
- గ్రౌండ్ వాటర్ పెంచేందుకు మున్సిపల్ శాఖ కసరత్తు
- చెన్నై, అహ్మదాబాద్‌లో విజయవంతం
- అక్కడికి వెళ్లి అధ్యయనం చేసిన అధికారులు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో తాగునీటి సమస్యలు రాకుండా గ్రౌండ్ వాటర్ పెరిగేలా మున్సిపల్ శాఖ చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. అందులో భాగంగానే ప్రతి కార్పొరేషన్, మున్సిపాలిటీలో గ్రౌండ్ వాటర్ ను సంరక్షించడం, వరదల నివారణ, భారీ వర్షాల నేపథ్యంలో వరద నీటి కాలువలపై ఒత్తిడి తగ్గించడం, చెరువుల సమీపంలో నీటి వృథాను నివారించడం వంటి చర్యలు తీసుకోనున్నారు. అందుకు అనుగుణంగా ప్రతి మున్సిపాలిటీలో తమిళనాడు, గుజరాత్ తరహాలో స్పాంజ్ పార్కులను ఏర్పాటు చేయాలని మున్సిపల్ శాఖ నిర్ణయించింది. ఒక్కో మున్సిపాలిటీలో ఏరియా, అవసరాన్ని బట్టి పార్కుల ఏర్పాటుకు స్థలాలను గుర్తించి ప్రతిపాదనలు పంపాలని కమిషనర్లను మున్సిపల్ శాఖ సెక్రటరీ, సీడీఎంఏ (కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్) టీకే శ్రీదేవి ఇటీవలే ఆదేశాలు జారీ చేశారు. వీటిపై సమగ్రంగా అధ్యయనం చేయడానికి ఓ కన్సల్టెంట్ ను నియమించగా ఇటీవల ఉన్నతాధికారులకు కన్సెల్టెంట్ నిర్వాహకులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. స్థలాలు ఫైనల్ అయ్యాక డీపీఆర్ లు రెడీ చేసి అధికారులు టెండర్లు పిలవనున్నారు.
గుజరాత్, తమిళనాడులో సక్సెస్
గుజరాత్ లోని అహ్మదాబాద్, తమిళనాడులోని చెన్నై మున్సిపల్ కార్పొరేషన్లలో స్పాంజ్ పార్కులు ఉన్నాయి. అక్కడ ఇవి సక్సెస్ కావడంతో ఆ ప్రాంతాలకు మన మున్సిపల్ శాఖ అధికారులు వెళ్లి అధ్యయనం చేసి వచ్చారు. అక్కడ ఒక్కో స్పాంజి పార్కు కోసం రూ.కోటికిపైనే ఖర్చు చేసినట్లు గుర్తించారు. చెన్నై లో 126 ఓపెన్ స్పేస్ రిజర్వ్ (ఓఎస్ఆర్) లను గుర్తించి ఈ పార్కులు ఏర్పాటు చేశారు. అయితే రాష్ట్రంలో ప్రతి మున్సిపాలిటీలో అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి స్థలాలను గుర్తించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.
ఆ ప్రాంతాలను హెడ్ ఆఫీసు అధికారులు పరిశీలించిన తర్వాత ఫీజిబిలిటీ ఉంటేనే స్పాంజ్ పార్కు ఏర్పాటు చేయడానికి అనుమతి ఇస్తామని అధికారులు చెబుతున్నారు. చెన్నైలోని పోరూరులో మొదటి వెట్‌ల్యాండ్ స్పాంజ్ పార్క్ ను ఏర్పాటు చేశారు. తమిళనాడులోని హోసూరులో కూడా ఒక స్పాంజ్ పార్క్ ఉంది. వరదలను నివారించడానికి, నీటిని నిర్వహించడానికి ఈ పార్కులు
ఉపయోగపడుతున్నాయి.
స్పాంజ్ పార్కులతో ఎన్నో ఉపయోగాలు
స్పాంజ్ పార్కులు అంటే వర్షపు నీటిని పీల్చుకునేలా, వడపోసేలా రూపొందించిన పార్కులు. వరదలను తగ్గించడానికి, భూగర్భ జలాలను పెంచడానికి వీటిని ఏర్పాటు చేస్తారు. ఇవి కూడా ఇంకుడు గుంతల లాంటివే. కాకపోతే స్పాంజ్ పార్కులో ఎక్కువ నీటిని నిల్వ చేయవచ్చు. వర్షపు నీటిని పీల్చుకోవడంతో పాటు వరదలను ఇవి తగ్గిస్తాయి. వరదల నియంత్రణ, నీటి కాలుష్య నియంత్రణ, పచ్చదనం పెంచడం ద్వారా పట్టణ ప్రాంతాలకు పర్యావరణ ప్రయోజనాలను చేకూరుస్తాయి. జీవవైవిధ్యాన్ని పెంచడానికి ఎంతగానో ఉపయోగపడతాయని అధికారులు చెబుతున్నారు.
‘‘స్పాంజ్ పార్కులు ఎండిపోయిన బావుల్లో నీరు ఊరేలా ఉపయోగపడటంతో పాటు గ్రౌండ్ వాటర్‌ను మరింత పెంచుతాయి. భారీ వర్షాలు వచ్చినపుడు వరద నీళ్లు వృధాగా పోకుండా ఈ పార్కులకు మళ్లించవచ్చు. తరువాత ఆ నీటిని సమీపంలోని ఎస్టీపీలకు డైవర్ట్ చేయవచ్చు. ఈ పార్క్ ఏర్పాటుకు సుమారు రూ.20 లక్షలు ఖర్చవుతుంది. 10 ఫీట్ల లోతులో వీటిని నిర్మించవచ్చు” అని చెన్నై లో పర్యటించిన ఓ మున్సిపల్ కమిషనర్ తెలిపారు.