భూమి, ఆకాశం, సూర్యచంద్రులు, నీరు, అగ్ని, గాలి, నది, సముద్రం, పక్షులు, చెట్టు,పువ్వు....ఇలా అన్నీ మానవావళి శ్రేయస్సుకీ, మానవజన్మ సార్ధతతకు కావాల్సిన సందేశాలను తమ మనుగడ ద్వారా ఇస్తూనే వుంటాయి. ఇలాంటి వాటి గురించి మానవుడు ఎలా జీవించాలో.. ఎలా గమ్యాన్ని చేరుకోవాలో తెలుసుకోవాలి. .అది ఎలాగో ఓసారి పరిశీలిద్దాం...
ప్రకృతిలో పరమాత్మతత్త్వం ప్రతిబింబిస్తుంది. ప్రతీది సృష్టికర్త నియమానుసారం నడుస్తూ, సందేశాన్ని సకల మానవాళికి అందిస్తుంది . ప్రకృతితో సహజీవనం చేసే పశుపక్షాదులు కూడా భగవంతుడు తమని సృష్టించినప్పుడు వాటికి ఉండే సహజగుణంలోనే ఉంటూ జీవనాన్ని కొనసాగిస్తాయి. అవన్నీ కూడా మానవుడు ఎలా జీవించాలి.. , ఏం నేర్చుకోవాలి అనే విషయాలను తెలియజేస్తాయి...
భూమి : గుండెలో గుచ్చినను భరించి ... అదేమీ ఆలోచించకుండా మానవుడు జీవించేందుకు పంటలను, పుష్ప ఫలవృక్షాలను, ప్రసాదిస్తూ ప్రతిఫలాన్ని ఇస్తుంది. అలానే, మలమూత్రాలను విసర్జించినను, త్రొక్కివేస్తున్నను, ఎంతో నష్టం ... కష్టం కలుగుతున్నా.. క్షమించే గుణంతో సహనంగా ఉండడం ద్వారా - ఓర్పునూ, భూతదయను కల్గివుండాలన్న సందేశం భూమి నుంచి నేర్చకోవాలి.
ఆకాశం: వచ్చి పోయే మేఘాల వలన మలినపడకుండా, సూర్యచంద్రులు, నక్షత్రాలు, వాయువు తనతో ఉన్నా, వాటితో ఎలాంటి సంగత్వం ఏర్పరుచుకోకుండా, నిర్మలంగా ఉంటుంది. అంటే - మానవుడు కూడా వచ్చే పోయే ఆలోచనలతో అంతఃకరణమును మలినపరుచుకోకుండా స్వచ్ఛంగా ఉండాలని, ఎన్ని బంధాల మధ్య ఉన్నా వాటితో కలవకుండా నిర్మలంగా వుండాలన్న సందేశాన్ని ఆకాశం ఇస్తుంది.
సూర్యుడు : ఒక చిన్న మడుగైనా, పిల్లకాలువైనా, నదైనా, మహాసముద్రమైనా అన్నింటిలో ఒకేలా ప్రతిబింబిస్తూ, అలానే, నీళ్ళ కుండలలో ప్రతిబింబించి అన్ని చోట్ల ఒకేలా సూర్యుడు కనపడతాడు. అలాగే - మానవుడు సమత్వదృష్టి కలిగి..పరమాత్మ ఒక్కడే అయినా అనేక శరీరములయందు ఆత్మగా గోచరిస్తాడన్న జ్ఞాన సందేశాన్ని సూర్యుడు నుంచి నేర్చుకోవాలి.
చంద్రుడు : వెలుగూచీకటలతో... వృద్ధిక్షయాలను పొందడం ద్వారా - జీవితంలో సుఖదుఃఖాలు సహజమనే అనే విషయాన్ని చంద్రుని ద్వారా గుర్తించాలి. చంద్రుడు రాత్రి సమయంలో కనిపించి పగలు ఉండడు కదా..! అలాగే కష్ట సుఖాలు కూడా ఎల్లవేళలా ఉండవనే సత్యాన్ని గ్రహించాలి.
నీరు : ఎటువంటి మలినాలైనను వాటిని శుద్ధిచేసి తాజాదనమును, నిగారింపును తీసుకువస్తుంది. అందుకే గంగాజలం.. పుణ్య నదుల జలము.. ఇతర శుభకార్యాల్లో.. పుణ్య: వచనం అనే తంతుతో నీటిలో ఆవాహన చేసి... ఆ నీటిని సంప్రోక్షణ చేసి శుద్ది చేస్తారు. అలానే - మానవుడు కూడా మనోమాలిన్యాలను తొలగించుకొని శుద్ధత్వము కలిగి ఉండాలనే సందేశాన్ని నీటి నుంచి నేర్చుకోవాలి.
