వారి కన్నుపడితే.. బైకు లాక్ ఎలాంటిదైనా ఓపెన్

వారి కన్నుపడితే.. బైకు లాక్ ఎలాంటిదైనా ఓపెన్
  • స్పోర్ట్స్ బైకుల చోరీ ముఠాకు చెక్
  • ఇద్దరు నిందితుల అరెస్ట్.. 8 బైకులు స్వాధీనం చేసుకున్న అసిఫ్ నగర్ పోలీసులు

హైదరాబాద్: వారి కన్ను పడిందంటే చాలు ఎలాంటి స్పోర్ట్స్ బైకు అయినా సరే వారికి చిక్కాల్సిందే. పకడ్బందీగా రెక్కీ చేసి.. ఎంతటి కఠినమైన లాకులు వేసినా.. గుట్టుచప్పుడు కాకుండా  సులువుగా తీసేసి బైకు సొంతదారుడిలా తీసుకెళ్లిపోతారు. పలుచోట్ల చోరీలు జరగడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిఘా పెట్టి వలపన్నారు. ఎట్టకేలకు సోమవారం నాడు అసిఫ్ నగర్ పోలీసులకు నిందితులు పట్టుపడ్డారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా దొంగలించిన 8 బైకులు వారి వద్ద దొరికాయి.  
యూట్యూబ్ లో వీడియోలు చూసి బైకుల చోరీ నేర్చుకున్నారు
స్పోర్ట్స్ బైకులను చోరీ చేసిన నిందితులను మసబ్ ట్యాంక్ వెస్ట్ జోన్ డీసీపీ ఆఫీసులో సోమవారం మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. నిందితుల గురించి హైదరాబాద్ జాయింట్ సీపీ, వెస్ట్ జోన్ డీసీపీ ఏ ఆర్ శ్రీనివాస్ మాట్లాడుతూ స్పోర్ట్స్ బైకులు చోరీ లకు పాల్పడుతున్న ముఠాను అసిఫ్ నగర్ పోలీసులు ఎలా చెక్ పెట్టారో తెలియజేశారు. గుంటూరు కు చెందిన శివరాత్రి చందు,శివ నాగ ను అరెస్ట్ చేసి 8 స్పోర్ట్స్ బైకులు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. వీళ్లు హోటల్ లో స్టే చేసి, ఏరియాల్లో  బైక్ ల గురించి రెక్కీ చేసి కొట్టేస్తున్నారని చెప్పారు. శివ రాత్రి చందు యూట్యూబ్ లో  వీడియోస్ చూసి బైకులు ఎలా కొట్టే యాలో తెలుసుకున్నాడని.. చిన్న సేఫ్టీ పిన్ తో ఖరీదైన స్పోర్ట్స్ బైక్ లాక్ ఓపెన్ చేసి కొట్టేస్తాడన్నారు. కొట్టేసిన బైక్ లను గుంటూరులో పెట్టి.. నరసరావుపేటలో అమ్మేస్తున్నారని ఆయన తెలిపారు. ఈ ముఠా పై ఎస్ ఆర్ నగర్, అసిఫ్ నగర్  ,సైబరాబాద్, కెపిహెచ్ పి, గుంటూరులో, పిడుగురాళ్ల లో కేసులు ఉన్నాయని వివరించారు.