​రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల పాలు చేసిండు .. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం ఒక్కటే

​రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల పాలు చేసిండు .. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం ఒక్కటే
  • ఆరునూరైనా ఆరు గ్యారంటీలు అమలు చేస్తాం
  • కాంగ్రెస్ ను భారీ మెజార్టీతో గెలిపించండి
  • ఆర్మూర్, సాలురా​ కార్నర్​ మీటింగ్​లలో ​మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చౌహాన్​

ఆర్మూర్, బోధన్, వెలుగు: తెలంగాణ ప్రజలపై ప్రేమతో సోనియాగాంధీ ప్రత్యేక రాష్ట్రమిస్తే, పదేండ్ల పాటు అధికారంలో ఉన్న కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని మహారాష్ట్ర మాజీ సీఎం, కాంగ్రెస్​ సీనియర్​ లీడర్ అశోక్​ చౌహాన్ ​విమర్శించారు. తెలంగాణలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని, ప్రజలు ఆలోచనతో ఓటేసి కాంగ్రెస్​కు పట్టం కట్టాలన్నారు.

శుక్రవారం ఆర్మూర్, సాలురాలో జరిగిన కార్నర్​మీటింగ్​లలో ఆయన మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్ట్​ను రూ.40 వేల కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించి దాన్ని రూ.లక్ష కోట్లకు పెంచారని, అందులో కేసీఆర్ కుటుంబం రూ.వేల కోట్లు దోచుకుందన్నారు. కేసీఆర్ డ్రీమ్​గా చెప్పుకున్న మేడిగడ్డ ప్రాజెక్ట్​ నాణ్యత లేమి ఇటీవల బహిర్గతమయిందన్నారు. పదేండ్లలో ఎంత మంది పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇచ్చారని ప్రశ్నించారు.

తెలంగాణ అభివృద్ధి పేరుతో రూ.5 లక్షల కోట్లు అప్పు చేశారని, వాటిని తీర్చేందుకు ప్రజలు భూములను లాక్కొనే ప్రయత్నం చేస్తున్నారన్నారు. లిక్కర్ సేల్స్​ పెంచి ప్రజలను మందుకు బానిసలను చేశారన్నారు. తెలంగాణలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు గడిచిన పదేండ్లలో ఎలాంటి న్యాయం జరగలేదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే ఆరు గ్యారంటీలను తప్పక అమలు చేస్తామన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్న రాజస్థాన్, కర్నాటకలో ఇచ్చిన హామీలను సంపూర్ణంగా అమలు చేసినట్లు స్పష్టం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే అదే స్ఫూర్తితో మహారాష్ట్రలోనూ విజయం సాధిస్తామన్నారు.

ఆర్మూర్ లో గుండాగిరిని తరిమికొట్టి నిజాయితీ పరుడైన వినయ్ రెడ్డిని గెలిపించాలని కోరారు. బోధన్​లో సీనియర్​నాయకుడు, మాజీ మంత్రి, సౌమ్యుడైన సుదర్శన్​రెడ్డికి పట్టం కట్టాలని కోరారు. సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. ఎమ్మెల్యే షకీల్​అక్రమ ఇసుక, బియ్యం దందాలతో వేల కోట్లు గడించారని, ఆ డబ్బుతోనే మళ్లీ గెలవాలని చూస్తున్నారన్నారు. బోధన్​లో పదేండ్లలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. నియోజకవర్గంలో నిరుపేద ప్రజలకు ఇండ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఇస్తామన్నారు.

ఈ సందర్భంగా బీజేపీ, బీఆర్ఎస్​ పార్టీలకు చెందిన పలువురు చౌహాన్ ​సమక్షంలో కాంగ్రెస్​లో చేరారు. కార్యక్రమంలో ఏఐసీసీ ప్రతినిధులు డాక్టర్ అంజలి, జహర్, మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్, నిజామాబాద్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ధర్మపురి సంజయ్, కాంగ్రెస్ నాయకులు గోర్త రాజేందర్, మార చంద్రమోహన్, సాయిబాబా గౌడ్, యాల్ల సాయిరెడ్డి, మంథని శ్రీనివాస్ రెడ్డి, కోల వెంకటేశ్, టీపీసీసీ ఉపాధ్యక్షుడు తాహేర్,​ మాజీ ఎంపీపీ ఇట్టడి భాజన్న, మండలాధ్యక్షులు జీవన్, విజయ్, మంద మహిపాల్, మహమూద్ అలీ, రవికాంత్ రెడ్డి, ఎస్.కె బాలు, మాజీద్, జిమ్మి రవి, మూగ ప్రభాకర్, నారాయణ పాల్గొన్నారు.