అగ్ని : స్థూల మాలిన్యాలని హరింపజేసి, ప్రకాశిస్తూ, కారణ రూపాన్ని విడిచిపెట్టడం ద్వారా - మానవుడు కూడా కర్మపాశాలను హరింపజేసుకొని భక్తిజ్ఞానంలతో ప్రకాశించాలన్న సందేశం ఇచ్చేదే అగ్ని..!
గాలి: అన్నిచోట్ల తిరిగినను, అన్నింటిని స్పృశించినను అన్నింటిని ఎక్కడికక్కడే విడిచిపెట్టేస్తూ, అంతటా ఉన్ననూ ఏదీ అంటించుకోకుండా స్వచ్ఛంగా ఉంటూ, గాలి ఉన్నచోట వాతావరణమును చల్లగా, ఉల్లాసంగా ఆహ్లాదంగా మార్చుతుంది కదా..! అలానే మానవుల్లో జీవాన్ని నింపడం ద్వారా - అహంకార రహితంగా ఏదీ అంటించుకోకుండా తామరాకుపై నీటిబొట్టులా జీవించాలి. మనుషుల ఉన్న ప్రదేశంలో అందరిని ఆనందంగా ఉంచుతూ, ఉల్లాసంగా జీవించాలి. ఈవిషయానికి గాలిని స్ఫూర్తిగా తీసుకోవాలి.
నది : ఎక్కడ యున్నదో పట్టించుకోక పర్వతమైన, లోయైనా, వాగులౌనా , వంకలైనా, డొంకలైనా, రాళ్ళరప్పల సందులైనా ఏమాత్రం తేడా లేకుండా ప్రవహిస్తూ, తనకి మూలమైన సముద్రాన్ని చేరేంతవరకు ప్రయాణిస్తూనే వుంటుంది. ఇలా ప్రవహించేటప్పుడు పత్రపుష్పాదులు, చెక్కముక్కలు, చెత్తా చెదారములు, చిరు చిరు ప్రాణులు ప్రవాహంలో తనతోపాటు తీసుకువెళ్తూ, తనలో పాలుపోసినా, చెత్తను పడేసిన సముద్రంలో కలిసేంతవరకు ప్రవహిస్తూనే ఉంటుంది. - మానవ జీవితం కూడా పరవళ్ళుతో ప్రవహించే తనలాంటిదేనని, ఎన్ని అడ్డంకులు వచ్చినా .. వాటిని పట్టించుకోకుండా అనుకున్న గమ్యం చేరేంతవరకు గమనమును సాగించాలన్న సందేశంఇచ్చేదే నదీ ప్రవాహం. . . !
సముద్రం : అలుపు లేకుండా తీరాన్ని తాకాలని ప్రయత్నించే అలలు ద్వారా... ఎన్ని నదులు తనలో ప్రవేశించినా ... పొంగిపోర్లిపోకుండా.... నదులు తనలో చేరక ఎండిపోయినను .. సముద్రం వట్టిపోకుండ ఉండడం ద్వారా - ఎన్ని సంపదలు తనని చేరుతున్న పొంగిపోదు. అలాగే మానవునికి సంపదలు చేరకపోయినా కృంగిపోకుండా హెచ్చుతగ్గుల స్థితి యందు స్థితప్రజ్ఞతో గంభీరుడై, అనుకున్నది సాదించాలనే పట్టుదలతో మానవుడు ఉండాలన్నది సముద్ర సందేశం.
పక్షులు : కిలకిలారాగాలతో ప్రతిక్షణం ఆనందంగా హాయిగా స్వేచ్ఛగా పరిపూర్ణంగా జీవించడం ద్వారా మానవుడు కూడా ప్రకృతి లోనే ఉంటూ, ఆనందంగా పరిపూర్ణంగా జీవించాలన్న విషయాన్ని పక్షుల నుంచి నేర్చుకోవాలి.
చెట్టు : తన చెంతకు ఎవరొచ్చినా తరతమ భేదం లేకుండా, హెచ్చుతగ్గుల భేదం లేకుండా వచ్చింది పశుపక్షాదులా, మానవులా అన్న తారతమ్యం లేకుండా నీడను, పండ్లను ఇస్తుంది . అలాగే మానవుడు కూడా నిస్వార్ధ సేవాపరుడై ఎలా ఉండాలో చెట్టును చూసి నేర్చుకోవాలి.
పువ్వు : మొక్కపై అలరారుతూ అందంగా వికసించి, తన దగ్గరకు వచ్చిన వాళ్ళందరికీ పరిమళాన్ని ఇచ్చి ఆనందమును కల్గిస్తూ, వాడిపోయక హాయిగా రాలిపోతుంది. - మానవుడు కూడా అంత ఆదర్శంగానే జ్ఞానవంతంగా పువ్వు మాదిరిగా జీవించాలి .
