చెక్‌‌ డ్యామ్‌‌ కూలిన ఘటనపై వేగంగా విచారణ.. ఘటనాస్థలాన్ని పరిశీలించిన కలెక్టర్‌‌, సీపీ

చెక్‌‌ డ్యామ్‌‌ కూలిన ఘటనపై వేగంగా విచారణ..    ఘటనాస్థలాన్ని పరిశీలించిన కలెక్టర్‌‌, సీపీ
  •     ఆధారాలు సేకరించిన హైదరాబాద్‌‌ ఫోరెన్సిక్‌‌ టీమ్‌‌

కరీంనగర్, వెలుగు : కరీంనగర్‌‌ జిల్లా జమ్మికుంట మండలం తనుగుల శివారులో మానేరు వాగుపై నిర్మించిన చెక్‌‌డ్యామ్‌‌ కూలిన ఘటనపై పోలీస్‌‌ శాఖ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ ఘటన సహజంగా జరిగిందా, లేక కుట్ర కోణం ఏమైనా ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో జమ్మికుంట పోలీసులు కేసు నమోదు విచారణ చేస్తున్నారు. 

కరీంనగర్‌‌ కలెక్టర్‌‌ పమేలా సత్పతి, కరీంనగర్ సీపీ గౌష్‌‌ ఆలంతో పాటు హైదరాబాద్‌‌ నుంచి వచ్చిన ఫోరెన్సిక్‌‌ నిపుణులు సోమవారం చెక్‌‌డ్యామ్‌‌ను పరిశీలించారు. ఫోరెన్సిక్‌‌ ల్యాబ్‌‌ అసిస్టెంట్‌‌ డైరెక్టర్‌‌ వెంకట్‌‌రాజ్‌‌ ఆధ్వర్యంలో కరీంనగర్‌‌ క్లూస్‌‌టీం సభ్యులు, ఫింగర్‌‌ ప్రింట్‌‌ ఇన్స్‌‌ప్రెక్టర్లు రాజు, స్వర్ణజ్యోతి ఆధారాలు సేకరించారు. 

అనంతరం సీపీ గౌష్ ఆలం మాట్లాడుతూ.. సాంకేతిక నిపుణుల సహకారంతో శాంపిల్స్‌‌ సేకరించామని, రిపోర్టు వచ్చాక చర్యలు తీసుకుంటామని చెప్పారు. వారి వెంట హుజురాబాద్‌‌ ఏసీపీ మాధవి, పెద్దపల్లి ఏసీపీ కృష్ణ, ఇన్స్‌‌పెక్టర్లు రామకృష్ణగౌడ్, లక్ష్మీనారాయణ ఉన్నారు.