సాగు, నీటి కుంటలు, ఉద్యాన యాంత్రీకరణ, మల్చింగ్ తదితర పథకాలపై రాయితీలు ప్రకటించింది. కూరగాయల పంటలకు నారు సరఫరా చేసేందుకు శ్రీకారం చుట్టగా, ఉల్లిగడ్డ నిల్వ కోసం ప్రత్యేకంగా షెడ్లు నిర్మించేందుకు ఏర్పాటు చేస్తున్నారు.వీటితో పాటు ప్యాక్ హౌస్, కోల్డ్ స్టోరేజ్ యూనిట్లు, సోలార్ కోల్డ్ రూమ్ లు, ప్రో కూలింగ్ యూనిట్లను కూడా రాయితీపై మంజూరు చేయనున్నారు. నష్టపోయిన రైతులు తిరిగి లాభాలు పొందేలా ఉద్యాన శాఖ ప్రోత్సహిస్తోంది.

ప్రోత్సాహకాలు ఇలా...

జిల్లాలో పండ్ల తోటల పెంపకానికి ఉద్యాన రైతులకు అనేక ప్రోత్సాహకాలు ఇస్తున్నారు. ముఖ్యంగా అరటి, జామ, మామిడి, బొప్పాయి తోటలకు ప్రాధాన్యత ఇస్తూ రాయితీలు 
ప్రకటించింది. 

కూరగాయలకు...

టమాటా, వంకాయ, మిర్చి కూరగాయల పంటల నారుకు రాయితీ ఇవ్వనున్నారు. అయితే జీడిమెట్లలోని సీఓఈ ద్వారా ఆయా పంటలకు రాయితీపై నారు సరఫరా చేయనున్నారు. దీని కోసం రైతులు 40 రోజుల ముందుగానే ఏడీహెచ్ జీడిమెట్ల పేరుతో డీడీ చెల్లించాల్సి ఉంటుంది. జిల్లాలో 20 హెక్టార్లలో కూరగాయల సాగుకు రాయితీలు ఇచ్చేందుకు అధికారులు ముందుకొచ్చారు. కాగా టమాటా, వంకాయ పంటలకు ఎకరాకు రూ.1,500, మిరపకు రూ.1,280 డీడీ కడితే టమాట, వంకాయలకు రూ.6,500 రాయితీ ఇస్తుంది. అదే మిరప పంటకు రూ.6,720 రాయితీ ఇస్తారు. ఇదిలా ఉంటే జిల్లాలో 4 ఉల్లి షెడ్ల నిర్మాణాలకు రాయితీ ఇచ్చేందుకు అధికారులు నిర్ణయించారు. ఇందుకుగాను 25 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల షెడ్లకు రూ.1.75 లక్షల ఖర్చు అవుతుండగా ఇందులో 50 శాతం రాయితీ లభిస్తోంది. అలాగే ఒక్కో నీటి కుంటకు రూ.75వేల రాయితీ, హెక్టారు మల్చింగ్​కు రూ.16వేలు అందిస్తున్నారు.