ఆసుపత్రి నిర్మాణం త్వరగా పూర్తి చేయాలి : సిద్దిపేట కలెక్టర్

ఆసుపత్రి నిర్మాణం త్వరగా పూర్తి చేయాలి :  సిద్దిపేట కలెక్టర్

సిద్దిపేట రూరల్, వెలుగు : జిల్లాలోని 1000 పడకల ఆసుపత్రిని నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ వేగంగా నిర్మించాలని సంబంధిత అధికారులను సిద్దిపేట కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఆదేశించారు. గురువారం సిద్దిపేట అర్బన్ మండల పరిధిలో ఎన్సాన్ పల్లి గ్రామ శివారులో 28ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న 1000 పడకల ప్రభుత్వ ఆసుపత్రి పనులను ఆయన పరిశీలించారు. ఏజెన్సీ టీఎస్ఎంఎస్ఐడీసీ ఇంజినీర్ అధికారులు కలెక్టర్ కు పనుల పురోగతిని వివరించారు. విశాలమైన పార్కింగ్​ ఉండే విధంగా చూడాలన్నారు. వాటర్ ఫెసిలిటీ ఉండాలన్నారు. ప్రహరీ ను నిర్మించాలన్నారు.  మార్చూరి, పారామెడికల్, అటెండర్ షెడ్  ప్లాన్​ రూపొందించాలన్నారు. నిర్ణీత గడువులోపు నిర్మాణం పూర్తి చేయాలని ఏజెన్సీలను ఆదేశించారు. 

ఆటో నగర్ ప్రాంత పనుల పరిశీలన..

సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి, ముండ్రాయి శివారులో 26ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న ఆటోనగర్ ప్రాంతాన్ని గురువారం కలెక్టర్ పరిశీలించారు. అక్కడ భూమిని ఒకే లెవల్ చేయడానికి ఎస్టిమేట్ కంటే ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతుందని కాంట్రక్టర్ జగదీశ్వర్ రెడ్డి తెలుపగా స్థానిక ఇంజనీరింగ్ అధికారులు స్థలాన్ని చూడకుండా ఎలా తక్కువగా ఎస్టిమేట్ చేస్తారని కలెక్టర్​అసహనం వ్యక్తం చేశారు. ఆటోనగర్ కు కావాల్సిన అదనపు నిధులను మంజూరు చేస్తానని తెలిపారు. కలెక్టర్ వెంట ఆర్డీవో అనంతరెడ్డి, అర్బన్ ఎమ్మార్వో విద్యాసాగర్, సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, టీఎస్ఎంఎస్ఐడీసీ డీఈ విశ్వ ప్రసాద్, ఈఈ శ్రీనివాస్, కాంట్రక్టర్ బాపినీడు ఉన్నారు.